close

ప్ర‌త్యేక క‌థ‌నం

చిరుప్రాయం బలవుతోంది

ప్రేమ వలలో చిక్కుతున్న బాలికలు
ఏటా 50 శాతం కేసుల పెరుగుదల
నేర ప్రవృత్తిలో ఇరుక్కుంటున్న బాలురు
పెద్దలు శ్రద్ధ వహించాలంటున్న నిపుణులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎవరి పిల్లలు వారికి ముద్దు. అందులోనూ ఆడపిల్లలంటే అపురూపం. పిల్లలను అల్లారుముద్దుగా రెక్కల చాటున పొదివి నాలుగు గోడల మధ్య అతిజాగ్రత్తగా పెంచుకుంటున్నామనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ఆ భద్రత చట్రంలోకి అనూహ్యంగా అడుగుపెట్టి చిరుప్రాయాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నాయి నేటి ఆధునిక నాగరికత.. అత్యాధునిక సాంకేతికత!

పనుల ఒత్తిడిలో.. సంపాదన క్రమంలో తీరిక లేకుండా గడిపే తల్లిదండ్రులు.. ఒంటరితనంలో నేనున్నానంటూ అరచేతిలోనే అన్నీ చూపించే సాంకేతికత.. మీట నొక్కితే మేటలకొద్దీ వచ్చిపడే అశ్లీల వెబ్‌సైట్లు.. పలకరిస్తే చాలు ప్రేమ అని పొరపాటుపడే యవ్వనపు ఆకర్షణ.. ఇవన్నీ కలిసి పిల్లలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఆడపిల్లలైతే బాధితులవుతున్నారు.. మగపిల్లలైతే బందీలవుతున్నారు.. నేరాల్లో పావులవుతున్నారు!

పసితనం కట్టుతప్పుతోంది. అపరిచితులతో పరిచయాలు.. పరిచితులతో పరిధి దాటుతున్న స్నేహాలు.. అరచేతిలో అశ్లీలం.. పసిప్రాయాన్ని కసిగా కాటేస్తున్నాయి. పుస్తకాల్లో పాఠాలతో జీవితానికి పునాదులు పడాల్సిన సమయంలో ప్రేమపాఠాలు.. విశృంఖలత, విచ్చలవిడి సంస్కృతితో తప్పటడుగులు వేస్తున్నారు. తెలిసీ తెలియని వయసు, ఆకర్షణ, పరిచయాలతో ఆడపిల్లలు మోసపోతున్నారు. మృగాళ్లు చెప్పే మాయమాటలతో మరికొందరు నయవంచనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఇంకొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుండగా కొందరు ప్రాణాలు తీసేందుకూ వెనుకాడటంలేదు.. చివరకు వారు తల్లిదండ్రులైనా సరే!

హయత్‌నగర్‌లో జరిగిన కీర్తి ఉదంతమే ఇందుకు నిదర్శనం. పదహారేళ్లకే ఓ యువకుడి మోజులో పడటమేకాదు శృంగారానికీ వెనుకాడకపోవడం, గర్భం దాల్చడం, ఆ తర్వాత అన్నయ్య అని పిలిచే మరో యువకుడి సాయంతో గర్భవిచ్ఛిత్తికి సిద్ధపడడం.. ఆ సాకుతో బెదిరించి అతడు వలలో వేసుకోవడం.. ఆ వ్యామోహం చివరకు తల్లినే కడతేర్చేవరకూ దారితీసిన ఉదంతం నేపథ్యంలో పసిప్రేమలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

