close

ప్ర‌త్యేక క‌థ‌నం

యుద్ధ విమానాల గాలి దుమారం

రఫేల్‌పై నేడు సుప్రీం తీర్పు

రఫేల్‌... భారతీయ రాజకీయాల్ని ఇటీవలి కాలంలో అత్యధికంగా ప్రభావితం చేసిన అంశమిది. వాయుసేన బలోపేతంలో భాగంగా ఫ్రాన్స్‌ నుంచి ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందం తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తం వ్యవహారం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరగా... ఒప్పందాల్లో లోపాల్లేవంటూ కోర్టు తేల్చింది. దీనిపై దాఖలైన సమీక్ష పిటిషన్లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించనుంది.


వివాదం వీరి చుట్టే..

* ప్రధాని మోదీ: యూపీఏ హయాంలో విమానాల కొనుగోలుకు తీసుకున్న నిర్ణయాన్ని మోదీ 2015 నుంచి ముందుకు తీసుకువెళ్లారు. ధరల నిర్ణయ క్రమాన్ని మొత్తం సమర్థించారు.

* రాహుల్‌గాంధీ: రఫేల్‌పై విపక్షాల ఆరోపణల్ని నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లారు. ఒప్పందంలో పారదర్శకత లేదని, అందులోని   వివరాల్ని ప్రజల ముందుంచాలని పట్టుబట్టారు.
* రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌: అనిల్‌ అంబానీ నేతృత్వంలోని ఈ కంపెనీ రఫేల్‌ ఒప్పందంలో భారతీయ భాగస్వామి. దీన్ని నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారనేది కాంగ్రెస్‌ ఆరోపణ.

* దసో ఏవియేషన్‌: ఫ్రాన్స్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ. వివాదానికి కేంద్ర బిందువు ఇదే.


యూపీఏ-2 హయాంలో తొలి అడుగులు

వైమానిక దళాన్ని శతృ వినాశినిగా మార్చడానికి అధునాతన యుద్ధ విమానాల్ని సమకూర్చుకోవాలని యూపీఏ-2 హయాంలో నిర్ణయించి 2012లో టెండర్లు పిలిచారు. అతి తక్కువ కోట్‌ చేసిన దసో ఏవియేషన్‌ను ఎంపికచేశారు. 126 విమానాలకు రూ.68 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు.


ఇదీ ఒప్పందం..

మొత్తం 36 రఫేల్‌ యుద్ధవిమానాలను రూ.58 వేల కోట్లు (7.87 బిలియన్‌ యూరోలు) చెల్లించి భారత్‌ కొనుగోలు చేస్తుంది. 15 శాతం నిధుల్ని ముందే ముట్టజెప్పాలి. భారత్‌కు రఫేల్‌ అత్యాధునిక మెటీయోర్‌, స్కాల్ప్‌ శతఘ్నులను సైతం అందిస్తుంది(దసో, రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ సంస్థల సంయుక్త ప్రకటన ఇది). రూ.58 వేల కోట్లలో 20 శాతం నిధుల్ని భారత్‌లోని పరిశ్రమల నుంచి విడిభాగాల సేకరణకు, మరో 30 శాతం నిధులను ఇక్కడి వివిధ వైమానిక, సైనిక పరిశోధన కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు(సవరించిన నిబంధనలివి). ఇందుకోసం భారత ప్రభుత్వం ఎంపికచేసిన 75 సంస్థల నుంచి దసో తనకిష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు.


భగ్గుమన్న కాంగ్రెస్‌

ఒప్పందంలో పారదర్శకత లేదని, యూపీఏ హయాంలో ప్రతి యుద్ధ విమానంపై తాము ప్రాథమికంగా నిర్ణయించిన ధర కంటే ప్రస్తుతం మూడు రెట్లు అధికంగా చెల్లిస్తున్నారంటూ కాంగ్రెస్‌ మండిపడింది. ఎన్డీఏ ప్రభుత్వం మొదట పార్లమెంటులో చేసిన ప్రకటనలో ఒక్కో విమానం ధర రూ. 670కోట్లుగా తెలిపిందని, ఒప్పందం తర్వాత 2016 నవంబరు 18న పార్లమెంటుకు సమర్పించిన లెక్కల్ని చూస్తే ఒక్కోదాని ధర రెట్టింపునకు పైగా అంటే సుమారు రూ.1,600 కోట్లుగా ఉందంటూ విమర్శిస్తోంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌కు రూ.21 వేలకోట్ల మేరకు లబ్ధి చేకూర్చేందుకే నిబంధనలు మార్చారని ఆరోపించింది. ఈ ఆరోపణల్ని అనిల్‌ అంబానీ ఖండించారు.


