
ప్రత్యేక కథనం
శబరిమల వివాదం
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఈ నాటిది కాదు. మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ ఈ వివాదం ఏళ్లుగా నలుగుతోంది. ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు- కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది. దీనిపై హింసాత్మక నిరసనలు కొనసాగాయి. కేరళలో రాజకీయంగా ఎదగడానికి శ్రమిస్తున్న భాజపా- శబరిమల వివాదాన్ని ఓ అస్త్రంగా వాడుతుండటం, దాన్ని నిలువరించేందుకు లెఫ్ట్‌ఫ్రంట్ ప్రభుత్వం ప్రయత్నించడంతో ఇదో రాజకీయ రణక్షేత్రంగానూ మారింది. ఆలయంలోకి ప్రవేశించడానికి పలువురు మహిళలు ప్రయత్నించినప్పటికీ.. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు మాత్రమే లోపలికి వెళ్లగలిగారు. కోర్టు తీర్పును శిరసావహించి, ఆలయంలోకి వెళ్లే మహిళలకు భద్రత కల్పించినందుకు కేరళలోని పినరయి విజయన్(ఎల్డీఎఫ్) ప్రభుత్వం విమర్శల్నీ ఎదుర్కొంది. నాటి తీర్పుపై పునస్సమీక్ష కోరుతూ దాఖలైన 64 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గురువారం తీర్పు వెలువరించనుంది.
వివాదం ఎందుకు?
హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని.. అందువల్ల ఆయన ఆలయంలోకి రుతు క్రమం వయసులో ఉన్న మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం, విశ్వాసం. అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని.. శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్తమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని కొందరు నమ్ముతారు. ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ- ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది. దీనిపై వివాదం మొదలైంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్నీ అనుమతించాలన్న డిమాండ్ ఊపందుకుంది.
మణికంఠుడి ఆలయం.. ఎందుకంత ప్రసిద్ధి?
కేరళలోని పతనంథిట్ట జిల్లాలో.. పశ్చిమ కనుమల్లోని శబరిమల శిఖరంపై ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం కొలువై ఉంది. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో, పెరియార్ పులుల అభయారణ్యంలో 18 గుట్టల మధ్య ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అంటే ‘వృద్ధి’ అని అర్థం. ఈ ఆలయానికి ఏటా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ గుడిని నవంబరు-డిసెంబరులో మండల పూజలకు, జనవరి 14న మకర సంక్రాంతికి, ఏప్రిల్ 14న విషువ పండుగకు, మలయాళ నెలల్లోని ప్రతి మొదటి అయిదు రోజుల సమయంలో భక్తులకు పూజలు చేసుకోవడానికి తెరుస్తారు.
దేవస్థానం చరిత్ర ఆసక్తికరం
పురాణాల ప్రకారం.. హరిహరుల(మోహిని, శివుడు)కు జన్మించిన శిశువును వారు పంపానది ఒడ్డున వదిలేసి వెళ్లారు. సంతానం లేని పందళం రాజు రాజశేఖర అడవిలోకి వేటకు వెళ్లినపుడు ఆ శిశువు కనిపించాడు. అతన్ని రాజు తన రాజమందిరానికి తెచ్చి పెంచుకున్నారు. మణికంఠన్ అని నామకరణం చేశారు. ఆ బాలుడికి అద్వితీయ శక్తులుండేవి. కొన్నాళ్లకు రాజుకు ఓ కొడుకు పుట్టగా ఆ బాలుడి భవిష్యత్తును కాంక్షించిన రాజు భార్య- మణికంఠన్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేసేది. ఒకసారి అడవిలోకి వెళ్లి పులి పాలు తీసుకురావాలని మణికంఠన్‌ను పురమాయించింది. మణికంఠన్ అడవిలోకి వెళ్లి.. ఏకంగా పులిపైనే సవారీ చేస్తూ తిరిగొచ్చాడు. తన భార్య తప్పుల్ని క్షమించాలని రాజు- మణికంఠన్‌ను వేడుకున్నారు. మీ పేరిట ఒక ఆలయాన్ని నిర్మిస్తానని రాజు చెప్పారు. ఆలయాన్ని నిర్మించాల్సిన ప్రదేశాన్ని సూచిస్తూ బాణాన్ని ప్రయోగించిన మణికంఠన్ ఆ తర్వాత అక్కడి నుంచి మాయమై, దేవతల్లో కలిసిపోయారని చెబుతారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత పరశురాముడు అయ్యప్పస్వామి విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి రోజు ప్రతిష్ఠించారని ప్రతీతి. దట్టమైన పుంగావనం అడవిలో 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
నైష్ఠిక బ్రహ్మచారి
అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోవడానికి ఓ యువతి సిద్ధమవగా.. ‘తనను దర్శించుకోవడానికి ఏ సంవత్సరమైతే కొత్త భక్తులు రారో అప్పుడే... వివాహం చేసుకుంటాను’ అని స్వామి స్పష్టంచేశారట. అయితే... అయ్యప్పను దర్శించుకోవడానికి ఎప్పుడూ ‘కన్ని స్వాములు’ (మొదటిసారి దీక్ష తీసుకున్నవారు) వస్తూనే ఉండటంతో అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారిగా కొలువుదీరారు. అప్పట్నుంచి సదరు మహిళ అదృశ్య రూపంలో గుడి బయటే వేచిచూస్తున్నారని భక్తుల నమ్మకం. లైంగికపరమైన విషయాలకు దూరంగా ఉండటం ద్వారా.. స్వామి శక్తులు పొందుతారన్నది వారి విశ్వాసం.