పదో తరగతి నుంచే మొదలు!
ఒకప్పుడు యుక్తవయసు యువత ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కౌమారం కూడా దాటని పిల్లలకు చేరాయి. పదో తరగతిలోనే ప్రేమ, పగ మొదలవుతున్నాయి. తమ విద్యార్థుల్లో కొంతమంది వ్యవహార శైలి చూస్తే ఒళ్లు జలదరిస్తోందని నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ వాపోయారు. తొమ్మిది, పదో తరగతి పిల్లల్లోనే మొదలవుతున్న ప్రేమ చాలా దూరం వెళ్తోందని, తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులే అయితే ఏకంగా పాఠశాల ఎగ్గొట్టి ఇద్దరూ ఇంట్లోనే కలుస్తున్నారని మరో ప్రధానోపాధ్యాయురాలు వెల్లడించారు. ఈ విషయం పెద్దలకు తెలిసే సమాయానికే అనర్థం జరిగిపోతోందని ఆమె వివరించారు. మారుతున్న టెక్నాలజీ ప్రభావం, సామాజిక మాధ్యమాల ఉచ్చులోపడి, ఆకర్షణను ప్రేమగా నమ్ముతూ కొందరు వంచనకు గురవుతున్నారు. ప్రేమపేరిట ఇటీవల చిన్నారులను చిదిమి వేస్తున్న ఘటనలు నమోదవుతున్నాయి. రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌ ప్రేమతో జడ్చర్లలో పదోతరగతి చదువుతున్న బాలికను యువకుడు నిర్దాక్షిణ్యంగా చంపేయడం సంచలనంగా మారింది.

బయటికొచ్చేవి కొన్నే!
* ప్రభుత్వశాఖలో పనిచేస్తూ మరణించిన ఒక ఉద్యోగికి ముగ్గురు కుమార్తెలు. పదో తరగతి చదువుతున్న అమ్మాయికి ఫేస్‌బుక్‌లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ వ్యామోహంలో పడిన బాలిక ఒకరోజు ఇంట్లో నుంచి డబ్బు తీసుకొని పారిపోయింది. ఇద్దరూ కలిసి ఒకరోజంతా రిసార్టులో ఉన్నారు. మర్నాడు ఆ బాలుడు చెప్పాపెట్టకుండా పారిపోయాడు. ఆందోళనలో ఉన్న ఆ అమ్మాయిని పోలీసులు రక్షించారు. ప్రేమపేరిట అబ్బాయి చేసిన మోసాన్ని తెలుసుకుని కొన్ని నెలల పాటు మానసిక రుగ్మతలోకి వెళ్లిపోయింది.
* ఒక రాంగ్‌ మిస్డ్‌కాల్‌తో పొరుగు రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల ఒక అమ్మాయికి అబ్బాయి పరిచయమయ్యాడు. కొన్నినెలల పాటు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఒకరోజు అమ్మాయిని హైదరాబాద్‌ వచ్చేయాలని, ఉద్యోగం చూశానని చెప్పాడు. పెళ్లిచేసుకుందామని ప్రతిపాదించాడు. ఆ మాటలు నమ్మి హైదరాబాద్‌కు వచ్చేసింది. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తరువాత అబ్బాయి నుంచి ఫోన్‌ రాలేదు. పోలీసులు రక్షించి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. నమ్మి మోసపోయినట్లు కొన్నిరోజులకు గుర్తించింది. కౌన్సెలింగ్‌ తరువాత మామూలు స్థితికి చేరుకుంది.
* పేదరికంలో ఉన్నప్పటికీ చక్కగా చదువుకుంటున్న ఒకమ్మాయి తన తోటి స్నేహితులతో సమానంగా స్మార్ట్‌ఫోన్‌ కావాలని తండ్రిని కోరింది. ఈ ఫోన్‌ అమ్మాయి జీవితాన్ని మార్చేసింది. మిస్డ్‌కాల్‌ రూపంలో పరిచయమైన ఒక అబ్బాయి చేతిలో మోసపోయింది. ఈ ఫోన్‌ కొనివ్వకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదంటూ ఒక తండ్రి విలపించాడు.
* ప్రేమ పేరిట నమ్మించి ఒక అమ్మాయిని ముంబయి వ్యభిచార గృహాలకు అమ్మేశారు. అక్కడ మూడేళ్లపాటు చిత్రహింసలకు గురైంది. చివరకు పోలీసుల దాడుల్లో నరకకూపం నుంచి విముక్తి పొందింది. అప్పటికి ఆ అమ్మాయి
వయసు 17 ఏళ్లే!

