close

ప్ర‌త్యేక క‌థ‌నం

కాంగ్రెస్‌కు సంకటం కమల వికాసం

దేశ రాజకీయాల్ని శాసించిన మందిర్‌-మసీదు వివాదం

బాబ్రీ మసీదు-రామ మందిరం వివాదాన్ని సమకాలీన దేశ రాజకీయాల నుంచి విడదీయలేం. స్వాతంత్య్రానికి పూర్వం స్థానికాంశంగానే ఉన్న ఈ వివాదం.. స్వాతంత్య్రానంతరం ముఖ్యంగా 1980ల తర్వాత భారత రాజకీయాల్లో కేంద్ర బిందువై కూర్చుంది. రాజకీయ పార్టీల భవితవ్యాన్ని శాసించడం ప్రారంభించింది. ఇందులో ఎక్కువగా సంకట స్థితిని ఎదుర్కొన్నది కాంగ్రెస్‌ పార్టీ అయితే.. భాజపా ఎదుగుదలకు ఇదే బ్రహ్మాస్త్రమైంది. కమండల్‌(హిందూత్వ రాజకీయాలు) అస్త్రంతో భాజపా, మండల్‌(ఓబీసీలకు రిజర్వేషన్లు) నినాదంతో సోషలిస్టులు పుంజుకున్నారు.

కాంగ్రెస్‌కు ఎందుకు నష్టం?

అయోధ్య వివాదం 1984 తర్వాత దేశ రాజకీయాలపై ఎక్కువ ప్రభావం చూపుతూ వచ్చినప్పటికీ.. దీని మూలాలు మాత్రం 1949లోనే కనిపించాయి. వివాదాస్పద బాబ్రీ మసీదు కట్టడం మధ్యలో 1949లో రాముడు, సీతాదేవి విగ్రహాలు వెలిశాయి. ఈ పరిణామాల్ని అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌(కాంగ్రెస్‌) చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణల్ని మూటగట్టుకున్నారు. హిందూత్వ విషయంలో పంత్‌ సానుకూలంగా మెలిగారనడానికి ప్రధాని నెహ్రూతో ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలే రుజువనేది పరిశీలకుల అభిప్రాయం. అయోధ్యలో ఏదో జరుగుతోందని అనుమానించిన ప్రధాని నెహ్రూ 1950 ఏప్రిల్‌ 17వ తేదీన పంత్‌కు ఓ లేఖ రాశారు. ‘‘మత కోణంలో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో వాతావరణం బాగా దెబ్బతింటోందని చాన్నాళ్లుగా నేననుకుంటూ ఉన్నా. ఇదో పరాయి భూభాగంగా మారుతోందన్న అనుమానం వేస్తోంది. కేవలం రాజకీయాల కోసం- ఈ జాడ్యం విషయంలో చాలా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నామని నాకు అనిపిస్తోంది’’ అంటూ పరోక్షంగా పంత్‌కు హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఆచార్య నరేంద్రదేవ్‌ లాంటి సోషలిస్టుల్ని ఎదుర్కొని.. తన రాజకీయ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మతతత్వం విషయంలో పంత్‌ మెతకగా వ్యవహరించారని చరిత్రకారులు చెబుతారు. 1949లో మసీదులో విగ్రహాలు వెలియడం, ఆ తర్వాత మసీదు ప్రధాన ద్వారాన్ని మూసేయాలని కోర్టు ఆదేశించడం, ముస్లింలకు ప్రవేశాన్ని నిషేధించడం, దీన్నో వివాదాస్పద భూభాగంగా ప్రకటించడం.. ఇలాంటివన్నీ తదనంతర కాలంలో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయి. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత పరిస్థితులు మరింతగా మారాయి. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో- తన ఓటు బ్యాంకును విస్తరించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ మతం కార్డును సున్నితంగా ప్రయోగించింది. 1984లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత- అటు హిందువులు, ఇటు ముస్లింలలోని మతతత్వవాదుల్ని మచ్చికచేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిరాజనడం ద్వారా ప్రభుత్వం తొలుత ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇది మెజారిటీ హిందువుల్లో ఆగ్రహానికి కారణమైంది. కాంగ్రెస్‌ పార్టీ హిందువుల వ్యతిరేకి అని ముద్రవేయడం కోసం ఆరెస్సెస్‌, భాజపాలు రామజన్మభూమి అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడం ప్రారంభించాయి. వ్యతిరేకతను ఎదుర్కొంటున్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వం మరో తప్పటడుగు వేసింది. బాబ్రీ మసీదు గేటుకు వేసిన తాళాల్ని తెరిపించింది. 1986లో ఫైజాబాద్‌ జిల్లా కోర్టు జడ్జి ఈ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని అమలుచేసింది కాబట్టి.. దాని ప్రభావం ఆ పార్టీపై దీర్ఘకాలంలో పనిచేసింది. దీంతో రామమందిర ఉద్యమం మరింత ఊపందుకుంది. 1992 డిసెంబరు 6వ తేదీన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేదాకా పరిస్థితులు వెళ్లాయి. కేంద్రంలో ఆ సమయంలో అధికారంలో ఉన్న పి.వి.నరసింహారావు ప్రభుత్వం మసీదును రక్షించడానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేకపోయిందన్న విమర్శలు ఎదుర్కొంది. మతం(హిందూ లేదా ముస్లిం) కార్డు కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. హిందూత్వ వాదులు ఎదగడానికి కాంగ్రెస్‌ అవకాశం కల్పించిందని ముస్లింలు మండిపడ్డారు. హిందువుల్లోని మెజారిటీ వర్గం భాజపాకు దగ్గరయింది.