41 రోజుల దీక్ష
శబరిమల ఆలయానికి వచ్చే భక్తులు తదేక దీక్షతో గుట్టలను అధిరోహించాల్సి ఉంటుంది. వారు స్వామిని చేరుకోవడానికి ముందు 41(మండలం) రోజుల పాటు దీక్షలో ఉంటారు. నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. మొదటిసారి దీక్ష తీసుకున్నవారిని కన్ని స్వాములని, రెండోసారి తీసుకుంటే కత్తి స్వాములని, మూడోసారికి గంట స్వాములని, నాలుగో సారికి గద స్వాములని పిలుస్తారు. మూడుసార్లు దీక్ష పూర్తిచేసిన వారు గురుస్వామి కావడానికి అర్హులు.
నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
కేరళ హైకోర్టు తీర్పును ఇండియన్ యంగ్ లాయర్స్ అసోషియేషన్ తరఫున ఆరుగురు మహిళలు 2006లో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు అది విఘాతమని వాదించారు. దానిపై విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. మహిళల ప్రవేశానికి అనుమతించింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌లు అనుకూలంగా తీర్పిచ్చారు. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుపై మొదట తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన ఆలయ ప్రధాన అర్చకుడు కందారు రాజీవరు... తర్వాత మెత్తబడ్డారు. సనాతన సంప్రదాయాలను గౌరవించాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో గట్టిగా వాదించిన, ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సైతం ఆ తర్వాత తీర్పును గౌరవిస్తామంటూ ప్రకటించింది. అయితే.... వేలమంది అయ్యప్ప భక్తులు మాత్రం మహిళల ప్రవేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదంటూ కేరళతో పాటు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో నిరసనలకు దిగారు.
ఏ న్యాయమూర్తి ఏమన్నారంటే..
తప్పనిసరి మతాచారం కాదు
జస్టిస్ దీపక్‌మిశ్రా
శబరిమలలో అనుసరిస్తున్న సంప్రదాయాన్ని ‘తప్పనిసరి మతాచారంగా పరిగణించలేం. మతమంటే జీవితాన్ని దైవంతో అనుసంధానం చేసే విధానం. దైవారాధనలో వివక్ష ఉండకూడదు. ఆరాధనలో పాటించాల్సిన సమానత్వంపై పితృస్వామ్య వ్యవస్థ భావజాలం పైచేయి సాధించకూడదు.(జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్ తరఫున జస్టిస్ దీపక్‌మిశ్రానే తీర్పు రాశారు)
ఆ నిబంధన కొట్టివేయ తగినది
జస్టిస్ నారిమన్
ఆలయంలోకి 10-50 ఏళ్లలోపు వయసున్న బాలికలు, మహిళల్ని అనుమతించకూడదన్న సంప్రదాయం రాజ్యాంగంలోని అధికరణలు 25(1), 26లకు విరుద్ధంగా ఉంది. మహిళల ప్రవేశాన్ని నిరోధిస్తున్న కేరళ హిందూ ప్రార్థనా స్థలాల(ప్రవేశాలకు అనుమతి) నిబంధనలు-1965లోని రూల్-3(బి) కొట్టివేయ తగినది.
వారిది ప్రత్యేక శాఖేమీ కాదు
జస్టిస్ డీవై చంద్రచూడ్
మహిళలకు ఆరాధన హక్కును నిరోధించడానికి మతాన్ని ముసుగుగా ఉపయోగించకూడదు. మతానికి సంబంధం లేని కారణాలతో శతాబ్దాల తరబడి మహిళలపై నిషేధం కొనసాగుతోంది. అయ్యప్ప స్వామి భక్తులది హిందూ మతమే. ప్రత్యేకమైన మత శాఖ ఏమీ కాదు. శారీరక పరిస్థితిని కారణంగా చూపి, మహిళల గౌరవాన్ని భంగపరుస్తూ ఉండే ఎలాంటి మతపరమైన సంప్రదాయమైనా రాజ్యాంగ వ్యతిరేకమే. ఇది మహిళల స్వేచ్ఛ, సమానత్వం, గౌరవాన్ని హరిస్తోంది.
మత విశ్వాసాల్లో జోక్యం తగదు
జస్టిస్ ఇందూ మల్హోత్రా
దేశంలో లౌకిక వాతావరణాన్ని కొనసాగించాలంటే లోతైన అర్థాలున్న మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. సతీ సహగమనంలాంటి సాంఘిక దురాచారాలను తప్పిస్తే ఎలాంటి సంప్రదాయాలను కొట్టివేయవచ్చో... చెప్పాల్సిన పని న్యాయస్థానాలది కాదు. ఇక్కడ మహిళల సమానత్వ హక్కుకు, అయ్యప్ప భక్తుల ప్రార్థనా హక్కులకు మధ్య వివాదం తలెత్తింది. ఈ సమస్య ఒక్క శబరిమలతో ఆగదు. ఇతర ప్రార్థనా స్థలాలపైనా ప్రభావం చూపుతుంది. మతపరమైన వ్యవహారాల్లో హేతువాదాన్ని తీసుకురాకూడదు. భారతదేశం విభిన్న మతాచారాలకు నిలయం. రాజ్యాంగం ప్రకారం తాము నమ్మిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయిన ఆరాధించే హక్కును తోసిపుచ్చడానికి వీల్లేదు.
మరిన్ని

దేవతార్చన
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!