close

ప్ర‌త్యేక క‌థ‌నం

మూడు నెలల్లో ముచ్చటైన రూపం

ట్రాన్స్‌ఫర్మేషన్‌ పేరిట ప్రత్యేకమైన కసరత్తులు
కుర్రకారుతో పోటీపడుతున్న మధ్యవయస్కులు
కాస్తంత కష్టపడితే శరీరాకృతిలో మార్పుసాధ్యమే

 

పక్కింటి ఎల్కేజీ బాబైనా ఆంటీ అని పిలిస్తే చాలు..  అమ్మాయిలు ఉలిక్కిపడతారు.. మహిళలైతే చికాకుపడిపోతారు. పొద్దున తీసుకున్న సెల్ఫీలో అంత చూడముచ్చటగా ఉంటే ఈ పోరడేంటి ఆంటీ అంటున్నాడని ఉడుక్కుంటారు.. వెంటనే బరువు తగ్గాలనీ, నాజూగ్గా తయారవ్వాలనీ తీర్మానం చేసేసుకుంటారు. ముప్ఫయ్యేళ్ల వయసున్న యువకుణ్ణి ఎవరైనా అంకుల్‌ అని పిలిస్తే.. ఉన్నపళంగా లావు తగ్గాలని.. ఈసారి ప్యాంటు సైజ్‌ 32కు మించకుండా చూసుకోవాలని జాగ్రత్తపడిపోతాడు..

ఇలాంటివారి కోసం సరికొత్తగా పుట్టుకొచ్చిందే ‘ట్రాన్స్‌ఫర్మేషన్‌’ విధానం. బరువు తగ్గించి.. మనిషిని దృఢంగా మార్చే వ్యాయామ ప్రక్రియ ఇది. ఒంట్లో అనవసరంగా పెరిగిన కొవ్వు శరీరాకృతిని దెబ్బతీస్తుందని ఆవేదన చెందేవాళ్లు.. ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ.. క్రమం తప్పని వ్యాయామంతో రూపాన్ని మళ్లీ అపురూపంగా మార్చుకునే ఆధునిక కసరత్తులు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఫిట్‌ ఇండియా’ పిలుపుతో ఈ వ్యాయామాలకు ఆదరణ పెరిగింది. శరీరాకృతిని తీర్చిదిద్దుతున్న ఈ సరికొత్త పోకడలపై ప్రత్యేక కథనం
 

పాతికేళ్ల వయసులో గువ్వలా తేలిగ్గా ఉండే శరీరం.. పూటకూళ్ల ఇంట్లో తిన్నా పట్టలేనంత హుషారు! తర్వాత ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు.. ఎడతెగని అలసట.. జీవనశైలిలో మార్పులు.. ఆహారంపై నియంత్రణ లేకపోవడం.. హార్మోన్లలో అసమతుల్యత.. శారీరక శ్రమ తగ్గటంతో మనకు తెలియకుండానే మారిపోయే రూపం! పెళ్లయిన పదేళ్ల తర్వాత రహస్యాలెన్నో దాచుకున్నట్లుగా పొట్ట ముందుకు పొడుచుకొస్తుంది. సెల్ఫీ తీసుకోవాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. గ్రూప్‌ ఫొటో దిగాలంటే పొట్టను లోపలికి బిగపట్టాల్సిన అవస్థ! ఇలాంటి నిస్తేజం నుంచి తిరిగి సాధారణ స్థితికి చేరేందుకు వ్యాయామ కేంద్రాల్లో సరికొత్త శిక్షణ అందుబాటులోకి వచ్చింది. అదేదో పాత జానపద సినిమాలో మాదిరిగా వంద రోజుల్లో రూపాన్ని మార్చుకునేలా ‘ట్రాన్స్‌ఫర్మేషన్‌’ పేరిట ప్రత్యేక తర్ఫీదుతో తీర్చిదిద్దుతున్నారు.

అసలు స్థూలకాయం లేదా కొవ్వు పెరగడం వంటివి వయసు మీదపడటం వల్ల వచ్చే సమస్యలే కాదని.. హార్మోన్ల అసమతుల్యత, రక్తంలో పెరిగే కొవ్వు, శారీరక వ్యాయామం లేకపోవడమే కారణమంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. 90 నుంచి 100 రోజుల పాటు.. నియమబద్ధంగా వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లు.. జీవనశైలి మార్పులతో రూపాన్ని మార్చుకోవడమే ట్రాన్స్‌ఫర్మేషన్‌ అని సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ శిక్షకులు జి.ఈశ్వర్‌ వివరించారు. నగరాల్లో 30-45 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు, పురుషులు తమను తాము శారీరకంగా మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు. స్పూర్తితో చాలామంది మహిళలు వ్యాయామ సాధన వైపు అడుగులు వేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా. నాలుగు పదులు దాటిన గృహిణులు కూడా శరీరాకృతి కోసం శాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తున్నారు.

