close

ప్ర‌త్యేక క‌థ‌నం

హైవే డొల్ల.. ఒళ్లు గుల్ల

విజయవాడ- రాజమహేంద్రవరం జాతీయ రహదారి అధ్వానం
భారీగా టోల్‌ రుసుము వసూలు
అయినా గుంతలు పూడ్చడంలోనూ నిర్లక్ష్యం
పిచ్చిమొక్కలతో కుంచించుకుపోతున్న రోడ్డు
గుంతలు తేలిన రోడ్డుపై  ప్రయాణికులకు నిత్యం అవస్థలు
ఈనాడు - అమరావతి

విజయవాడ నుంచి రాజమహేంద్రవరం మధ్య 190 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. దీనిని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి-16గా పేర్కొంటారు. ఇందులో విజయవాడ నుంచి పశ్చిమగోదావరిలోని గుండుగొలను వరకు ఎన్‌హెచ్‌-16గా ఉండగా, అక్కడి నుంచి తాడేపల్లిగూడెం, రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వరకు ఎన్‌హెచ్‌-216ఎగా పరిగణిస్తారు. ఈ రహదారిలో కలపర్రు టోల్‌ప్లాజా నుంచి దెందులూరు ప్లాజా వరకు అనేకచోట్ల గుంతలమయంగా మారింది. దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేయకపోవడంతో ఇటీవల వర్షాలకు అవి మరింత పాడయ్యాయి. కొన్నిచోట్ల రహదారి బాగున్నా మధ్యలో పెద్దపెద్ద గుంతలున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్లేవారు ఈ గుంతల దగ్గరకొచ్చేసరికి హఠాత్తుగా బ్రేకులు వేయాల్సి వస్తోంది. వేగంగా వెనుక నుంచి వచ్చే వాహనాలు వీటిని ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాలు పట్టవా?
వాహనాలు రహదారి చివరకు వెళ్లి అంచు దిగిపోకుండా ఇరువైపులా క్రాష్‌ బ్యారియర్స్‌ ఉంటాయి. మలుపులు, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వాటిపై రేడియం స్టిక్కరింగ్‌ వేస్తారు. చాలా చోట్ల ఈ క్రాష్‌ బ్యారియర్స్‌ దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనాలు రోడ్డు పక్కకు వెళ్లి ప్రమాదానికి గురవుతున్నాయి. రహదారిపైకి పిచ్చి మొక్కలు వచ్చేసినా వాటిని తొలగించకపోవడం నిర్వహణలోపానికి పరాకాష్ట. కొన్నిచోట్ల కిలోమీటర్ల దూరం కొలదీ క్రాష్‌ బ్యారియర్స్‌ను సైతం మూసేలా మొక్కలు పెరిగాయి. ఏటా జంగిల్‌ క్లియరెన్స్‌కు నిధులు వెచ్చిస్తున్నా పిచ్చిమొక్కలు మాత్రం అలాగే ఉండటం గమనార్హం.

నిబంధనలన్నీ తూచ్‌
జాతీయ రహదారి దెబ్బతింటే ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. బాగా పాడైతే అక్కడ పాత లేయర్‌ తొలగించి కొత్త లేయర్‌ వేయాలి. రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించాలి. డివైర్‌ మధ్యలోనూ నిర్వహణ బాగుండాలి. విజయవాడ పీడీ పరిధిలో నిర్వహణ సక్రమంగా లేదు. రాజమహేంద్రవరం పరిధిలో మాత్రం కొంత వరకు పనులు చేస్తున్నారు.
* ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం ఈ రహదారిపై వాహనాలు 100 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా నిర్మించారు. గుంతల కారణంగా వాహనాలు ఆ వేగంతో వెళ్లడం సాధ్యపడడం లేదు.
* బీ రహదారిపై ఓ లేయర్‌ చాలా వరకు దెబ్బతింది. వెంటనే కొత్త లేయర్‌ వేయాల్సి ఉంది. కానీ కొన్నిచోట్ల మాత్రమే వేశారు.

టోలు వసూలులో రాజీ లేదు
విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 4 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. వీటిలో పొట్టిపాడు, కలపర్రు టోల్‌ప్లాజాలు ఎన్‌హెచ్‌ఏఐ విజయవాడ ప్రాజెక్ట్‌ డైరెక్టరు (పీడీ) పరిధిలో, ఉంగుటూరు, ఈతకోట టోల్‌ప్లాజాలు రాజమహేంద్రవరం పీడీ పరిధిలో ఉంటాయి.

ఒక్కో టోల్‌ప్లాజా వద్ద ఒకవైపు ప్రయాణానికి రుసుము
కారుకు రూ.90-95; బస్సుకు రూ.320; పెద్ద లారీకి రూ.350; భారీ వాహనానికి రూ.500.
* విజయవాడ నుంచి రాజమహేంద్రవరం కారులో వెళ్లాలంటే ఈ నాలుగు టోల్‌ప్లాజాల్లో కలిపి రూ.360 చెల్లించాలి. టోల్‌ రుసుము వసూలులో రాజీపడని గుత్తేదార్లు, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) దెబ్బతిన్న చోట్ల రహదారి మరమ్మతులపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
* గతంలో ఇలాగే రహదారి గుంతలు తేలినా మరమ్మతులు చేయకపోవడంపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయకుండా టోల్‌ వసూలు చేస్తే సహించబోనని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద గట్టిగా హెచ్చరించారు. దీంతో అప్పట్లో ఆగమేఘాలపై మరమ్మతులు చేశారు.

వేగంగా మరమ్మతులు చేయిస్తాం
జాతీయ రహదారి పలుచోట్ల దెబ్బతిన్నట్లు మా దృష్టికి వచ్చిందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొన్నారు. వర్షాలకు మరింత ఎక్కువయ్యాయన్నారు. మరమ్మతులు చేయాలని గుత్తేదారులను ఇప్పటికే ఆదేశించామన్నారు. 2 ప్యాకేజీల్లో విస్తరణ పనులు జరుగుతున్నాయని.. వాటి పరిధిలో దెబ్బతిన్న రహదారిని కూడా మరమ్మతులు చేస్తామన్నారు.

నిత్యం తిరిగేవారికి నరకమే

విజయవాడకు చెందిన శ్రీనివాస్‌ విశాఖ వెళ్లేందుకు సూపర్‌ లగ్జరీ బస్సు ఎక్కారు. రద్దీగా ఉండటంతో వెనుక సీటులో కూర్చోవాల్సి వచ్చింది. గుంతల్లోపడి బస్సు కుదుపులకు లోనవడంతో శ్రీనివాస్‌ పలుమార్లు సీటులో ఎగిరిపడ్డారు. రాత్రంతా జాగారమే. డ్రైవర్‌ను అడిగితే రోడ్డంతా గుంతలున్నాయని, నిత్యం ఈ నరకం తప్పడం లేదని వాపోయారు. విజయవాడ వరకు బాగానే ఉన్న రోడ్డు అక్కడి నుంచి రాజమహేంద్రవరం వరకు ప్రయాణికులకు పరీక్ష పెడుతోంది. ఎక్కడ ఏ గుంత ఉందో అర్ధంకాక వాహనచోదకులు అయోమయానికి గురవుతున్నారు. రాత్రిపూట ప్రయాణించేవారి పరిస్థితి మరీ దారుణం. అధ్వానంగా మారిన రహదారితో ఒళ్లు గుల్లవడమే కాకుండా, వాహనాలు కూడా దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 


మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.