close

ప్ర‌త్యేక క‌థ‌నం

కుమ్మక్కై కొట్టేశారు! యూరియాను బుక్కేశారు!

రాష్ట్రంలో రూ.కోట్ల అవకతవకలు
గ్రామాల్లో అమ్మకాలు, పంపిణీలో గోల్‌మాల్‌
డీలర్లతో వ్యవసాయ సహకార సంఘాల మిలాఖత్‌
ఒక్కో రైతు పేరిట వందలాది బస్తాల విక్రయాలు
జిల్లావారీ విచారణలో బట్టబయలవుతున్న అక్రమాలు
ఈనాడు, హైదరాబాద్‌

వరంగల్‌ గ్రామీణ జిల్లా రేగొండ సహకార సంఘం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు వీరు. వీరికి ఎరువు ఇచ్చేందుకు మాడగాని సంతోషి అనే విద్యార్థి పేరుతో 6,173 బస్తాలు అమ్మినట్లు సంఘం తన రికార్డులో రాసింది. అయితే ఈ రైతులకు అసలు యూరియా అమ్మారా? అమ్మితే వాస్తవ ధరలకే ఇచ్చారా? అనేది తేల్చుకోడానికి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కొరత ఉండటం వేరు..  దాన్ని సృష్టించటం వేరు.. ఉన్నది లేనట్లు చూపటం.. అక్రమానికి తెరలేపటం, అస్మదీయుల అండతో రూ.కోట్లు కొల్లగొట్టడం.. రాష్ట్రంలో చోటుచేసుకున్న యూరియా అమ్మకాల్లో గోల్‌మాల్‌ ఇది. ఎరువుల అమ్మకాలు ఆన్‌లైన్‌లో నమోదైన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. లోతైన విచారణకు రాష్ట్ర సర్కారును ఆదేశించటంతో అసలు గుట్టు రట్టయింది. ఉన్నతాధికారులే నోరెళ్లబెట్టే పరిస్థితి తలెత్తింది.

స్వీపర్‌ పేరుతో 5802 బస్తాలు...

అతను వరంగల్‌ గ్రామీణ జిల్లా బుధరావుపేట గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో స్వీపర్‌. వ్యవసాయం చేయని వ్యక్తి. కానీ అతని పేరుతో ఏకంగా 5802 యూరియా
బస్తాలను విక్రయించారు. ఇదంతా పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదవడంతో సమాచారం కేంద్ర ప్రభుత్వానికి చేరింది. ఇతనొక్కడికే ఇన్ని వేల బస్తాలు ఎందుకిలా అమ్మారనే ప్రశ్నకు సంఘం నేతలు చెప్పే సమాధానం చిత్రంగా ఉంది. రైతులు వచ్చినప్పుడు వారి వివరాలన్నీ రాసుకుని అమ్మడం ఆలస్యమవుతుందని, వారికి బస్తాలిచ్చి డబ్బు తీసుకుని పంపేశాక.. తీరిగ్గా స్వీపర్‌ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. మరి బస్తా ధరపై అదనంగా వసూలు చేసిన సొమ్ము మాటేమిటన్న దానికి వారి వద్ద సమాధానం లేదు.

 

తెలంగాణలో నిజమైన పేద రైతులకు యూరియా దొరకకుండా కొరత సృష్టించి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంలో ఎరువుల కంపెనీలతో పాటు వ్యాపారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) నేతలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు ఎరువును అధిక ధరలకు అమ్మేసుకుంటున్నారు. బంధువులు, అనుచరులకు వందల బస్తాలు కట్టబెట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. కిందిస్థాయి వ్యవసాయాధికారులకు లంచాలు ముడుతున్నందున దారుణాలు వెలుగుచూడటం లేదు.

 

రాష్ట్రంలో ఎరువుల కొరతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.. లక్షల టన్నుల యూరియా ఇచ్చినా కొరత ఎందుకో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతీ జిల్లాలో ఎందరు రైతులకు యూరియా అమ్మారు, వారిలో అత్యధిక బస్తాలు కొన్న తొలి ముగ్గురు పేర్లు, వారు ఎంత కొన్నారు, వారికి ఉన్న భూమి ఎంత, అందులో ఏం పంట సాగుచేశారు,  వారు కొన్న యూరియాను నిజంగా ఆ పంటలకే వినియోగించారా.. అనే కోణంలో విచారణ జరపాలని కేంద్ర సర్కారు ఆదేశించింది.

