close

ప్ర‌త్యేక క‌థ‌నం

గిట్టుబాటు కోసం కొత్తబాట

కూరగాయల సాగు తగ్గించి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు వెతుకుతున్న రైతులు
రాజధానిపై పడనున్న ప్రభావం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, న్యూస్‌టుడే-చేవెళ్ల రూరల్‌

రైతన్న దృష్టి మళ్లుతోంది. సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను అన్వేషిస్తున్నాడు. ఫలితంగా కూరగాయల దిగుబడి క్రమంగా తగ్గుతోంది.ఈ ప్రభావం ప్రధానంగా హైదరాబాద్‌ వాసులపై పడబోతోంది. రాజధాని నగరానికి కూరగాయలు సరఫరా చేసే రంగారెడ్డి జిల్లాలో సాగువిస్తీర్ణం, దిగుబడి తగ్గుతోంది. రెండేళ్లుగా  దాదాపు లక్షన్నర టన్నుల మేరకు దిగుబడి తగ్గిపోయింది. ఇకముందు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మున్ముందు హైదరాబాద్‌లో కూరగాయల కొరత ఏర్పడటంతో పాటు ధరలు పెరిగే అవకాశముందని అంటున్నారు.

రంగారెడ్డి జిల్లా ప్రత్యేకత
రాజధాని ప్రజల అవసరాలు తీర్చడానికి, కూరగాయల రేట్లు ఎక్కువకాలం స్థిరంగా ఉండటానికి ప్రధాన కారణం రంగారెడ్డి జిల్లా రైతులేనని అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాకు చాలా వరకు సాగునీటి వసతి లేకపోవడంతో వేలాదిమంది రైతులు గత కొన్నేళ్లుగా కూరగాయల సాగుమీదే ఆధారపడ్డారు.

పెరిగిన పెట్టుబడులు
ఒక ఎకరం భూమిలో కొన్ని రకాల కూరగాయల సాగు చేయాలంటే రెండేళ్ల క్రితం వరకు రూ.40 వేల వరకు ఖర్చయ్యేది. ఇది ఇప్పుడు దాదాపు రూ.60 వేలకు చేరింది. మరోవైపు దిగుబడి కూడా తగ్గిపోతోంది. ఏడాదిలో ఒకట్రెండు నెలల్లో మాత్రమే బహిరంగ మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి.

స్థిరాస్తి వెంచర్లుగా...

రోడ్ల పక్కన ఉన్న పొలాలన్నింటిని వ్యాపారులు కొనుగోలు చేసి స్థిరాస్తి వెంచర్లుగా మార్చేశారు. మొయినాబాద్‌, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లో, బాకారం, అమ్డాపూర్‌, హిమాయత్‌సాగర్‌, అజీజ్‌నగర్‌ ప్రాంతాల్లో వందలాది ఎకరాలు స్థిరాస్తి వెంచర్లు వెలిశాయి. మరోవైపు రోడ్లకు దూరంగా ఉన్న వేలాది ఎకరాల భూములను రైతులు బీళ్లుగా వదిలేశారు.

క్రికెట్‌ మైదానాలుగా పంటపొలాలు
రంగారెడ్డి జిల్లాల్లో కూరగాయలను సాగు చేస్తున్న భూములు క్రికెట్‌ మైదానాలుగా మారిపోతున్నాయి. యువత ఆసక్తిని గమనించిన కొందరు నగర వ్యాపారులు కూరగాయలు సాగు చేసే భూమిని రైతులనుంచి లీజుకు తీసుకుని క్రికెట్‌ మైదానాలుగా మార్చేస్తున్నారు. చిలుకూరులో 4,  ఎన్కేపల్లిలో 6, అజీజ్‌నగర్‌లో 10,  అమ్డాపూర్‌లో 2, హిమాయత్‌సాగర్‌ గ్రామపరిధిలో 3, కాసారంలో 2 క్రికెట్‌ మైదానాలను అభివృద్ధి చేశారు.

గని కార్మికులనుకునేరు వేటకు బై‘లిల్లీ’న రైతులు

వీరంతా తలపై హెడ్‌లైట్‌ పెట్టుకుని బొగ్గు గనుల్లో పని చేసేందుకు వెళ్తున్నట్లు ఉంది కదూ.. కానీ అర్ధరాత్రి సమయంలో లిల్లీ పూలను కోసేందుకు వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గంలో వందల ఎకరాల్లో లిల్లీ పూల తోటలు సాగు చేస్తున్నారు. ఒక్కో రైతు రెండు నుంచి మూడెకరాల్లో ఈ పూలను పండిస్తున్నారు. కూలీల కొరత కారణంగా పాల్గుట్ట గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబ సభ్యులంతా తలకు హెడ్‌లైట్‌ పెట్టుకుని అర్ధరాత్రి లిల్లీ పూలను కోస్తారు. తెల్లవారుజామున 4 గంటల కల్లా హైదరాబాద్‌లోని  మార్కెట్లకు పూలను తరలిస్తారు. రోజూ ఇదే తంతు. విష సర్పాలతో ప్రమాదమని తెలిసినా కూలీల కొరతతో స్థానిక రైతులు అర్ధరాత్రి ఇలా తోటబాట పడుతున్నారు.

ప్రభుత్వం ఏంచేయాలి?
* నాణ్యమైన విత్తనాల కొరత లేకుండా చూడాలి. రాయితీపై వీటిని పంపిణీ చేయాలి.
* మార్కెట్‌ ధరకు ఎరువులు అందించాలి.
* వ్యాపారులే వచ్చి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలి. రవాణా సమస్యలు కూడా పరిష్కరించాలి.

- ఈనాడు, రంగారెడ్డి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.