close

ప్ర‌త్యేక క‌థ‌నం

అన్నం పెట్టే రైతన్నను.. కాలుష్యం కాటేసింది!

రసాయన వ్యర్థాలతో విషంగా భూగర్భ జలం
హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో తీవ్ర ఇక్కట్లు
ఎకరాల కొద్దీ భూములున్నా సాగు చేయలేని దుస్థితి
నీటి వనరుల్లో కలుస్తున్న పరిశ్రమల వ్యర్థాలు
అంతా బహిరంగంగానే జరుగుతున్నా నామమాత్ర చర్యలే
‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలన

ఈనాడు, సంగారెడ్డి: ఒకప్పుడు పచ్చని పంటలు పండిన భూములవి. పాడికీ కొదవలేని పల్లెలవి. రాజధానికి సమీపంలో ఉన్న ఈ ఊర్లలో అన్నదాతలు పొలాల్లో స్వేదం చిందిస్తూ కనిపించేవారు. పైరగాలిని ఆస్వాదిస్తూ కష్టాన్ని మర్చిపోయేవారు. ఇదంతా గతం. బోరు మోటారు వేస్తే పసుపు రంగులో వచ్చే నీళ్లు. విషజలాలతో తడిచి సారాన్ని కోల్పోయిన భూములు. పరిశ్రమల వైపు నుంచి గాలి తమ పల్లెవైపు వీస్తోందంటే గడగడ వణికిపోయే జనాలు. ఇదీ ప్రస్తుతమున్న దుస్థితి.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారం, గుమ్మడిదల, అమీన్‌పూర్‌ మండలాల పరిధిలో గడ్డపోతారం, ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లిలలో పరిశ్రమలున్నాయి. ఇందులోనూ అత్యధికం ఔషధ తయారీవే. రసాయన వ్యర్థ జలాలు యథేచ్ఛగా నీటివనరుల్లో కలుపుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మూడు మండలాల పరిధిలోని చెరువుల కింద భూముల్లో సాగుచేయలేని పరిస్థితి. చుట్టుపక్కల గ్రామాల్లోని భూగర్భజలాలూ పూర్తిగా పాడైపోయి.. బోర్ల నుంచి రంగుమారిన జలాలు వస్తుండటం తీవ్రతకు నిదర్శనం. దీంతో దాదాపు 3,500ల ఎకరాల భూములు సాగుకు పనికిరాకుండా పోయాయి. ఈ గ్రామాల్లో ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ పరిశీలన చేపట్టింది.

పశుసంపదా కనుమరుగు

హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో ఇక్కడి ప్రజలకు పాడి పోషణా ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. కాలుష్యం కారణంగా పశువులనూ సాకలేక పోతున్నారు. చెరువులు, బోర్లలోని నీళ్లను తాపితే మూగజీవాలు అనారోగ్యం బారినపడుతున్నాయి. పాలు సరిగా ఇవ్వడం లేదు. కొన్నిసార్లు పాలు సైతం వాసన వస్తున్నాయి. దీంతో క్రమంగా పశువులను అమ్మేసే పరిస్థితి.
* జిన్నారం మండలం గడ్డపోతారంలో పరిశ్రమల పక్కనున్న భూముల్లో రసాయన వ్యర్థ జలాలు ఊటల మాదిరిగా ఉబికొస్తున్నాయి. అటు నుంచి వెళ్తుంటే ఘాటు వాసనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక్కడి నుంచి నేరుగా ఈ విషపు నీళ్లన్నీ చెరువుల్లోకి చేరుతుంటాయి.

గ్రామస్థులే ఏకమై పరిహారం తెచ్చుకుంటున్నారు .
 

* గుమ్మడిదల మండలం బొంతపల్లిలో కాలుష్య జలాల వల్ల 650 ఎకరాలు బీడుగా మారాయి. కంపెనీలు ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల చుట్టూ తిరిగినా.. ప్రయోజనం దక్కలే. దీంతో బాధితులే కాలుష్య నివారణ రైతు సంఘంగా ఏర్పడి నష్టపోయిన రైతులందరినీ గుర్తించారు. ఆ తీవ్రతను బట్టి భూములను మూడు కేటగిరీలుగా విభజించారు. ఏటా రూ.36 లక్షలు పరిశ్రమల నుంచి వసూలు చేసుకొని బాధితులు పంచుకుంటున్నారు.
* కాలుష్య జలాలు బయటకు రాకుండా అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవడం లేదు. రైతులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం నామమాత్రమే. గట్టిగా ప్రశ్నించే కొందరికి కొంత పరిహారం ముట్టజెప్పుతున్నారు.
* పటాన్‌చెరు, కంది, హత్నూర మండలాల్లో నక్కవాగు ప్రవహిస్తుంది. దీని చుట్టుపక్కల ఉన్న 20 గ్రామాల్లోని రైతులు ఈ నీటిని సాగుకు ఉపయోగించలేని దుస్థితి. వీరికి మూడో విడతగా రూ.20లక్షల మేర పరిహారం అందాల్సి ఉంది. అధికారుల సమన్వయం లోపంతో పంపిణీలో జాప్యం జరుగుతోంది.
* జహీరాబాద్‌ నియోజకవర్గంలోని రెండు పరిశ్రమల వల్ల 400 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోందని అధికారులు గుర్తించారు. బాధిత రైతులకు పరిహారమిచ్చే అంశమై కమిటీని నియమించి కసరత్తు చేస్తున్నారు.
* బోరులో నీళ్లు పాడైపోవడంతో పదేళ్లుగా తన మూడెకరాల భూమిని పడావుగానే ఉంచానని చెట్లపోతారానికి చెందిన కాడారి సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు.

తిండి గింజలూ పండించుకోలేకపోతున్నాం
- కొలుకూరు బీరప్ప, బొంతపల్లి

మా ఊరికి సమీపంలోని పరిశ్రమల వ్యర్థాలతో వరి నారు పోస్తే మొలవదు. ఎవరైనా ఇంటి వరకు బియ్యం పండించుకోవాలన్నా దూరంగా ఉన్న ఊళ్ల నుంచి నారు కొనుక్కోవాలి. కేవలం బోరు నీళ్లే కాకుండా వానలు పడితేనే ఎన్నో కొన్ని గింజలు చేతికొస్తాయి.

కంపెనీలు వచ్చాక తలరాత మారింది

- కొడకంచి నర్సింహులు, కిష్టాయపల్లి

మాకు 4 ఎకరాల భూమి ఉంది. ఒకప్పుడు చాలా పశువులను సాదేవాళ్లం. గ్రామంలో పాలు, పెరుగు బాగా దొరికేవి. కంపెనీలు వచ్చాక మా తలరాత మారిపోయింది. దాదాపు 400లకు పైగా ఎకరాల భూమి పాడైంది. రసాయనాల వాసనతో కనీసం చెరువుల్లో పశువులకు నీళ్లు తాగించలేని పరిస్థితి. వాటికి రసాయనాల వాసన అర్థమై మంచినీళ్లు పోస్తేనే తాగుతున్నాయి.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.