close

ప్ర‌త్యేక క‌థ‌నం

మానవాళి తప్పిదాలతోనే కాలుష్యం

 వాతావరణ మార్పులతో ఈ దుస్థితి
 గాలిలో కాలుష్య కారకాలు 415 పీపీఎంకి చేరాయి
 అవి 450కి చేరితే మానవాళికి మనుగడ ఉండదు
 ఏడాదికి మరో 2 శాతం పెరిగితే 15 ఏళ్లే గడువు
 వాతావరణ విపత్తుల వలలో ఇండియా, హైదరాబాద్‌
 ‘ఈనాడు’తో ప్రపంచబ్యాంకు మాజీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వినోద్‌ థామస్‌
ఈనాడు, హైదరాబాద్‌

వాతావరణ మార్పులను ఎదుర్కోకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయో 2011లో గాడ్గిల్‌ నివేదికలో చెప్పిన అంశాలే ఇప్పుడు కళ్లముందు జరుగుతున్నాయి. హిల్‌స్టేషన్ల నిర్మాణాలకు అనుమతి, ఇసుక తరలింపు లైసెన్సులు ఇవ్వవద్దని గాడ్గిల్‌ సిఫార్సు చేశారు. కాని వాటిని పట్టించుకోనందునే కేరళలో విపత్తు వచ్చింది.

‘ఒకప్పుడు భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలవడం వల్ల మానవాళికి ముప్పు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు వరదలు, తుపాన్లు, వడగాలులతో వాటికన్నా అధిక ముప్పు ఉంది. ఇందుకు ప్రధాన కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దిల్లీలో కాలుష్యం పెరగడానికి మనమే కారణం’ అని  ప్రపంచబ్యాంకు మాజీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ వినోద్‌ థామస్‌ స్పష్టం చేశారు. వాతావరణ మార్పులపై జరుగుతున్న జాతీయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

 దిల్లీలో కాలుష్యం పెరిగిపోవడానికి ప్రధాన కారణాలేంటి ?
శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం మూడు ప్రధాన కారణాలున్నాయి. వాతావరణ మార్పులతో పెరిగిన భూతాపం, ఆ నగరంలో విపరీతంగా పెరిగిపోయిన పరిశ్రమలు, వాహనాలు.. పంజాబ్‌, హరియాణాలో పంట వ్యర్థాలను తగులబెట్టడంతో వెలువడుతున్న కాలుష్యం. ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలుష్యం వెలువడే తొలి 20 నగరాల్లో దిల్లీ ఉంది. ఇది ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు.

వాతావరణ మార్పుల వల్ల ఎలాంటి  ప్రమాదాలున్నాయి?
విపరీతంగా వర్షాలు, వరదలు వచ్చి తీరప్రాంతాలు మునిగిపోతాయి. భూతాపం గత ఐదేళ్లలో బాగా పెరిగింది. హైదరాబాద్‌లో సగటు ఉష్ణోగ్రత పెరగడానికి ఈ మార్పులే కారణం. వాతావరణానికి అభివృద్ధి చెందిన, చెందని దేశాలనే భేదభావమేమీ ఉండదు. ఉదాహరణకు అభివృద్ధి చెందిన అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు, అభివృద్ధి చెందుతున్న ఫిలిప్పీన్స్‌లో వరదలకు వాతావరణ మార్పులే కారణం. హెచ్‌స్‌బీసీ అధ్యయనం ప్రకారం ఇండియా, పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా పడే 67 దేశాల జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్‌ సైతం అందులో ఉంది.

హైదరాబాద్‌పై ప్రభావం ఎలా ఉంటుంది ?
హైదరాబాద్‌కు పురాతన కాలం నుంచి సరస్సుల నగరం అనే పేరుంది. కానీ ఒక అధ్యయనం ప్రకారం 169 నీటివనరులను ఆక్రమించి వాటిపై కాలనీలు, ఇతర నిర్మాణాలు చేపట్టారు. కేరళలోనూ ఇలాంటి నిర్మాణాల వల్లనే 2018లో వరదలు విపరీతంగా వచ్చి తీవ్ర నష్టం వాటిల్లింది.

ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి?
ఆర్థికవేత్తలు, ఆర్థికమంత్రులు గత 15 ఏళ్లలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టకుండా ఆర్థిక అభివృద్ధి రేటు పెంపు వంటి తాత్కాలిక ప్రయోజనాలపైనే దృష్టి పెడుతున్నారు. ఇవి మన భూగ్రహానికి మేలు చేయవు.

గాలిలోకి కర్బన ఉద్గారాలు తగ్గాలంటే ఏం చేయాలి ?

అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే కాలుష్యాన్ని గాలిలో వదిలేసి పేర్చేసి పెట్టేశాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా అదేపని చేస్తే కాలుష్యం మరింత పెరిగి మానవాళికి మనుగడ ఉండదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో గాలిలోకి విడుదలయ్యే కాలుష్య కారకాలు 415 పీపీఎం (పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) స్థాయికి చేరాయి. ఇవి 450కి చేరితే ఇక మానవాళి మనుగడ కష్టం. ఏటా ఇది 2 శాతం పెరిగినా మరో 15 ఏళ్లలో 450కి వస్తాయి. ఈలోగానే ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తం కావాలి. థర్మల్‌ విద్యుదుత్పత్తికి బొగ్గు మండించడం వల్ల కర్బన ఉద్గారాల విడుదల అధికం. సౌర, పవన విద్యుత్‌ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి బాగా పెరగాలి. విద్యుత్‌ వాహనాలూ రావాలి. ఇలా ప్రతి అంశంలో పర్యావరణ పరిరక్షణ చాలా ముఖ్యం. తీరప్రాంతాల వెంట అడవులను పెంచాలి. వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా పంటల సాగు మారాలి. అమెరికా, చైనా, రష్యా, ఇండియా అతి పెద్ద కర్బన ఉద్గార దేశాలు. తక్షణం వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలి.
భారతదేశంలోని తీరప్రాంతాల్లో జనసాంద్రత చాలా అధికం. విపత్తు వస్తే ఎలా రక్షించుకోవాలో ఇక్కడ అవగాహన తక్కువ. నష్టం అధికంగా ఉంటుంది. భూకంపాలు వస్తే ఎలా ప్రాణాలను కాపాడుకోవాలో జపాన్‌లో (ఇక్కడ భూకంపాలు ఎక్కువ) పిల్లలకు పాఠశాల స్థాయిలోనే శిక్షణ ఇస్తారు. ఇండోనేషియాలో సునామీ వస్తే ప్రజల ప్రాణాలు కాపాడుకునేందుకు తీర ప్రాంతాల్లో రెండు అంతస్తుల వరకూ నీటి ప్రవాహాలకు వదిలేసి పైన భవనాలు నిర్మిస్తారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.