close

ప్ర‌త్యేక క‌థ‌నం

గ్రామీణ ఆర్థికానికి పెద్దపీట!

 ఐదేళ్లలో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు
వ్యవసాయం, గ్రామీణం రెండు కళ్లు
రైతులకు చేదోడువాదోడుగా సాంకేతికత
నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ఇదే కీలకం!
ఈనాడు - దిల్లీ

కేంద్రంలోని ఎన్డీయే సర్కారు జులై 5న ప్రవేశపెట్టబోతున్న సాధారణ బడ్జెట్లో గ్రామీణ ఆర్థిక రంగానికి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే అయిదేళ్లలో దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి ప్రభుత్వ-ప్రైవేటు రంగాల ద్వారా రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టాలని మోదీ 2.0 సర్కారు రూపొందించిన బృహత్తర ప్రణాళికకు అనుగుణంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన తొలి బడ్జెట్లోనే పలు పథకాలు ప్రకటించనున్నట్లు సమాచారం. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు 10,000 సంస్థల్ని నెలకొల్పడం, జాతీయ/ రాష్ట్ర రహదారుల వెంబడి దేశమంతటా గిడ్డంగుల వ్యవస్థని తీర్చిదిద్దడం వంటివి దీనిలో ఉన్నాయి. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని సేకరించి, వాటిని గిడ్డంగులకు తరలించే పనిని అంకుర పరిశ్రమల ద్వారా పూర్తి చేయించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గిడ్డంగులు, శీతల గిడ్డంగులను గొలుసుకట్టుగా ఏర్పాటు చేయడంలో కార్పొరేట్‌ సాయాన్ని తీసుకోనున్నారు. వ్యవసాయోత్పత్తులతో గ్రామ స్థాయిలో నిల్వలు ఏర్పాటు చేసుకునేలా ఈ పథకం ఉంటుంది. రైతుల కోసం ట్రాక్టర్లు తయారు చేయడమే కాకుండా వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేలా కార్పొరేట్‌ రంగాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఆహార శుద్ధి నుంచి గిడ్డంగుల నిర్మాణం వరకు అనేక రూపాల్లో కార్పొరేట్లకు భాగం కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల లోక్‌సభలో పేర్కొన్న విషయం తెలిసిందే.

నియంత్రణలపై అడ్డుకట్టలకు చెల్లుచీటీ
రైతులు తాము పండిస్తున్న ఉత్పత్తులకు తగిన మద్దతు ధర రాక అల్లాడిపోతున్న పరిణామం దేశమంతటా కనిపిస్తోంది. గిట్టుబాటు ధరల కోసం అనేక చోట్ల రైతులు ఉద్యమించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లను, వ్యవసాయోత్పత్తుల్ని అనుసంధానం చేసే కార్యక్రమాన్ని బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. అనేక నియంత్రణ అడ్డుకట్టల్ని తొలగించే చర్యల్ని ప్రభుత్వం వెల్లడించనుందని సమాచారం. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీల (ఏపీఎంసీ) చట్టాన్ని సంస్కరించే ప్రణాళికను కేంద్రం ప్రకటించనుంది. తద్వారా ఈ మార్కెట్లను రైతులకు చేరువ చేయనుంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు సంబంధించినది కావడం వల్ల చట్టాన్ని సవరించే దిశగా వాటిపై కేంద్రం ఒత్తిడి తీసుకురానున్నది.

స్మార్ట్‌ఫోన్లతో సమస్త సమాచారం
రైతులు స్మార్ట్‌ఫోన్ల సాయంతో యాప్‌ల ద్వారా సేద్యానికి సంబంధించిన విస్తృత సమాచారాన్ని తెలుసుకునేలా కొన్ని విధానాలు ప్రకటించనున్నారు. వాతావరణం, ధరలు, వ్యవసాయ సంబంధిత ఇతర కీలక సమాచారాన్ని త్వరితగతిన అందించేలా చేస్తారు. ట్రాక్టర్లు, కోత యంత్రాలు వంటివి సరఫరా చేసేవారితో రైతులు అనుసంధానమయ్యేందుకు యాప్‌లు ఉపయోగపడతాయి. అవసరమైన పనిముట్లను వ్యవస్థీకృత విధానంలో అద్దెకు తీసుకునేందుకు ఉపకరిస్తాయి. ఈ దిశగా బడ్జెట్లో ప్రోత్సాహకాలు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
* చేపలు, రొయ్యలను చెరువుల్లో సాగు చేసేవారి కోసం ప్రత్యేక నిధిని బడ్జెట్లో ప్రకటించవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
* గ్రామీణ ప్రాంతాల్లో సాగుకు వినియోగించని భూములను సౌర విద్యుత్తు కోసం వాడుకునేలా ప్రత్యేక ప్రణాళికను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం.
* సూక్ష్మ సేద్య పథకాల కింద కోటి హెక్టార్లను సాగు భూములుగా మలచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న 31 నీటిపారుదల పథకాలను గత అయిదేళ్లలో పూర్తి చేయగలిగారు. రాబోయే అయిదేళ్లలో మరో 68 ప్రాజెక్టుల పూర్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాలపైనే ఆధారపడే పరిస్థితిలో మార్పు తీసుకురావాలనేది సర్కారు సంకల్పం.
* ఎరువుల్ని నేరుగా పొలాల్లో జల్లే బదులు నీటిలో కలిపి వాడడం ద్వారా దాని వాడుకను 80% మేర, నీటి వినియోగాన్ని 20% మేర తగ్గించి, పర్యావరణానికీ మేలు చేసేలా చూడాలనేది సర్కారు ఉద్దేశం.
* ఎగుమతి ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులకు బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చూపించే అవకాశాలున్నాయి. ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా ఉపాధి అవకాశాలూ మెరుగుపడేలా చూడనున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.