Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

నీరుసించిన భారతావని

జలకళ కోల్పోయిన నీటి వనరులు
2020 నాటికి 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు ‘జీరో స్థాయి’కి
మరో పదేళ్లకు డిమాండ్‌లో సగం నీళ్లే లభ్యం!

అది ఉత్తర్‌ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌! ఓవైపు ఎర్రటి ఎండలు. గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. బదౌలి గ్రామంలోని ఓ అవ్వ శక్తినంతా కూడదీసుకుని పక్కింటి కొళాయి నుంచి నీళ్లు పట్టుకుందామని ప్రయత్నించింది. అంతే. ఆ ఇంటి యజమాని కర్రతో ఆమె తలపై బలంగా మోదాడు. గొంతు తడుపుకోవడానికి ప్రయత్నించినందుకు ఆమె నెత్తురు చిందించాల్సి వచ్చింది. నీళ్ల కోసం నిత్యం జనం ఇంట్లోకి తోసుకొచ్చి నిద్ర లేకుండా చేస్తుంటే... కర్రకు పనిచెప్పక ఇంకేం చేయగలమన్నది యజమాని వాదన!
అదే ప్రాంతంలోని జాలోన్‌ జిల్లాలో దేవిదయాల్‌ పాండే ఇంట్లో శుభకార్యం. రెండ్రోజుల్లో కొడుకు పెళ్లి. కానీ అర్ధంతరంగా ఆగిపోయింది! కారణం... అత్తింటికి వస్తే రోజూ రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి బిందెతో మంచినీళ్లు తీసుకురావాల్సి వస్తుందని వధువు ఆ పెళ్లికి నిరాకరించింది. నీళ్లు లేకపోవడంతో జాలోన్‌ వాసులు మరుగుదొడ్లను కూడా వాడలేని పరిస్థితి!
మే చివరి నాటికి మహారాష్ట్రలో నీటి ఎద్దడి తారస్థాయికి చేరింది. చుక్క నీరు దొరక్క వందల సంఖ్యలో పశుపక్ష్యాదులు గొంతెండి చనిపోయాయి. 4,331 పల్లెలు, 9,470 శివారుల్లో తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. మొత్తం 5,493 ట్యాంకర్లతో నిత్యం నీటిని సరఫరా చేస్తున్నా... వారి దాహార్తిని పూర్తిగా తీర్చలేని పరిస్థితి! ‘నీళ్ల ట్యాంకర్‌ నుంచి బిందెడు నీళ్లు దొరికితే చాలు. ఈరోజుకి బతికేయొచ్చు’ అన్నదే అందరి ఆలోచన. ట్యాంకరు వచ్చీ రాగానే వాగ్వాదాలు. కొట్లాటలు. కండబలం ఉన్నవారికే నీళ్లు! ఒక్కోసారి మాటామాటా పెరిగి ఒకే కుటుంబానికి చెందినవారి మధ్య కూడా విభేదాలు తలెత్తుతున్నాయి.

వేసవి మండిపోయింది. చెరువులు, నదులను పీల్చేసింది. ఇప్పుడు వానాకాలం. నల్లటి మబ్బులతో ఆకాశం ఆశలు రేపుతోంది. ఎప్పుడెప్పుడు వానలు పడతాయా అని ఏరోజుకారోజు ఎదురుచూపులే తప్ప... ఎండిన చెరువులు నిండే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు! రెండేళ్లుగా ఇదే తంతు. ఈ ఏడాది కూడా నిండుగా వర్షాలు కురిసే సూచనలు కనిపించకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది.

సాగునీటి సంగతి దేవుడెరుగు! కనీసం తాగునీటిని కూడా పూర్తిగా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది దేశంలో. నదులు, జలాశయాల నుంచి ఒక్కో చుక్కను ఒడిసిపట్టి తాగునీటి సమస్యను తీర్చేందుకు కర్ణాటక పడుతున్న అగచాట్లు ఇన్నీఅన్నీ కావు. ప్రమాద ఘంటికలను పసిగట్టిన ఆ రాష్ట్ర ప్రభుత్వం... బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు నిలిపేయాలని యోచిస్తోంది. తమిళనాడులో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ‘ఆఫీసులో నీళ్లు లేవు. ఇంటి నుంచే పనిచేయండి’ అని చెన్నైలో పలు సంస్థలు తమ ఉద్యోగులకు చెబుతున్నాయి. ఈ సమస్య కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు సహా... దేశవ్యాప్తంగా సుమారు 255 జిల్లాల ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. ఈ ఏడాదైనా వరుణ దేవుడు కరుణించకపోతే... భారత్‌కు కష్టకాలమే. సాగుకు సెలవు తప్పకపోవచ్చు! ఆర్థికంగానూ దేశానికి నష్టం తప్పకపోవచ్చు!

