close

ప్ర‌త్యేక క‌థ‌నం

పులికాటేస్తున్న పూడిక

ఇసుక మేటలతో మూసుకుపోతున్న సముద్రం-సరస్సు ముఖద్వారాలు
ఉప్పు శాతం పెరిగి తగ్గుతున్న మత్స్య సంపద
జాలర్లకు బతుకు తెరువుపై ప్రభావం
జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా పరిస్థితి
తమిళనాడులో చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో అధ్యయనాల దశ
ఈనాడు, నెల్లూరు, తడ

ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేకత తీసుకువస్తున్న పులికాట్‌ సరస్సు ప్రమాదపు అంచుల్లోకి జారుతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచిన ఇది పూడిక ముప్పు ఎదుర్కొంటోంది. బంగాళాఖాతం-పులికాట్‌ సరస్సు కలిసే చోట ముఖద్వారాలు ఇసుక మేటలతో పూడుకుపోవడంతో సముద్రపు నీరు సరస్సులోకి రావడం లేదు. దీంతో పులికాట్‌లో లవణ శాతం పెరిగిపోయి జంతుజాలానికి ప్రాణాంతకంగా మారింది.

శ్రీహరికోటకు భద్రత సమస్యలు
తుపానులు, వర్షాల సమయంలో మినహాయిస్తే పులికాట్‌లోకి సముద్రపు నీరు వచ్చే అవకాశాలు తగ్గిపోతుండటంతో మత్స్యసంపద నిండుకుంటోంది. ఫలితంగా, ఆహారం దొరక్క విదేశీ పక్షులు అల్లాడిపోతున్నాయి. పునరుత్పత్తి సరిగా జరగడం లేదు. సరీసృపాలు, ఇతర నీటిజీవులు కనుమరుగవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన పక్షుల సంరక్షణ కేంద్రాలపై ప్రభావం పడుతూ జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారింది. పులికాట్‌ సరస్సు మీదుగా సముద్రంలోకి పడవలు వెళ్లేందుకూ దారి లేక మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు సముద్రం, మరోవైపు పులికాట్‌ సరస్సుతో శత్రు దుర్భేద్యంగా ఉన్న శ్రీహరికోట రాకెట్‌ కేంద్రానికీ భద్రత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పర్యాటకంగానూ ప్రాభవం కోల్పోయే పరిస్థితి నెలకొంది.

లక్ష విహంగాలకు ఆహార స్థలి
దేశంలోనే అతిపెద్దదైన ఒడిశాలోని చిల్కా సరస్సు తరవాత ఆ స్థాయి గుర్తింపు కలిగినది పులికాట్‌. తమిళనాడులోని తిరవళ్లూరు జిల్లా పులికాట్‌ నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వాకాడు సమీపం వరకు కనిపిస్తుంది. 100 రకాల మత్స్యజాతులు, 80 రకాల నీటిపక్షుల జాతులకు ఆవాసమై సుమారు లక్ష విహంగాలకు ఆహారం అందిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని 60 తీరప్రాంత గ్రామాల్లో 30 వేల మంది మత్స్యకారులు ఈ సరస్సు ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే 5 మండలాల్లో సరస్సు విస్తరించి ఉంది.

ప్రయత్నాలు చేస్తున్న తమిళనాడు
సముద్రం-సరస్సు ముఖద్వారాలను తెరిపిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే తిరువళ్లూరు జిల్లా పులికాట్‌ సమీపంలో ముఖ ద్వారాలు తెరిపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏటా మాదిరే రూ.10 లక్షల వ్యయంతో తమిళనాడు పీడబ్ల్యూడీ విభాగం జేసీబీలు పెట్టి ఇసుక మేట తొలగిస్తోంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో రూ.కోటి వ్యయంతో డ్రెడ్జింగ్‌ పనులు చేస్తున్నారు.


డీపీఆర్‌ సిద్ధం చేసిన రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వాకాడు మండలం రాయదొరువు వద్ద డ్రెడ్జింగ్‌ చేపట్టి ముఖద్వారం తెరించేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఎన్‌ఐవోటీ వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసి రూ.48 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) సిద్ధం చేసి నివేదించాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘సకాన్‌’ వర్గాలు ముఖద్వారం తెరవడం వల్ల పులికాట్‌పై ప్రభావాన్ని అధ్యయనం చేసి నివేదిక అందించారు. వైల్డ్‌లైఫ్‌ సీసీఎఫ్‌ అనుమతులు, డీజీపీఎస్‌ సర్వే కోసం నిరీక్షిస్తున్నారు. రెండు రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.