హొలండె.. దుమారం

రఫేల్‌పై దేశంలో దుమారం కొనసాగుతుంటే.. ‘‘రఫేల్‌ ఒప్పంద సమయంలో రిలయన్స్‌ కంపెనీ పేరును భారత ప్రభుత్వమే సూచించింది. అందుకే దాన్ని నిరాకరించడానికి మాకు అవకాశం దక్కలేదు’’ అంటూ అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హొలండె చేసిన ప్రకటన వివాదానికి మరింత ఆజ్యం పోసింది. భారత రక్షణశాఖ వివరణ ఇస్తూ - భాగస్వామి ఎంపికలో దసోకు పూర్తి స్వేచ్ఛ ఉందని, దానిపై భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాల ఒత్తిళ్లు ఉండవని స్పష్టంచేసింది. అప్పటి విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్‌.జయశంకర్‌ ఫ్రాన్స్‌లో రఫేల్‌పై విలేకరులతో మాట్లాడిన రెండు రోజులకే దసోతో ఒప్పందం కుదిరింది. అందులో హాల్‌ ప్రస్తావనలేదు. జెట్ల సంఖ్య 126నుంచి 36కు తగ్గిపోయింది.


కేసులన్నీ కొట్టేసిన సుప్రీం

యుద్ధ విమానాల ధరల నిర్ణయ క్రమం, ఇతర పూర్తి వివరాల వెల్లడికి ప్రభుత్వం ‘జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని’ అనే నిబంధనను బూచిగా చూపుతోందని ఆరోపిస్తూ.. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలని సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ తర్వాత జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం 2018, సెప్టెంబరు 14న కేసులన్నీ కొట్టేసింది. ఆ తీర్పును సమీక్షించాంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా. అరుణ్‌శౌరి, న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ వేర్వేరుగా సుప్రీంను ఆశ్రయించారు. కక్షిదారుల వాదనల తర్వాత సమీక్షకు సుప్రీం అంగీకరించింది.


ఏడాదిలోనే మారిన ధరలు

ప్రధాని మోదీ ప్రకటన: ఏప్రిల్‌, 2015
* ఏమన్నారు?: దసో నుంచి 126 రఫేల్‌ యుద్ధ విమానాల్ని కొంటున్నాం
* మనకేం లాభం?: ‘మేకిన్‌ ఇండియా’ వర్తింపు
* ఏం చేస్తారు?: 18 జెట్‌లు ఫ్రాన్స్‌లో తయారీ, 108 విమానాలు హాల్‌తో కలిసి భారత్‌లో తయారీ
* ఒప్పందం విలువ: రూ.42 వేల కోట్లు

పార్లమెంటులో అప్పటి రక్షణమంత్రి పారికర్‌
తొలి ప్రకటన(2015)
* ఏమన్నారు?: 2015లో ప్రధాని మోదీ సంతకాలు చేసినట్లు చెప్పారు.
* ఎన్ని విమానాలు కొంటామన్నారు?: 126
* ధర: రూ.90 వేల కోట్లు
పారికర్‌ మలి ప్రకటన (2016)
* ఏమన్నారు?: 2016 సెప్టెంబరు 23న ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.
* ఎన్ని కొంటామన్నారు?: 36 విమానాలు
* ఒక్కోదాని ధర: సుమారు రూ.670 కోట్లు
* మొత్తం ఒప్పందం విలువ: రూ.58 వేల కోట్లు
* విమానాలు భారత్‌కు ఎప్పుడిస్తామన్నారు?:  2022 ఏప్రిల్‌ లోగా 


ఓవైపు భారత వ్యతిరేకులు అయిదో తరం యుద్ధ విమానాలను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మనదేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టేసే పరిస్థితులు సృష్టించలేం

- సుప్రీం (2018, సెప్టెంబరు14)
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.