‘యంత్రంలో ఆలస్యం’.. ఇదో సాకు
రైతులు ఎరువుల కోసం వచ్చినప్పుడు వారి ఆధార్‌ సంఖ్యలు, వేలిముద్రలను పాస్‌లో నమోదు చేయడానికి బాగా సమయం పడుతున్నందున వారిని పంపేసి వేరేవారి పేర్లతో అమ్మినట్లు వ్యాపారులు చెపుతున్నారు. కానీ ప్యాక్స్‌, డీలర్లు చాలాచోట్ల కుమ్మక్కై అస్మదీయులకే తొలుత అమ్మినట్లు ఆరోపణలున్నాయి. కొన్ని సంఘాలకు, డీలర్లకు అంతర్గత అక్రమ వ్యాపార సంబంధాలున్నాయి. రాష్ట్రప్రభుత్వం అత్యవసర సమయంలో రైతులకిచ్చేందుకు ‘రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య’(మార్క్‌ఫెడ్‌) వద్ద 3లక్షల టన్నులు ముందుగా కొని నిల్వ పెడుతోంది. వీటిని ప్యాక్స్‌ ద్వారానే అమ్మాలి. కానీ కొన్నిచోట్ల ప్యాక్స్‌ నుంచి డీలర్లకు వెళుతున్నాయి. ఏదో ఒక డీలర్‌కు ఇస్తే మిగతావారు గొడవలకు దిగినప్పుడు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో 905 ప్యాక్స్‌ ఉన్నాయి. వీటిలో 300 సంఘాలు సరైన వ్యాపారాలేమీ చేయడం లేదు. కానీ ఎరువుల వ్యాపారానికి మాత్రం బారులు తీరుతున్నాయి. ఒక్కో సంఘంలో సభ్యులైన రైతులెవరు, వారికి ఉన్న భూమి, అవసరమైన యూరియా, వారి పేరున ఎంత అమ్మారనే కోణంలో లోతుగా విచారణ జరిపితే అక్రమాలన్నీ బట్టబయలవుతాయని ఓ అధికారి ‘ఈనాడు’కు చెప్పారు. రాష్ట్రంలో గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ 15.34లక్షల టన్నుల ఎరువులను అమ్మినట్లు వ్యవసాయశాఖ ప్రభుత్వానికి తెలిపింది. కనీసం బస్తాకు రూ.30 చొప్పున అధికంగా వసూలు చేసినా రూ.100కోట్ల వరకూ ఎక్కువగా తీసుకున్నట్లు తేలుతుందని ఆయన వివరించారు.

 

పాస్‌లో నమోదుతో.. బండారం బట్టబయలు
యూరియాను ఫలానా వారికి మాత్రమే అమ్మాలనే నిబంధనేదీ లేదు. కానీ కొనే వ్యక్తి ఆధార్‌ సంఖ్యను, వేలిముద్రను ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’(పాస్‌) యంత్రంలో రికార్డు చేశాకే అమ్మాలి. ఒకసారి ఈ వివరాలు పాస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదైతే నేరుగా కేంద్ర ఎరువులశాఖ వెబ్‌సైట్‌లో నిక్షిప్తమవుతాయి. తెలంగాణలో కొందరు వ్యక్తుల పేరుతో వందలు, వేల బస్తాలు అమ్మినట్లు నమోదవటంతో కేంద్ర అధికారులకు సందేహాలు రేగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ.. తనిఖీల కోసం కొరత ఏర్పడిన జిల్లాలకు ఉన్నతాధికారులను పంపింది. వారి విచారణలో అంతులేని అక్రమాలున్నట్లు అనేకచోట్ల బయటపడింది. పేదరైతుల పేరుతో వారికి తెలియకుండానే ప్యాక్స్‌ ఉద్యోగులు, నేతల పేర్లతో లారీల కొద్దీ యూరియాను అక్రమంగా అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయించిన దాని ప్రకారం 45 కిలోల వేప పూత  యూరియా బస్తాను రైతుకు రూ.266కు మాత్రమే అమ్మాలని బస్తాపై స్పష్టంగా ముద్రించారు. కానీ, రాష్ట్రంలో  అత్యధిక శాతం మంది రైతులకు కొరత సాకు చూపి రూ.300 నుంచి రూ.350 దాకా అమ్ముతున్నారు.

అక్రమాలకు ఎలా పాల్పడ్డారంటే...
మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో ఓ ఎరువుల దుకాణం ఉంది. ఈ వ్యాపారి అంటే అక్కడ కొందరికి భయం. ఇతని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న కె.కొండయ్య అనే వ్యక్తి పేరుతో 125 బస్తాల యూరియా అమ్మినట్లు నమోదు చేశారు. ఈ విషయం తనిఖీలో బయటపడినట్లు వ్యవసాయశాఖ    ధ్రువీకరించింది.
ఇదే మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన ముత్తయ్యకు మూడెకరాల భూమి ఉంది. ఇతని పేరుతో 140 బస్తాల యూరియా అమ్మేశారు.
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి ఆనుకుని అనంతారం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి పేరుతో 90 యూరియా బస్తాలు అమ్మినట్లు రికార్డుల్లో రాశారు. ఇంతకీ అతనికి ఉన్న భూమి ఒకటిన్నర ఎకరాలే. దానికి మూడు బస్తాలకు మించి యూరియా అవసరమే లేదు.

ఒక్కరికే 7173 బస్తాలు...

మెదక్‌ జిల్లా రామాయంపేట గ్రామంలో పిట్ల శ్రీనివాస్‌ అనే వ్యక్తి అక్షరాలా 7173 యూరియా బస్తాలు కొన్నారు. ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నపుడు ఈయనొక్కరికే ఇన్ని వేల బస్తాలు ఎలా అమ్మారనేది కీలకంగా మారింది. రాష్ట్రంలో ఇలా అనేక మంది వ్యక్తుల పేర్లతో వందలు, వేల బస్తాల యూరియాను అమ్మినట్లు వ్యాపారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వీరికెంత భూమి ఉందని విచారణ జరిపితే అసలు భూమి లేనివారూ ఉన్నట్లు తెలిసి అధికారులే నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలో యూరియా అక్రమాల్లో ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

వరంగల్‌ గ్రామీణ జిల్లా ఖానాపూర్‌ సహకార సంఘం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులు. వీరందరికీ ఎరువు అందజేసినట్లు, ఈ సంఘంలో మల్లికార్జున్‌ అనే వ్యక్తి పేరుతో 3648 బస్తాలు అమ్మినట్లు ఆన్‌లైన్‌లో సంఘం నమోదు చేసింది. మరి అన్ని బస్తాలూ రైతులకు అందాయో లేదో సంఘానికే తెలియాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.