close

ప్ర‌త్యేక క‌థ‌నం

మీ కారు.. మీకు నచ్చినట్లు!

  త్వరలో వెబ్‌సైట్‌ ద్వారా కస్టమైజేషన్‌ సేవలు
  ప్లాస్టిక్‌ రహిత వాహనాల తయారీ అసాధ్యం
  ‘ఈనాడు’ ముఖాముఖిలో టాటా మోటార్స్‌ డిజైనింగ్‌ విభాగాధిపతి ప్రతాప్‌ బోస్‌

‘‘వినియోగదారుల అభిరుచులు కొత్త  పుంతలు తొక్కుతున్నాయి. వాహనాలను వారి ఇష్టాలకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. రహదారులపై టాటా ఉన్నతశ్రేణి కార్లను చూస్తున్నప్పుడు నాకే ఆశ్చర్యమేస్తోంది. బాడీకి కొత్తరంగు, బంపరు, చక్రాలు.. ఇలా విడిభాగాలను ప్రత్యేకంగా సమకూర్చుకుంటున్నారు. ఈ సంస్కృతిని మా సంస్థ త్వరలో అందిపుచ్చుకోబోతోంది’’ అని టాటా మోటార్స్‌ డిజైనింగ్‌ విభాగాధిపతి ప్రతాప్‌ బోస్‌ పేర్కొన్నారు. విభిన్నంగా ఉండే విడిభాగాలను తయారుచేసి మోడళ్లవారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచే కసరత్తు మొదలైందన్నారు. ఈ ప్రక్రియను కస్టమైజేషన్‌ అని కాకుండా పర్సనలైజేషన్‌ అని పిలవాలన్నారు. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో శుక్రవారం మొదలైన ‘హైదరాబాద్‌ డిజైన్‌ వీక్‌’కు వక్తగా హాజరైన సందర్భంగా ప్రతాప్‌ ‘ఈనాడు’ ముఖాముఖిలో డిజైన్‌ రంగంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కారు డిజైన్‌ మొదలుపెట్టినప్పుడు ఏం ఆలోచిస్తారు?
ఓ కుటుంబం కారు గురించి ఏం ఆలోచిస్తుందో ఊహించడంతో మొదటి అడుగు పడుతుంది. ఇంటిపెద్ద, గృహిణి, పిల్లలు, వృద్ధులు రకరకాల సౌకర్యాలపై చర్చిస్తారు. మా మోడళ్లను ఎంచుకునేలా డిజైన్‌ ప్రభావితం చేస్తుంది. దాన్ని అధిగమించేందుకు మార్కెటింగ్‌ బృందం, ప్రొడక్ట్‌ ప్లానింగ్‌ విభాగాలు రకరకాల సూచనలిస్తాయి. యూనిక్‌, ట్రెండీ, యూత్‌ఫుల్‌, ఈస్థటిక్‌, సమకాలీన, భవిష్యత్తును ప్రతిబింబించేలా ఉండాలని లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. వాళ్లు చెప్పినవాటిని 2డీలో గీసి, 3డీ చిత్రంతో మెప్పించడంతో నా పని ముగుస్తుంది.

ప్లాస్టిక్‌ లేకుండా వాహనాలను తయారు చేయలేరా?
అస్సలు కుదరదు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, వాహనం తుక్కుగా మారాక పునర్వినియోగానికి ఉపయోగపడే ప్లాస్టిక్‌ను వినియోగించడమే ప్రత్యామ్నాయం. బంపర్‌, అద్దాలు, వాహనం లోపలి భాగాలకు, విడిభాగాలకు ప్లాస్టిక్‌ను వినియోగించాల్సిందే. ఆయా పరికరాల పరిమాణాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముడిసరకు ఏ రంగులో ఉంటే.. అదేరంగు ప్లాస్టిక్‌ వస్తువులను ఉపయోగిస్తే మరింత ఉపయోగం.

ట్రక్కుల విషయంలో ఎలాంటి పరిశోధన చేస్తున్నారు?
భారత్‌లో ట్రక్కులు, లారీల మార్కెట్‌ చాలా పెద్దది. తలపై టవలు కట్టుకుని, చెమటపట్టిన దుస్తులు, అలసిన ముఖంతో డ్రైవర్లు దీనంగా ఉండటంపై నాకు చాలా అసంతృప్తి ఉంది. లగ్జరీ కారులాగే లారీడ్రైవరు క్యాబిన్‌ ఎందుకు ఉండకూడదు? తక్కువఖర్చుతో ఏసీ, ఛార్జింగ్‌ సదుపాయం, పవర్‌ స్టీరింగ్‌, ఆకర్షణీయమైన గేర్‌ రాడ్‌, సౌకర్యవంతమైన కుర్చీని సమకూర్చడంపై దృష్టిపెట్టాం.

డిజైనింగ్‌ రంగాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు?
వాహనరూపాన్ని డిజైన్‌ చేసిన రెండున్నరేళ్ల నుంచి మూడేళ్లకు వస్తువు రూపుదిద్దుకుంటుంది. అది మార్కెట్లో పదేళ్లు నిలవాలి. అంటే మన ఊహకు 13 ఏళ్ల భవిష్యత్తు ఉండాలి. వినియోగదారుల మనస్తత్వాలు, భవిష్యత్తు ట్రెండ్స్‌, ప్రస్తుత, ముందుతరానికి నచ్చే రంగులు.. వీటన్నింటి ఆధారంగా మేం డిజైన్లు గీస్తాం. ఈ నైపుణ్యాలను పాఠశాల విద్యనుంచే చిన్నారులకు నేర్పించాలి. ట్విట్టర్‌లో యువత కారు డిజైనర్‌ కావాలంటే ఏంచేయాలని అడుగుతారు. దీనిపై మన దేశంలో కసరత్తు జరగట్లేదు. వాహనరంగంలో భారత్‌ నాలుగో పెద్దదేశమైనా.. ఇక్కడున్న నాలుగు కంపెనీలదే హవా. నిస్సాన్‌, ఇతరత్రా విదేశీసంస్థలు డిజైనింగ్‌ స్టూడియోలు ఏర్పాటుచేయాలి.

హైదరాబాద్‌ గురించి మీ అభిప్రాయం?
విమానాశ్రయంలో దిగగానే నేరుగా వేదిక వద్దకు వచ్చేశాను. నగరంలో తిరగలేదు. ఇంకా బిర్యానీ తినలేదు. దారిలో నేను గమనించిన వాతావరణాన్ని చూస్తే హైదరాబాద్‌ చాలా బాగుంది. మంచిరోడ్లు, పచ్చని వాతావరణం, పరిశుభ్రత మెప్పించాయి. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ఐకియా లాంటి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందంటే వేరే చెప్పనక్కర్లేదు.

టాటా డిజైనింగ్‌ స్టూడియోను హైదరాబాద్‌లో ప్రారంభిస్తారా?
ప్రస్తుతానికి లేదు. పుణేలో, ఇటలీ, మరో రెండు దేశాల్లో ఇప్పటికే పూర్తిస్థాయి స్టూడియోలున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.