close

ప్ర‌త్యేక క‌థ‌నం

జ్వరం కోరల్లో జనం

రాష్ట్రాన్ని వణికిస్తున్న  పలురకాల జ్వరాలు
  అపరిశుభ్రత,  దోమల బెడదతో విస్తృతం
  డెంగీతో మరణిస్తున్న రోగులు
  చేష్టలుడిగిన ప్రభుత్వ యంత్రాంగం
ఈనాడు, అమరావతి - యంత్రాంగం

రాష్ట్రంలో జ్వరాలు విజృంభిస్తూనే ఉన్నాయి. ఆ జిల్లా ... ఈ జిల్లా.. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అంతటా వైరల్‌, డెంగీ జ్వరాలు ప్రజలను ఆసుపత్రుల పాల్జేస్తున్నాయి. పదుల సంఖ్యలో రోగులు మృత్యువాత పడుతున్నారు. వాతావరణంలోని మార్పులు, కొన్నిచోట్ల వర్షాలు పడటం, పారిశుద్ధ్యం బాగోలేక దోమల బెడద ఎక్కువై జ్వరాలు వస్తూనే ఉన్నాయి. మరోపక్క జ్వరాల నిరోధక చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖ ప్రస్తుతం శ్రద్ధ చూపకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు ఈ జ్వరాల బారినపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
* పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి సగటున రోజుకు 200 మంది వరకు జ్వరాలతో వస్తుండగా ఒక జనరల్‌ ఫిజీషియన్‌ మాత్రమే ఉన్నారు. ఈ ఆసుపత్రిలో యాంటీబయాటిక్స్‌ మందులకు కొరత నెలకొంది. జ్వరాల తీవ్రతను అనుసరించి రోగులను ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు.
* విశాఖ నగరం గాజువాక, అక్కయ్యపాలెం, ఇతర ప్రాంతాల్లో జ్వరపీడితులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. కేజీహెచ్‌ సహా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో 20% మందికి పైగా జ్వరాలతో ఉన్నారు.
* కృష్ణా జిల్లాలో గత నెల రోజుల్లో 49మందికి డెంగీ, 14మందికి మలేరియా, 117మందికి టైఫాయిడ్‌ పాజిటివ్‌ వచ్చింది.
* ప్రకాశం జిల్లా మార్కాపురం, మర్రిపూడి, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, చీమకుర్తి మండలాల్లో జ్వరాల తీవ్రత కనిపిస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 210 డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
* తిరుపతి రుయా ఆసుపత్రికి రోజూ వంద మందికిపైగా జ్వరాలతో వస్తున్నారు. అక్టోబరు వరకూ 206 మందికి డెంగీ సోకినట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3 వరకూ 200 డెంగీ     పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
* అనంతపురం జిల్లాలో గత సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 15 మంది డెంగీ లక్షణాలతోనే మరణించారని చెబుతున్నారు. జిల్లాలోని 49 మండలాల్లో జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉంది.
* కడప నగరం, మైదుకూరు, గోపవరం, ఇతర ప్రాంతాల పరిధిలో పలువురు చిన్నారులు, యువకుల మరణాలకు డెంగీ లక్షణాలే కారణమని సంబంధిత వర్గాల్లో చర్చ జరిగినా నిర్థరణ జరగలేదు.
* ఇడుపులపాయలోని ట్రిపుల్‌ఐటీలో 300 నుంచి 400 మంది జ్వరాలతో బాధపడుతున్నా యాంటీబయాటిక్స్‌ మందులు అందుబాటులో లేవు.
* కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, డోన్‌, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ నియోజకవర్గ పరిధిలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు 60 డెంగీ కేసులు నమోదయ్యాయి.

గంటగంటకూ ద్రవపదార్థాలు ఇవ్వాలి
డెంగీకి మందు లేకపోవడంతో.. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్‌ మందును వైద్యులు ఇస్తున్నారు. దీనిని వాడితే నాలుగో రోజు సాయంత్రానికి ఒక్కసారిగా తగ్గిపోతుంది. అప్పటి నుంచి మూడు రోజులు ఈ రోగులకు అత్యంత ప్రమాదకరమైనవి. ఈ రోజుల్లో నీరసం ఉంటుంది. ఏడో రోజుకు రక్తంలో ప్లేట్‌లెట్‌లు పడిపోవడం, అంతర్గత రక్తస్రావం అవ్వడం వంటివి జరుగుతాయి. ముక్కు, నోరు, మూత్రంలో రక్తం వస్తుంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి మంచి నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దానిమ్మ, బొప్పాయి, కివీ వంటి పండ్ల రసాలను పలుచగా చేసి ప్రతి గంటకూ రోగి(చిన్నపిల్లలతో బలవంతంగానైనా)తో తాగించాలి. అప్పుడే.. శరీరంలో ఉండే డెంగీ వైరస్‌ మూత్రం రూపంలో బయటకుపోయి.. డెంగీ తగ్గుముఖం పడుతుంది. కానీ.. ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే ప్రాణాలు పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.