close

ప్ర‌త్యేక క‌థ‌నం

పయన పటారం

ఆర్టీసీ బస్సుల్లో మూడోవంతు కాలం చెల్లినవే
లక్ష్యాన్ని దాటి లక్షల కిలోమీటర్ల ప్రయాణం
డ్రైవర్లు మొత్తుకున్నా ప్రయోజనం శూన్యం
దూర ప్రాంత బస్సుల నాణ్యతా అంతంతే
పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో అధికం డొక్కు బస్సులే
కొత్త బస్సుల కొనుగోలుకు రూ.వెయ్యి కోట్ల ఖర్చు
ఈనాడు - అమరావతి

‘‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం’’ ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నినాదం. కానీ కాలం చెల్లిన బస్సుల పుణ్యమాని ఈ ప్రయాణం ఇటు సురక్షితమూ, అటు సుఖవంతమూ కాకుండా పోతోంది. మొత్తం బస్సుల్లో దాదాపు మూడోవంతు కాలం చెల్లినవే కావడంతో వాటిలో వెళ్తుంటే నడుం విరిగిపోతోందని ప్రయాణికులు, నడపడం నరకంగా మారిందని డ్రైవర్లు, మరమ్మతులు తమవల్ల కావట్లేదని మెకానిక్‌లు అంటున్నారు. కాలం చెల్లాక కూడా లక్షల కిలోమీటర్లు దాటి తిరుగుతున్న బస్సులు ఆర్టీసీలో మూడోవంతు ఉన్నాయి. ఇవి దారి మధ్యలో హఠాత్తుగా మొరాయిస్తున్నాయి. సకాలంలో బ్రేకులు పడక ప్రయాణికులతో పాటు పాదచారుల ప్రాణాలు హరిస్తున్నాయి. ఆ బస్సుల్లో లోపాలు ఉన్నాయి మహాప్రభో అంటూ డ్రైవర్లు లాగ్‌షీట్‌లో మొత్తుకుంటున్నా పట్టించుకునే నాథుడే కనపడటం లేదు. దగ్గర ప్రయాణాలకే కాదు దూరప్రాంత సర్వీసులకూ ఈ డొక్కుబస్సులనే వాడుతుండటంతో.. అవి రాత్రివేళ నడి రోడ్డుమీద ఆగిపోయి ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లెవెలుగు, పట్టణాల్లో తిరిగే సిటీ సర్వీసుల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. డబడబలాడే ఈ డొక్కుబస్సుల్లో ప్రయాణం కుదుపులతో ప్రయాణికుడి వెన్ను విరిచేస్తోంది.

బస్సులు సాధారణంగా 8 లక్షల కిలోమీటర్ల వరకే తిరగాలి. కానీ ఇపుడు సగటున అన్నింటినీ 10 లక్షల కి.మీ. తిప్పుతున్నారు. ఆ తర్వాత వాటి సామర్థ్యాన్ని బట్టి ఆర్డినరీగా మారుస్తారు. ఆపై మరో 2 లక్షల కి.మీ. నడిపిస్తున్నారు. 12 లక్షల తర్వాత అసలు నడపకూడదు. కానీ ఆర్డినరీ, పల్లెవెలుగు, సిటీబస్సులతో పాటు దూరప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ ఈ పరిమితి దాటినవి ఉన్నాయి. రవాణాశాఖాధికారులు ఫిట్‌నెస్‌ తనిఖీ చేసే సమయంలో కొత్తరంగులు వేసి పంపుతుండటంతో.. ఆర్టీసీ బస్సులే కదాని లోపాలు పూర్తిగా చూడకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చేస్తున్నారు. దాంతో అది మరో ఏడాది తిరిగేస్తోంది. ప్రతిసారీ ఇదే పునరావృతం అవుతోంది.