భాజపా ఎలా పుంజుకుంది?

భాజపా ఉత్థానంలో అయోధ్య వివాదానిది కీలకపాత్ర. 1980లో ఏర్పడిన భాజపా- మొదట్లో ఒకప్పటి జనసంఘ్‌కు మరో రూపంగానే ఉండేది. 1949-1980 మధ్య దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌దే ఏకాఛత్రాధిపత్యం. ఆరెస్సెస్‌, జనసంఘ్‌ల కార్యకలాపాలు హిందూ జాతీయవాదం విస్తరణకే పరిమితమయ్యాయి. అప్పట్లో అయోధ్య వివాదంపై ఇవి అంతగా దృష్టిపెట్టలేదు. రామమందిర ఉద్యమంలో పాలుపంచుకునే వారికి మద్దతిస్తూ ఉండేవి. ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(1984) కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించడం, తమ పార్టీ కేవలం రెండు సీట్లకే పరిమితం కావడంతో- భాజపా వ్యూహం మార్చింది. దేశ రాజకీయాల్లో చోటు కోసం తపిస్తున్న కమలదళానికి కొత్త అధిపతిగా ఎల్‌.కె.ఆడ్వాణీ వచ్చారు. హిందూత్వ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇవ్వడం లక్ష్యంగా.. 1989లో భాజపా అయోధ్యలో ఆలయ నిర్మాణంపై పాలంపూర్‌లో ఓ తీర్మానాన్ని ఆమోదించింది. 1989లో కాంగ్రెసేతర పార్టీలతో జతకట్టి 85 సీట్లు గెలుచుకుంది. పార్టీని మరింతగా విస్తరించే లక్ష్యంతో అడ్వాణీ గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి యూపీలోని అయోధ్య వరకు ‘రామ్‌ రథయాత్ర’ ప్రారంభించారు. యాత్ర సాగుతున్న కొద్దీ దీనికి విపరీత స్పందన వచ్చింది. అక్కడక్కడా మతఘర్షణలూ చోటుచేసుకున్నాయి. రథయాత్ర తర్వాత ఐదేళ్లూ ఆలయ నిర్మాణం ఎజెండాగా భాజపా పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఆలయ నిర్మాణం శంకుస్థాపనను సూచించేలా దేశవ్యాప్తంగా శిలాన్యాస్‌, శిలాపూజ కార్యక్రమాలు చేపట్టింది. 1991లో భాజపా 120 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత- భారత రాజకీయాల్లో భాజపా బలమైన శక్తిగా నిలబడింది. ఇక ఆ పార్టీ వెనుదిరిగి చూడలేదు. 1999లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2014 నుంచి సంపూర్ణ మెజారిటీతో అధికారంలో కొనసాగుతోంది.

మండల్‌ రాజకీయాలతో ప్రాంతీయ పార్టీలు

దేశంలోని హిందీ బెల్ట్‌లో భాజపా హిందూత్వ రాజకీయాలకు చెక్‌ పెట్టేందుకు సోషలిస్టులు క్రియాశీలమయ్యారు. బీసీలకు 27 శాతం రిజర్వేషన్ల కోసం మండల్‌ కమిషన్‌ సిఫార్సుల్ని నాటి ప్రధాని వి.పి.సింగ్‌ అమలుచేశారు. ఈ రాజకీయ సమీకరణల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం, బిహార్‌లో లాలు ప్రసాద్‌ శక్తి కేంద్రాలుగా ఎదిగారు. ముస్లింల ప్రయోజనాలు కాపాడేవారిగా ముద్రవేసుకున్నారు. 1990లో ఆడ్వాణీ రథయాత్రను లాలు ప్రసాద్‌ అడ్డుకుని ఆయనను నిర్బంధించారు. అయోధ్యలో కరసేవలకులపై కాల్పులకు ములాయం ఆదేశించారు. ఇది హిందూత్వవాదులు మరింతగా ఏకం కావడానికి దోహదం చేసింది.
1949లో మసీదులో విగ్రహాలు వెలియడం, ఆ తర్వాత మసీదు ప్రధాన ద్వారాన్ని మూసేయాలని కోర్టు ఆదేశించడం, ముస్లింలకు ప్రవేశాన్ని నిషేధించడం, దీన్నో వివాదాస్పద భూభాగంగా ప్రకటించడం.. ఇలాంటివన్నీ తదనంతర కాలంలో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయి.
‘‘ఎన్నికల్లో పోరాడటానికి ఆలయం అంశం భాజపాకు ఒక అస్త్రంలాగా పనిచేసింది. మొదట్లో గాంధీజీ, స్వాతంత్య్ర పోరాటం కాంగ్రెస్‌ పార్టీ ప్రతీకలాగా ఉండేవి. ఆ తర్వాత ‘రామమందిరం అంటే భాజపాయే’ అనే పరిస్థితిని కమలదళం తీసుకువచ్చింది. హిందూత్వ రాజకీయాలను దూకుడుగా ముందుకు తీసుకువెళ్లగలిగింది.’’
- మణీంద్రనాథ్‌ ఠాకూర్‌ (జేఎన్‌యూ ప్రొఫెసర్‌)
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.