ఎలా చేస్తారు?
ట్రాన్స్‌ఫర్మేషన్‌ (పరివర్తన) విధానం 100 రోజుల వ్యవధికి రూపొందించిన ప్రణాళిక. ఆధునిక జిమ్‌లు, యోగా శిక్షణ కేంద్రాల్లో శిక్షణార్థులకు ముందుగా ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తారు. మహిళలు, పురుషులు, యువతీ యువకులకు వివిధ పరీక్షల ద్వారా అంతర్గత అవయవాల పనితీరు, రక్తంలో కొవ్వు శాతం, శరీర ధర్మం వంటి అంశాలను పరిశీలించి వాటికి తగినట్టుగా వ్యాయామం నిర్ణయిస్తారు. వయసు, శారీరక సామర్థ్యం, ఆరోగ్యం ఆధారంగా శిక్షణ ఇస్తారు.

క్రాస్‌ఫిట్‌, బాడీ స్ట్రెంతెనింగ్‌, కార్డియో, ఏరోబిక్స్‌ వంటివి ప్రతిరోజూ 45-90 నిమిషాలపాటు సాధన చేయిస్తారు. శరీరంలో కొవ్వు శాతాన్ని అంచనా వేసేందుకు రక్తనమూనాలను పరీక్షిస్తారు. వాటికి అనుగుణంగా ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు అందిస్తారు. వ్యాయామం చేస్తూ.. పుష్కలమైన పోషకాలుండే మితాహారంతో శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చనేది నిపుణుల మాట.

ప్రతి 100 మందిలో 60 నుంచి 65 మందిలో రక్తంలో కొవ్వుశాతం అధికంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. దీనిలో చెడు కొవ్వు ఎక్కువగా ఉండటం.. దీనివల్ల కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతున్నట్లు నిర్ధారించారు. జీవనశైలి మార్పుతో.. శరీరాన్ని కదల్చకుండా ఒకేచోట ఉంచటం   వల్ల సమస్య తలెత్తినట్లు వ్యాయామ నిపుణులు చెబుతున్నారు.

అపొద్దు.. కొనసాగించాలి

వ్యాయామంతో రూపం ఒక్కటే కాదు ఆరోగ్యమూ బావుంటుంది. అందుకే ట్రాన్స్‌ఫర్మేషన్‌ విధానంపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ పద్ధతిలో కండలు పెంచటం ప్రధానం కాదు. శాస్త్రీయ విధానంతో శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేలా పరివర్తన తీసుకురావటమే ప్రత్యేకత. అయితే ఇటువంటి కోర్సుల పేరిట వచ్చే ప్రకటనలతో జాగ్రత్తగా ఉండాలి. సుశిక్షితులైన నిపుణుల వద్ద మాత్రమే తర్ఫీదు పొందాలి. కొద్దిమంది తమలో మార్పు రాగానే వ్యాయామం నిలిపివేయడమో.. వాయిదా వేయడమో చేస్తున్నారు. ఫలితంగా కొద్దిరోజులకే తిరిగి పాత స్థితికి  చేరుతున్నారు. వ్యాయామం జీవితంలో భాగం కావాలి.
-  జి.ఈశ్వర్‌, సెలిబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌, మాస్టర్‌ కోచ్‌ అకాడెమీ

45 ఏళ్ల కండల మహిళ..

ఒంటినిండా కండలతో కనిపిస్తున్న ఈమె పేరు కిరణ్‌ డాంబ్లే.  ప్రస్తుతం 8 ప్యాక్‌తో ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. మహిళా బాడీబిల్డర్‌గా ఎన్నో పోటీల్లో సత్తాచాటారు. ఆగ్రాలో పుట్టినా కొన్నాళ్లకు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమె బరువు 80 కిలోలకు చేరింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం ప్రారంభించారు. ఏడాదిపాటు ఆహార నియమాలు, పోషకాహారం, కఠోర పరిశ్రమతో 55 కిలోలకు చేరారు. అప్పటికి ఆమె వయసు 32. ఇది 2006లో మాట. తర్వాత క్రమంగా వ్యాయామానికే సమయం కేటాయించారు. 40కు చేరువ అవుతున్న సమయంలో కఠోర సాధనతో సిక్స్‌ ప్యాక్‌ రూపాన్ని సాధించారు. 45 ఏళ్ల వయసులో ప్రస్తుతం 8 ప్యాక్‌ శరీర సౌష్టవంతో ప్రత్యేకంగా నిలిచారు. క్రమంగా తానే ఒక శిక్షకురాలిగా మారారు. సినీ తారలు తాప్సీ, తమన్నా, అనుష్క, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నటుడు   ప్రకాశ్‌రాజ్‌, దర్శకుడు రాజమౌళి వంటి ప్రముఖులకు శిక్షణ ఇస్తున్నారు.

తలచుకుంటే ఏదైనా సాధ్యమే
 కిరణ్‌ డాంబ్లే, సెలిబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

సామాన్య గృహిణినైన నేను.. ఫిట్‌నెస్‌పై ఆసక్తి.. అభిరుచితో ఈ లక్ష్యాన్ని చేరా. నలభై ఐదేళ్ల వయసులో నేను 8 ప్యాక్‌ చేయటానికి ఆత్మవిశ్వాసమే కారణం. ట్రాన్స్‌ఫర్మేషన్‌లో యోగాసనాలు, వ్యాయామం, ఏరోబిక్స్‌, ఆహార నియమాలు ఉంటాయి. యోగా, వ్యాయామం కాంబినేషన్‌తో శరీరాన్ని ఫిట్‌గా ఉంచవచ్చు. శరీరాకృతి మార్చుకునేందుకు 75 శాతం ఆహారమే కీలకం.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.