పదేపదే మరమ్మతులు
కాలం చెల్లిన బస్సులకు ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా వాటి లోపాలు అలాగే ఉంటున్నాయి. విడిభాగాలు మార్చినా బస్సు గాడిలో పడట్లేదు. అయినా డ్రైవర్లు వాటినే నడపాల్సి వస్తోంది. బస్సు ఇక బాగుపడదన్న విషయాన్ని మెకానిక్‌లు తమ సూపర్‌వైజర్లు, ఉన్నతాధికారులకు తెలిపినా, ఏదో సర్దుబాటు చేసి నడిచేలా చేయాలంటూ ఆదేశిస్తారని చెబుతున్నారు. తిరిగేందుకు ఏమాత్రం పనికిరాని పాతబస్సుల స్థానే పూర్తిగా కొత్తవి కొనాలంటే దాదాపు రూ. వెయ్యి కోట్లవుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి అప్పు తీసుకుంటే.. హామీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీంతో ఆర్టీసీ అధికారులు రుణప్రక్రియ ఆరంభించారు. రుణం మంజూరై, కొత్త బస్సులు వస్తే దశలవారీగా కాలం చెల్లినవాటి స్థానంలో ప్రవేశపెడతారు.

డొక్కు బస్సుల వల్ల ఇలా..

* విజయవాడ ఆటోనగర్‌ డిపోకు చెందిన వోల్వో బస్సు ఇటీవల హైదరాబాద్‌ వెళ్తూ.. మధ్యలో ఆగిపోయింది. ప్రయాణికులను వేర్వేరు బస్సుల్లో పంపారు. వాళ్లు ఆర్టీసీ ఎండీకి ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తే ఆ బస్సు 17 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగినట్లు తేలింది. ఫలితంగా దాన్ని పక్కనపెట్టారు.
* విజయవాడలోని సింగ్‌నగర్‌ వంతెన వద్ద రెండేళ్ల క్రితం సిటీబస్సు బ్రేకులు పనిచేయక ముందు వెళ్తున్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్రమాదానికి ముందురోజే వాక్యూమ్‌ లీక్‌ అవుతోందని లాగ్‌షీట్‌లో డ్రైవర్‌ రాసినా లోపాన్ని సరిచేయకుండా అలాగే నడిపించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
*  విజయవాడ-హైదరాబాద్‌ మధ్య రోజూ తిరిగే 250 ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో కాలం చెల్లినవి కూడా ఉన్నాయి. దీంతో అధికారులు సూర్యాపేటలో ఓ అల్ట్రా డీలక్స్‌ బస్సును అదనంగా ఉంచుతారు. ఏదైనా బస్సు ఆగిపోతే ఈ బస్సును పంపి, అందులో ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుంటారు. ఈ అదనపు బస్సు అవసరం తరచూ వస్తూనే ఉంటుంది.

ఒళ్లంతా గుల్లవుతోంది

విజయవాడ వెళ్దామని రాత్రి 12 గంటలకు ఏసీ స్లీపర్‌ బస్సు ఎక్కాను. నాలుగు గంటల ప్రయాణం మొత్తం కుదుపులే. ఒక్క నిమిషం కూడా నిద్రపట్టలేదు. ఏసీ పనిచేయలేదు. గాలి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

-రాజేంద్రప్రసాద్‌, రాజమహేంద్రవరం

బ్రేక్‌ వేస్తే పక్కకు లాగేస్తుంది

విజయవాడ-హైదరాబాద్‌ మధ్య వెన్నెల బస్సు నడుపుతాను. వీటికి బ్రేక్‌వేస్తే ఓ వైపు లాగేస్తుంటుంది. అద్దాలు బాగోలేవు. ఎదురుగా వచ్చే వాహనాల కాంతి కళ్లమీద పడి ఇబ్బంది అవుతోంది. లాగ్‌షీట్‌లో రాసినపుడు కొంత సరిచేసినా, ఓ వారానికి మళ్లీ మామూలే.

- బస్సు డ్రైవర్‌

ఆ బస్సులన్నీ అంతే

హైదరాబాద్‌కు తిరిగే 6 ఇసుజు బస్సులు ఎక్కువ కిలోమీటర్లు తిరిగేశాయి. వీటిని పక్కనపెట్టాల్సి ఉన్నా నడుపుతున్నారు. తరచూ మరమ్మతులే. వాటికి విడిభాగాలు అన్నీ లేవు. డ్రైవర్లు లాగ్‌షీట్‌లో ఫిర్యాదులు రాసినా అవన్నీ సరిచేయడం కష్టమన్న విషయం అధికారులకూ తెలుసు.

  - మెకానిక్‌

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.