పోలీసుల వరకు వెళ్లని కేసులెన్నో
* 18 ఏళ్లలోపు అమ్మాయి కనిపించకుండాపోయిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ పరువు పోతుందన్న భయంతో ఫిర్యాదు చేయని కేసులు ఎన్నో ఉంటున్నాయి.
* పోలీసులకు ఫిర్యాదు చేసినపుడు వారు ఆ అమ్మాయిల్ని రక్షించి అవసరమైతే సంరక్షణ గృహాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదులు చేయని సందర్భాల్లో వారెక్కడున్నారో, ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
* కొన్ని సందర్భాల్లో బాధితురాలి ఫిర్యాదు చేసినప్పటికీ మోసం చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ఆలస్యమవుతోంది. ఒక కేసులో అమ్మాయి మోసపోయి పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత నిందితున్ని పట్టుకునేందుకు ఏడు నెలలు పట్టింది. అప్పటికే ఆమె ఏడు నెలల గర్భవతి. చివరకు పాపకు జన్మనిచ్చి ప్రభుత్వ సంరక్షణ గృహానికి అప్పగించి వెళ్లిపోయింది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ప్రేమ పేరిట ఏమీ తెలియని చిన్నారులు మోసాలకు గురవుతున్నారు. కౌమార దశలోని ఆకర్షణను ప్రేమగా గుడ్డిగా నమ్ముతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

అందుబాటులో అశ్లీలం
పాఠశాల పిల్లలను పాడుచేస్తున్న మరో సమస్య అశ్లీలం. స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడం, డేటా ధరలు తగ్గడంతో ఇప్పుడు అశ్లీలం అరచేతిలోకే వచ్చింది. ఇంటర్నెట్‌ వినియోగం పెరుగుతోంది. వీడియో ఆటల కోసం ఫోన్లు తీసుకుంటున్న పిల్లలు అవకాశం దొరికినప్పుడల్లా అశ్లీల వెబ్‌సైట్లు చూస్తున్నారు.

కారణాలు ఏమిటి?
* స్మార్ట్‌ఫోన్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, మిస్డ్‌కాల్‌, మిడ్‌నైట్‌ పార్టీలు ప్రధాన కారణాలు
* ప్రత్యేక గుర్తింపు కోసం పాకులాట, స్నేహితుల స్నేహితులతో పరిచయాలు
* ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ ఫస్టియర్‌ బాలికలు ఎక్కువ మోసపోతున్నారు
* మోసపోతున్న బాలికల వయసు 9-15 ఏళ్లుగా నమోదవుతోంది
* 50 శాతం : ప్రతియేటా పెరుగుతున్న కేసుల సంఖ్య
* 14-15 ఏళ్లు : అత్యధిక కేసులు నమోదవుతున్న వయసు
* గత ఐదేళ్లుగా ప్రేమపేరిట మోసపోతున్న బాధితుల పెరుగుదల 
‘ప్రస్తుతం సమాజంలో తొమ్మిదో తరగతి నుంచే చిన్నారుల్లో ఆకర్షణ పెరుగుతోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో హద్దులు దాటుతున్నారు. తాము చేస్తున్న తప్పును గుర్తించడం లేదు. చివరకు అబ్బాయి ముఖం చాటేయడం సర్వసాధారణమైంది’ 
పిల్లల మీద అత్యాచారాలపై అధ్యయనం చేస్తున్న నిపుణురాలు
‘మా దగ్గరకు వచ్చే కేసులను వింటుంటే కన్నీళ్లు వస్తుంటాయి. ప్రేమపేరిట మోసం చేసి వ్యభిచార గృహాలకు విక్రయించిన సంఘటనలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో పాఠశాలల్లో అనారోగ్యానికి గురైనపుడు వైద్యుల వద్దకు తీసుకెళ్తే జరిగిన అనర్థం బయటపడుతోంది’
- ఒక పోలీసు అధికారి
‘పిల్లలు ఇప్పుడు చాలా చురుగ్గా ఉంటున్నారు. తల్లిదండ్రులు వారేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ఈ విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అవసరమైతే టెక్నాలజీపై అప్‌డేట్‌ కావాలి. ఫేస్‌బుక్‌లో ఎవరిని కలిశారు.. వీడియోలేం చూశారు.. వెబ్‌ బ్రౌజింగ్‌లో ఏ వెబ్‌సైట్లు తెరిచారో అప్పుడప్పుడూ అయినా చూస్తూ ఉండాలి. పిల్లలు వినియోగించే ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు సెక్యూరిటీ సెట్టింగ్స్‌, ఫైర్‌వాల్‌ ఏర్పాటుచేస్తే తప్పుదోవ పట్టించే వెబ్‌సైట్ల నుంచి వారిని కొంత వరకు కాపాడుకోవచ్చు’
- పిల్లల మానసిక నిపుణురాలు

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.