close

ప్ర‌త్యేక క‌థ‌నం

బిగుతు జీన్స్‌ భయపెడుతోంది

వాటితో చర్మ వ్యాధులు వస్తున్నాయంటున్న వైద్య నిపుణులు
జననావయవాల వద్ద ఇన్‌ఫెక్షన్లు వేధిస్తున్నాయని వెల్లడి
జాగ్రత్తలు పాటించాలని సూచన

ఈనాడు, అమరావతి: జీన్స్‌.. ఫ్యాషన్‌ ప్రపంచంలో ఓ సంచలనం.. కాటన్‌, స్ట్రెచ్‌, టైట్‌ ఫిట్‌, జాగరీ ఫిట్‌ జీన్స్‌ ఇలా అనేక రకాలు.. చిన్న పిల్లల నుంచి యువత, పెద్ద వయస్సు వారూ జీన్స్‌ అభిమానులే. అయితే ఇప్పటికే బిగుతు జీన్స్‌ ప్యాంట్లతో మగవారిలో వంధ్యత్వ సమస్యలు వస్తున్నాయని పరిశోధనలు పేర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటువంటి బిగుతు జీన్స్‌లను ధరించడంవల్ల గజ్జి, తామర, శోభి లాంటి వ్యాధులూ సంక్రమిస్తున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి దుస్తులను సరిగా శుభ్రపరుచుకోవడం, ఇస్త్రీ చేయించుకోవడం, నూలు లోదుస్తులు (అండర్‌ గార్మెంట్స్‌) ధరించడం, ప్రాంతాన్ని బట్టి రోజుకు 2, 3 సార్లు స్నానం చేయడం ద్వారా వీటిని అధిగమించవచ్చని సూచిస్తున్నారు.

విజయవాడలో చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధుల నివారణ వైద్యుల జాతీయ సంఘం ఏపీ విభాగం ఆధ్వర్యంలో వ్యాధుల నియంత్రణ- నూతన సాంకేతిక విజ్ఞానంపై శని, ఆదివారాల్లో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా యువతీ యువకులు నిత్యం జీన్స్‌ ప్యాంట్లు ధరించడం ద్వారా వచ్చే చర్మ వ్యాధులపై చర్చ జరిగింది. ఇందులో పిల్లల వస్త్రధారణ, శుభ్రత విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచించారు.

ఉతక్కపోయినా ఫర్వాలేదని..!
జీన్స్‌ ప్యాంట్లను కొన్ని రోజుల పాటు ఉతక్క పోయినా అవి వాడేందుకు సౌకర్యంగా ఉంటాయని, ఒకసారి కొనుగోలు చేస్తే రెండు, మూడేళ్ల వరకు మన్నుతాయన్న ఉద్దేశంతో యువతీ యువకులు వీటివైపు మొగ్గుతున్నారు. బిగుతుగా ఉండటం, తరచూ ఉతక్కపోవడం చర్మ సమస్యలకు దారి తీస్తోంది. ప్రతి 100 మందిలో 10 మందికి చర్మ వ్యాధులొస్తున్నాయి. గజ్జల్లో దురదతో బాధపడేవారు ఎక్కువగా వస్తున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిరుదుల మధ్యా ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. అలాగే మగ వారికి మర్మాంగం, ఆడపిల్లల్లో జననాంగం వద్ద ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జీన్స్‌ ప్యాంట్లను ఉతికి ఆరేశాక ఇస్త్రీ చేయించకపోతే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయంటున్నారు.

పాఠశాలలు, కళాశాలల్లో...!
పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల విషయంలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. వస్త్రధారణకు తోడు చిన్నచిన్న గదుల్లో ఎక్కువ సంఖ్యలో ఉండే విద్యార్థులు అటు ఇటు కదలడానికి వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. గదుల్లోకి వెలుతురు, గాలి లేక ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వస్తున్నాయి.

కాటన్‌ లోదుస్తులు వాడితే మంచిది
జీన్స్‌ ప్యాంట్ల వాడకంవల్ల లోపలి భాగాల్లో వేడి, తేమ శాతం పెరిగి ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. గతంలో నూటికి 4 కేసులు వస్తే ప్రస్తుతం 40 వస్తున్నాయి. కాటన్‌ లో దుస్తులను వాడితే మంచిది.
- డాక్టర్‌ పి.రాంబాబు,
చర్మవ్యాధుల విభాగం విశ్రాంత అధిపతి, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల
స్నానాలు మానేస్తున్నారు
పాఠశాల విద్యను అభ్యసించే పిల్లలు తరగతులకు హాజరై ఇంటికి రాగానే స్నానం చేయడం మానేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలు ఆ దుస్తులతోనే ఉంటున్నందున చర్మవ్యాధులు, పుండ్లు వస్తున్నాయి.
- డాక్టర్‌ దీక్ష,
కార్యదర్శి, సదస్సు నిర్వాహక కమిటీ

  

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.