close

ప్ర‌త్యేక క‌థ‌నం

దడ పుట్టిస్తున్న ధరలు

భారీగా పెరిగిన కూరగాయల రేట్లు
భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడమే కారణం
తీగ జాతి పంటలకు తీవ్ర నష్టం
పూత, పిందె రాలి తగ్గిన ఉత్పత్తి
మరో నెల దాకా ఇదే పరిస్థితి!

కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. అమాంతంగా ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ప్రధాన మార్కెట్లకు సరుకు రాక తగ్గిపోయింది. దీంతో రాత్రి దాకా రద్దీగా ఉండే విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌, పటమట రైతుబజార్లలో కూరగాయల కొరత కారణంగా సాయంత్రం నాలుగైదు గంటలకే దుకాణాలు ఖాళీ అవుతున్నాయి. సరుకు తగ్గి.. డిమాండ్‌ పెరగడంతో సాధారణంగా కిలో రూ.5 వరకు అమ్మే దోస.. తిరుపతిలో ఏకంగా రూ.35 అయింది. కొత్తిమీర రెట్టింపు స్థాయికి చేరి కట్ట రూ.40 పలుకుతోంది. పాలకూర, గోంగూర అసలే దొరకడం లేదు. మాల్స్‌లో ఎరుపు, పసుపు రకం క్యాప్సికం కిలో రూ.200 పైనే ఉంది. జులైలో కిలో రూ.120 వరకు ఉన్న వెల్లుల్లి.. ఇప్పుడు రూ.200 అయింది.

పూత, పిందె రాలిపోయి
సెప్టెంబరు ఆఖరు నుంచి అక్టోబరు చివరి వరకు వానలు కురవడంతో నేలలో తేమ ఎక్కువై కూరగాయ పంటలు ఎండుముఖం పట్టాయి. అధికశాతం విస్తీర్ణంలో పంటలు ఎర్రబారాయి. నేలపై అల్లుకుని పండే తీగ జాతి కూరగాయలు వర్షాలకు కుళ్లిపోయాయి. పందిరి సేద్యంలో సాగు చేసే పంటలకు పూత, పిందె రాలిపోయింది. దీంతో రైతులు ఒక విడత కాపు కోల్పోయారు. వర్షాలకు తెగుళ్ల తీవ్రత అధికమై పచ్చిమిర్చి కొరత ఏర్పడింది.

రైతుకు మెరుగైన ధర
అధిక విస్తీర్ణంలో కూరగాయ పంటలు దెబ్బతిన్నా.. ప్రస్తుతం దిగుబడులు వచ్చే రైతులకు మెరుగైన ధర లభిస్తోంది. చిత్తూరు జిల్లాలో ఈగ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో టమోటా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే సరుకు రాక పెరుగుతుండటంతో ధర క్రమంగా తగ్గుతోంది. మంగళవారం 440 టన్నుల సరుకు వచ్చింది.
* మార్టూరు వ్యవసాయ మార్కెట్లో కిలో బీరకు రూ.50, బెండ రూ.30, వంకాయ రూ.40, టమోటాకు రూ.28 చొప్పున లభిస్తోంది. పచ్చిమిర్చి రోజుకు 20 లారీల వరకు వస్తుండగా.. కిలోకు రూ.14 చొప్పున కొంటున్నారు.

తగ్గిన కూరగాయల రాక

* గతంతో పోలిస్తే రైతుబజార్లు, మార్కెట్లకు కూరగాయల రాక సగం వరకు తగ్గింది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ రైతు బజారుకు రోజుకు 800 నుంచి 1,000 క్వింటాళ్ల కూరగాయలు అవసరం ఉండగా.. ఇప్పుడు 600 క్వింటాళ్లే అందుతున్నాయి. విజయవాడ రైతు బజార్లో దోస 120 క్వింటాళ్లు అవసరం కాగా 70 నుంచి 80 క్వింటాళ్లే వస్తోంది. క్యారెట్‌, పచ్చిమిర్చి 60 క్వింటాళ్లకు బదులుగా 30 నుంచి 40 క్వింటాళ్లే తెస్తున్నారు. కొత్తిమీర 120 మూటలు అవసరమైతే 40 మూటలే వస్తోంది. విజయవాడ స్వరాజ్‌ మైదాన్‌ రైతు బజార్లో పచ్చి మిర్చి దొరకని పరిస్థితి ఏర్పడింది.
* క్యారెట్‌ ప్రస్తుతం రూ.58 నుంచి రూ.60 ఉంది. ఊటీ, కోలార్‌ నుంచి రాష్ట్రానికి వస్తుంది. హైదరాబాద్‌ క్యారెట్‌ మార్కెట్‌కు వచ్చే దాకా ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉంది.

* మార్కెట్లకు పాలకూర, గోంగూర తక్కువగా వస్తోంది. అదీ కొద్దిసేపట్లోనే ఖాళీ అవుతోంది. కొత్తిమీర బెంగళూరు నుంచి రాష్ట్రానికి వస్తోంది. రెండు రోజుల కిందటి దాకా కట్ట రూ.20 చొప్పున లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.40 అయింది. పుదీన ధర ఎక్కువగానే ఉంది.

మరో నెల పాటు కటకటే

భారీవర్షాలు తగ్గడంతో నేలలో తేమ తగ్గుతోంది. పైరు ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతోంది. పూత, పిందె మొదలైంది. మరో నెలకు ముమ్మర కాపు వస్తుంది. అప్పటిదాకా ధరల జోరు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్నింటికి మాత్రం ధరలు తగ్గుతాయని వివరిస్తున్నారు.)
- ఈనాడు, అమరావతి

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.