close

ప్ర‌త్యేక క‌థ‌నం

సందేహాలు తీరితేనే రైతుకు భరోసా

క్షేత్రస్థాయిలో ఎన్నో అనుమానాలు
వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ సమాధానాలు
ఈనాడు - అమరావతి

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకానికి అర్హత పొందేందుకు రైతులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి గురించి క్షేత్రస్థాయిలో ఎవరిని అడగాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ‘ఈనాడు’ వివిధ సందేహాలను సేకరించి వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లి సమాధానాలు రాబట్టింది. ‘రైతుభరోసాకు మరింత మంది అర్హులను గుర్తించేందుకు వీలుగా ఆధార్‌, ప్రజాసాధికార సర్వే, బ్యాంకు ఖాతాల అనుసంధానం చేయిస్తున్నాం. మొత్తంగా 19 లక్షల ఖాతాలకు ఈ తరహా ఇబ్బందులున్నాయి.వీటిని ఎలా సరిదిద్దాలో సంయుక్త కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ప్రజాసాధికార సర్వే చేయించేందుకు ఏర్పాట్లు చేశాం. వెబ్‌ల్యాండ్‌ సమస్యలు సరిదిద్దడంతోపాటు ఎప్పటికప్పుడు డ్యాష్‌బోర్డులో వివరాలు కన్పించేలా చేశామ’ని ఆయన వివరించారు.  

