close

ప్ర‌త్యేక క‌థ‌నం

గరం గరం సరిహద్దు

ఇథియోపియా-ఎరిట్రియా మధ్య 2 దశాబ్దాలపాటు ఉద్రిక్తతలు
బాడ్మే పట్టణం కోసం ఘర్షణ


 

ఏడిస్‌ అబాబా: ఇథియోపియా ప్రధాని అబియ్‌ అహ్మద్‌కు నోబెల్‌ శాంతి పురస్కారం దక్కడానికి ప్రధాన కారణం.. పొరుగు దేశం ఎరిట్రియాతో సరిహద్దు ఘర్షణలను నివారించేందుకు ఆయన చేసిన కృషి. రెండు దశాబ్దాలపాటు ఇబ్బందిపెట్టిన ఆ సమస్యను అబియ్‌ ప్రధాని పీఠమెక్కిన నెలల వ్యవధిలోనే పరిష్కరించి అందరి మన్ననలు అందుకున్నారు. శాంతి స్థాపనే లక్ష్యంగా బాడ్మే అనే ఓ పట్టణం ఇరుదేశాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా నిలవగా.. శాంతి స్థాపనే లక్ష్యంగా ఆ పట్టణాన్ని వదులుకునేందుకు అంగీకరించారు.

లక్ష మంది బలి
‘ఆఫ్రికా కొమ్ము’(హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికా)గా పిలిచే ప్రాంతంలో ఇథియోపియా, ఎరిట్రియా ఉన్నాయి. రెండూ పేద దేశాలే. ఇథియోపియా నుంచి విడిపోయి ఎరిట్రియా ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. సరిహద్దుల్లోని బాడ్మే పట్టణాన్ని తమ భూభాగంలో కలుపుకునేందుకు ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఫలితంగా యుద్ధం తలెత్తింది. 1998 నుంచి రెండేళ్లదాకా అది కొనసాగింది. ఓ ఒప్పందంతో యుద్ధం ఆగినా.. ఇరుదేశాల మధ్య సరిహద్దు సంక్షోభం రెండు దశాబ్దాలపాటు కొనసాగింది. ఫలితంగా దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. చమురు వనరులు, వజ్రపు గనులు, ఇతర ప్రత్యేకతలేవీ లేని బాడ్మే కోసం ఇథియోపియా, ఎరిట్రియా తీవ్రంగా పోరాడటాన్ని
‘బట్టతల ఉన్న ఇద్దరు వ్యక్తులు దువ్వెన కోసం కొట్టుకోవడం’గా విశ్లేషకులు గతంలో అభివర్ణించారు.

అబియ్‌ రాకతో..
అబియ్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎరిట్రియాకు స్నేహహస్తం అందించారు. షరతులేవీ లేకుండానే శాంతి ఒప్పందంపై సంతకం చేసేందుకు ముందుకొచ్చారు. బాడ్మేను వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అది స్వదేశంలో కొంతమందికి రుచించలేదు. అబియ్‌ని గ్రెనేడ్‌ దాడిలో పొట్టనపెట్టుకునేందుకు ఓసారి దుండగులు ప్రయత్నించారు కూడా. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. శాంతి ఒప్పందంపై గత ఏడాది జులైలో సంతకం చేశారు. ఆ దేశంతో సరిహద్దులను తిరిగి తెరిచారు. ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించారు.

ఐరాస శాంతి పరిరక్షకుడిగా విధులు
1976 ఆగస్టు 15న దక్షిణ ఇథియోపియాలోని అగరోలో అబియ్‌ జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం. తల్లి క్రైస్తవ మతస్థురాలు. శాంతి, భద్రతా వ్యవహారాల్లో అబియ్‌ డాక్టరేట్‌ పట్టాలు పొందారు. సైన్యంలో పనిచేశారు. అనంతరం రువాండాలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) శాంతి పరిరక్షకుడిగా విధులు నిర్వర్తించారు.

సవాలుగా మారిన ఘర్షణలు
ఇథియోపియాలో మతాల మధ్య ఘర్షణలు ప్రస్తుతం అబియ్‌కు పెను సవాల్‌ విసురుతున్నాయి. వాటిలో ఇప్పటివరకు 1,200 మంది మృత్యువాతపడ్డారు. 12 లక్షమంది వలసబాట పట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. అబియ్‌ చేపట్టిన కొన్ని సంస్కరణల వల్లే ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయన్నది కొందరి అభిప్రాయం. ప్రస్తుతం ఆయన వయసు 43 ఏళ్లు. ఆఫ్రికాలో అత్యంత యువ దేశాధినేతగా ఆయన రికార్డులకెక్కారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.