close

ప్ర‌త్యేక క‌థ‌నం

నమ్ముకున్న భూమినే అమ్ముకుంటున్నారు

కరవు.. కలిసిరాని సేద్యం
సాగుపై అన్నదాతల్లో అనాసక్తి
ఏడాదిలోనే పన్నెండున్నర లక్షల ఎకరాలు విక్రయం
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌

భూమిని నమ్ముకోవాల్సిన రైతులే దాన్ని అమ్ముకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో ఏళ్లుగా నెలకొన్న కరవు, అనుకూలించని వాతావరణ పరిస్థితులు, కుటుంబ ఆర్థిక అవసరాలు, పట్టణ ప్రాంతాలకు వలస ఇలా వివిధ కారణాలతో రాష్ట్రంలో సాగు భూముల విక్రయాలు భారీగా పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రైతులు పన్నెండున్నర లక్షల ఎకరాలకు పైగా విక్రయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాలు సహా రంగారెడ్డి, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ ఈ భూముల అమ్మకం పెరిగింది. గడిచిన ఐదేళ్లల్లో వ్యవసాయ భూముల విక్రయం రెట్టింపు స్థాయికి చేరడం రైతుల్లో  సాగుపై పెరుగుతున్న అనాసక్తికి అద్దం పడుతోంది.

వ్యవసాయం భారమై..
నల్గొండ జిల్లాల్లో దాదాపు ఆరేళ్లుగా కరవు పరిస్థితులే ఉన్నాయి. పంటపై పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో విస్తరించిన జిల్లా కావడంతో రియల్‌ వ్యాపారుల దృష్టి ఈ ప్రాంతంపె కేంద్రీకృతమైంది. ఇక మహబూబ్‌నగర్‌ జిల్లాలో సాగు నీరులేక, వాతావరణ పరిస్థితులు అనుకూలించక వ్యయసాయానికి అన్నదాతలు ఇష్టపడటం లేదు. హైదరాబాద్‌ చుట్టు పక్కలున్న మెదక్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో సాగు భూములు ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఈ జిల్లాల్లో రహదారి పక్కనున్న భూముల విలువ ఎకరాకు రూ.కోట్లలో పలుకుతోంది. ఆర్థిక అవసరాలు తీర్చుకోడానికి భూమిని అమ్మేసుకుంటున్నారు.

రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం

వ్యవసాయ భూముల అమ్మకం రిజిస్ట్రేషన్‌ శాఖకు భారీ ఆదాయాన్ని సమకూరుస్తోంది. 2014-15లో రూ.532.40 కోట్ల రాబడి రాగా, గడిచిన ఏడాది రూ.1169 కోట్లకు మించి ఆదాయం వచ్చింది. 2015-16లో రూ.644 కోట్లు, 2016-17లో రూ.713 కోట్లు, 2017-18లో రూ.757 కోట్లు ఇలా ఏటా వ్యవసాయ భూముల విక్రయాలతో పాటే ఆదాయం పెరుగుతూ వస్తోందని రిజిస్ట్రేషన్‌శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రైతు దగ్గరి నుంచి భూమిని కొన్న రియల్టర్లు దాన్ని రెండు, మూడు సార్లు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఇది కూడా భూముల అమ్మకాలు పెరగడానికి కారణమన్నారు.

కుమార్తె పెళ్లి కోసం...

మాకు నాలుగున్నర ఎకరాలుంది. ఎనిమిది బోర్లు వేసినా నీరుపడలేదు. అప్పులు పెరిగాయి. ఇంతలోనే పెద్ద కుమార్తె పెళ్లి చేయాల్సిరావడంతో రెండేళ్ల కిందట రెండెకరాలు ఎకరా రూ.4లక్షల చొప్పున విక్రయించాం. ప్రస్తుతం ఇక్కడ ఎకరా రూ.10 లక్షలు పలుకుతోంది.
- రమావత్‌ బాలు, లక్ష్మి, జగ్యాతండా, మెదక్‌ జిల్లా

అప్పుల సమస్య తీరింది.. 

నీటి సౌకర్యం లేకపోవడం, సాగు వ్యయం పెరగడంతో వారసత్వంగా వచ్చిన నాలుగెకరాలను అమ్ముకున్నాను. దీంతో నాతోపాటు నా  ఇద్దరు తమ్ముళ్ల అప్పులు, సమస్యలు తీరాయి. నీరుంటే తిప్పలు పడైనా సాగు చేసుకునేవాళ్లం.
- నర్సింహులు, మోతీఘణపూర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా

చదువుల కోసం...

వారసత్వంగా 11.5 ఎకరాలు వచ్చింది. ముగ్గురు పిల్లల చదువుకోసం భారీగా అప్పులయ్యాయి. దీంతో తొమ్మిది నెలల కిందట ఎకరా రూ.27.15 లక్షల చొప్పున రెండున్నర ఎకరాలు విక్రయించాను.
- సురేష్‌, మారేపల్లి, సంగారెడ్డి జిల్లా

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.