close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎండ మండిపోయింది

వడగాలులతో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి
గత ఐదేళ్లలో ఈసారే ఎక్కువ
ఈనాడు - విశాఖపట్నం

భానుడి ప్రతాపానికి ఈ వేసవిలో తెలుగు రాష్ట్రాలు బెంబేలెత్తిపోయాయి. కోస్తా, రాయలసీమ, తెలంగాణ అనే తేడా లేకుండా అన్నిచోట్లా వడగాలులకు ప్రజలు అల్లాడిపోయారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి వడగాలులు వీచిన రోజుల సంఖ్య బాగా పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. వాతావరణ మార్పులే ఈ అధిక వేడికి కారణమని భారత వాతావరణ విభాగం మాజీ డైరెక్టర్‌ పి.వి.రామారావు ‘ఈనాడు’తో అన్నారు. అసాధారణ వడగాల్పులకు కారణాలను ఆయన వివరించారు.

సాధారణంగా ఏప్రిల్‌ రెండో వారం దాటాక వేడిగాలులు వీస్తుంటాయి. ఈ సంవత్సరం మార్చి మొదటివారం నుంచే వాటి ప్రభావం కనిపించింది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవటంతో వేసవి తీవ్రత జూన్‌ మూడో వారం వరకు కొనసాగింది. ఈ నెలలో కోస్తాంధ్రలోని ఏడు, తెలంగాణలోని ఐదు జిల్లాల్లో వడగాలులు వీచాయి. రాయలసీమలో జూన్‌లో సైతం 38 నుంచి 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాలో వేసవిలో సగటున 15 రోజులు వడగాల్పులు వీస్తాయని, ఈసారి 24 రోజులపాటు ప్రభావం నమోదైందని రామారావు వివరించారు. తెలంగాణలో 15- 20 రోజులు నమోదయ్యేవని, ఈసారి ఏకంగా 47 రోజులపాటు వడగాలుల ప్రభావం ఉందని చెప్పారు. రాయలసీమలో ఐదు రోజుల సగటుకుగాను ఈసారి 13 రోజులు వీచాయి.

ఈ నగరానికి ఏమైంది?
విశాఖ విమానాశ్రయంలో జూన్‌ 15న 43.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే 8.7 డిగ్రీలు ఎక్కువ. దీనికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్తేరు (విశాఖ మధ్యనగరం)లో మాత్రం అదే రోజు 34.9 డిగ్రీలు నమోదైంది. మే 24న విశాఖ విమానాశ్రయంలో 45 డిగ్రీలు నమోదవగా వాల్తేరులో 34.6 డిగ్రీలే రికార్డయింది. ఆయా రోజుల్లో విశాఖ విమానాశ్రయం మీదుగా పశ్చిమదిశ నుంచి వేడిగాలులు వీయగా, మిగిలిన నగరం మీదుగా దక్షిణాది చల్లని గాలులు వీచాయి. నగరంలోని కొండలే గాలుల దిశ మారడానికి కారణం.

47.2 డిగ్రీలు
రామగుండంలో మే 27న నమోదైన ఉష్ణోగ్రత. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇదే అత్యధికం. 34 సంవత్సరాల కిందట (1984 మే 22న) ఇదే ప్రాంతంలో 47.3 డిగ్రీలు రికార్డయింది. దాని తర్వాత ఇదే అత్యధికం.

ఎందుకిలా?

*  సముద్ర, వాతావరణంలోని మార్పుల వల్ల ఈసారి వేసవి రోజులు ఎక్కువగా నమోదయ్యాయి.
*  ఏయే ప్రాంతాల మీదుగా ద్రోణి ఏర్పడిందో దాని పరిధిలోని ప్రాంతాల మీదుగా వేడిగాలులు వీస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో చల్లగాలులు ఉంటాయి. ఏప్రిల్‌ 20న రాయలసీమ, తెలంగాణ మీదుగా ద్రోణి ఏర్పడింది. దీంతో ఆ రోజు ఈ రెండు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తా జిల్లాల్లో 34- 39 డిగ్రీలదాకే నమోదైంది.
*  బంగాళాఖాతం, అరేబియా సముద్రంలోని తేమను తీసుకొచ్చే గాలులతో ద్రోణి అనుసంధానమైనప్పుడు దాని పరిధిలోని ప్రాంతాల్లో వడగళ్లు, పిడుగులు పడే అవకాశం ఉంటుంది. మే 13న దక్షిణ కోస్తా నుంచి ఉత్తర కోస్తా మీదుగా ద్రోణి ఏర్పడినప్పుడు దానికి పశ్చిమాన ఉన్న ప్రాంతాల్లో వేడిగాలులు వీచాయి. తూర్పున సముద్రంవైపు ఉన్న ప్రాంతాల్లో చల్లగాలులు వీచాయి. తెలంగాణ, రాయలసీమల్లో 41- 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులు వీచాయి. కోస్తా జిల్లాల్లో మాత్రం 33 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.
*  ఏప్రిల్‌, మే నెలల్లో వచ్చిన ఫోని తుపాను రెండు రాష్ట్రాల మీద ప్రభావం చూపించింది. గాలులు తుపాను వైపుగా వీయడంతో పశ్చిమ దిశ నుంచి వేడిగాలులు తెలుగు రాష్ట్రాల మీదుగా పయనించాయి. తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 42- 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. గాలిలో తేమ శాతం తగ్గడంతో అది తీరం దాటిన వారం రోజుల వరకూ తెలుగు రాష్ట్రాలు వేడిగాలులతో ఉడికిపోయాయి.
*  జూన్‌ 11 నుంచి 16 మధ్య తెలంగాణ, కోస్తాంధ్రల్లో వడగాలులు వీచాయి. జూన్‌ 15న చాలాచోట్ల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతం నడుమ ద్రోణి ఏర్పడడంతో విశాఖ, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.