భూయజమానికి ప్రజాసాధికార సర్వే తప్పనిసరా?
వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకాలకు కుటుంబం యూనిట్‌గా తీసుకుంటున్నాం. వెబ్‌ల్యాండ్‌, ఆధార్‌లలో కుటుంబ వివరాలు ఉండవు. అందుకే ప్రజాసాధికార సర్వేను ప్రాతిపదికగా తీసుకున్నాం.
? అప్పట్లో అందరూ పీఎస్‌ఎస్‌ చేయించుకోలేకపోయారు?
ఒకసారి అప్‌డేట్‌ చేసుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలకూ వర్తిస్తుంది.
? ఇప్పుడు చేయించుకోవాలన్నా సిబ్బంది, ట్యాబ్‌ల కొరతతో రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.. ఏం చేయాలి?
ప్రస్తుతం పీఎస్‌ఎస్‌ చేయాలంటే మండలానికి రెండు ట్యాబ్‌లే ఉన్నాయని కలెక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లడానికి సిబ్బంది కూడా కావాలి. ఇంకొన్ని ట్యాబ్‌లు, సిబ్బందిని ఇవ్వాలని అడిగారు. కలెక్టర్లకు సహకరించేందుకు జిల్లాకు ఒక ఆర్టీజీ అధికారిని పంపాô. వారు ఒక్కో గ్రామంలో ఒక్కో ఉద్యోగికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. మండల కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేకుండా గ్రామంలోనే సర్వే చేయించే ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం వివరాల్లోకి వెళ్లకుండా కుటుంబంతో వ్యక్తి సంబంధం, రైతు భరోసా కోసం ఇంకే వివరాలు కావాలో అంతవరకే తీసుకోవాలని సూచించాం.
? కొందరు పీఎస్‌ఎస్‌ చేయించుకున్నా.. లేనట్లు కన్పిస్తోంది. వీఆర్వో దగ్గరకు వెళ్తే ఉందని వస్తోంది.
అలాంటి అవకాశం ఉండదు. ఎక్కడైనా కన్పిస్తే అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిశీలించి సరిదిద్దుతారు.
? పథకానికి రేషన్‌ కార్డు తప్పనిసరిగా కావాలా?
అవసరం లేదు. పీఎస్‌ఎస్‌, ఆధార్‌, వెబ్‌ల్యాండ్‌ వివరాలు చాలు.
? కొందరికి ఏపీలో పొలాలు ఉన్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు చిరునామాలతో ఆధార్‌ ఉంది. వారు అర్హులేనా?
భూమి మన రాష్ట్రంలోనే ఉంటే తాత్కాలిక వలస కింద పరిగణించి అర్హులుగా గుర్తిస్తాం. సాగు చేస్తున్నారా? వారి అనుభవంలో ఉందా? పరిశీలిస్తాం.
? ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానంలో సమస్యలున్నాయి?
కొందరు భూయజమానుల మొబైల్‌ నంబర్లు దొరకడం లేదని ఎంపీఈఓలు తెలిపారు. ఖాతా వివరాలిచ్చినా సీడింగ్‌ కాలేదని కొందరు భూయజమానులు చెబుతున్నారు. వీటిపై ఎల్‌డీఎంల ద్వారా బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. రైతులు ఆధార్‌ అనుసంధానం కోసం వస్తే వెంటనే చేయాలని కోరాం.
? కొందరికి పాసుపుస్తకాలున్నా వెబ్‌ల్యాండ్‌లో పేరు లేదు. మరికొందరి భాగపంపిణీ పూర్తి కాలేదు. వీరు అర్హత సాధించేదెలా?
పాసుపుస్తకం, టైటిల్‌డీడ్‌ ఉన్నా చాలామంది రైతుల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో లేవు. త్వరలో సవరిస్తామన్నారు. భూమిపై న్యాయపరమైన హక్కులు ఎవరికి ఉన్నాయో నిర్ణయించాల్సింది వారే.
? వారసత్వ ధ్రువీకరణలు, భర్త చనిపోయినప్పుడు భార్య పేరుతో వెబ్‌ల్యాండ్‌ కాకపోవడం వంటి సమస్యల్లో ఏం చేయాలి?
భూయజమాని చనిపోతే ఆయన భార్యకు వర్తింపజేయాలని ఆదేశించారు. ఇలాంటివి 1.37 లక్షల కేసులు ఉన్నాయి.
? ఒకే కుటుంబంలో తండ్రి, పెళ్లయిన కొడుకులు ఉంటే విడిగా చూస్తారా?
పీఎస్‌ఎస్‌ సర్వేలో విడివిడిగా నమోదైతే విడివిడిగా భరోసా ఇస్తాం. ఒకే కుటుంబంగా ఉంటే ఒకరికే ఇస్తాం. వివాహమైందని ధ్రువీకరిస్తే ఒకే ఇంట్లో ఉన్నా.. భూమి ఉంటే మరో కుటుంబం కింద గుర్తిస్తాం.
? అర్హత సాధించడం, దానికి ఎలాంటి పత్రాలు కావాలో ఆన్‌లైన్‌లో తెలుసుకునేదెలా?
రైతుభరోసా వెబ్‌సైట్లోకి వెళ్లి రైతుల ఆధార్‌ సంఖ్య నమోదు చేస్తే వివరాలు కనిపించే ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి నిధులు వెళ్లాయో తెలుస్తోంది. దీన్ని నవీకరిస్తున్నాం. అర్హత సాధించకపోతే దానికి కారణమేంటి? ఏ పత్రాలివ్వాలనే అంశాలపైనా స్పష్టత ఇస్తాం. ఆన్‌లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశమూ కల్పిస్తున్నాం.

కౌలురైతులుగా  నమోదయ్యేదెలా?

వీఆర్వో, వ్యవసాయాధికారి కౌలుదారు వివరాలు పరిశీలిస్తారు. పక్క రైతులతో మాట్లాడి ధ్రువీకరించుకుని, వెబ్‌ల్యాండ్‌ ద్వారా భూవివరాలు తీసుకుంటారు. తర్వాత భూయజమాని సహకారంతో సీసీఆర్‌సీ (పంటసాగుదారు హక్కుపత్రం) ఇప్పిస్తారు. అప్పుడు వారు అర్హులవుతారు. ఒక భూయజమాని ఒక కౌలురైతుకే పత్రం ఇవ్వాలి. చిన్న, సన్నకారు రైతులు ఇలాంటి పత్రాలివ్వడానికి వీల్లేదు.

 

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.