‘జల్‌శక్తి’ ఎంతవరకూ అభయమిస్తుందో...
దేశాన్ని నీటి కొరత నుంచి రక్షించడమెలాగన్నది ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. పార్లమెంటు కూడా నీటి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల రాజ్యసభలో జరిగిన చర్చలో జల సంరక్షణకు సంబంధించి అధికార, విపక్ష సభ్యులు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని 255 జిల్లాలను కరవు కోరల నుంచి రక్షించేందుకు కేంద్రం సీనియర్‌ అధికారులను రంగంలోకి దించింది. ‘జల్‌శక్తి అభియాన్‌’ కింద జలసంరక్షణ చర్యలు చేపట్టి, నీటిని సమర్థంగా వాడుకునేందుకు ఉన్నతాధికారులు, భూగర్భ జలనిపుణులు, ఇంజినీర్లతో బృందాలను ఏర్పాటుచేస్తోంది. ఈ పథకం ద్వారా దేశాన్ని కరవు నుంచి రక్షించి, 2024 నాటికల్లా ప్రతి ఇంటికి పైపుల ద్వారా తాగునీటిని అందించాలని యోచిస్తోంది.

‘‘మనకు నీళ్లున్నాయి కదా అన్న ధీమా పనికిరాదు. భవిష్యత్తులో నీటి కొరత అందరి సమస్యగా మారే ప్రమాదముంది. ప్రతి నీటి బొట్టునూ జాగ్రత్తగా వాడుకుంటే ఎంతోమందికి తాగునీరు మిగిల్చినవాళ్లమవుతాం. జల సంరక్షణ అందరి బాధ్యత’’ అని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.

255 దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న జిల్లాల సంఖ్య

అందుకే ఈ దుస్థితి...

గత 50 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం 24% తక్కువగా వానలు కురుస్తున్నట్టు వాతావరణ విభాగం తెలిపింది. దీనికి తోడు కొన్నేళ్లుగా వానల రాక  ఆలస్యమవుతోంది. సీజన్‌ అంతా కలిపినా సాధారణ వర్షపాతం నమోదు కావట్లేదు.
* వానలు ఆలస్యమవడంతో విత్తులు వేయడమూ జాప్యమవుతోంది. ఆ తర్వాతైనా సరైన వర్షాలు ఉండటం లేదు. దీంతో అన్నదాతల పెట్టుబడులు వృథా అవుతున్నాయి. కొన్నిసార్లు సీజన్‌ మొత్తం పంటలు లేకుండా పోతున్నాయి.

* దేశ స్థూల జాతీయోత్పత్తిలో 15% వాటా వ్యవసాయానిదే. కరవు పరిస్థితులు మారకపోతే సాగు రంగం కుదేలవుతుంది. ఫలితంగా నిరంతర ధరల పెరుగుదల సామాన్యులను పీడిస్తుంది. కొనుగోలుశక్తి తగ్గి, పోషకాహార లేమితో పేదలు వ్యాధులతో కుదలయ్యే ముప్పుంది.

* భూగర్భ జలాలను నిత్యం తోడుకోవడం తప్పితే, వాటిని మళ్లీ అదేస్థాయిలో నింపే దారి లేకపోతోంది. ఫలితంగా ఏటికేడు జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. చాలా పట్టణ ప్రాంతాల్లో వందలాది అడుగులు కిందకు వెళ్లినా చుక్క నీరు కనిపించని పరిస్థితి నెలకొంది!

2000-01లో దేశ వ్యాప్తంగా జలవనరుల సంఖ్య 5,56,601
2006-07 నాటికి మిగిలినవి 5,23,816
ప్రస్తుతం వీటిలో నిరుపయోగంగా మారినవి 80,128 (15%)
పనికిరాకుండా పోయిన జలవనరుల్లో అత్యధికంగా కర్ణాటకలోవి 51%, రాజస్థాన్‌లో 40%, ఆంధ్రప్రదేశ్‌వి 32%, తమిళనాడులో 30%, ఉత్తరాఖండ్‌వి 29%, గుజరాత్‌కు సంబంధించి 23% ఉన్నాయి.

హైదరాబాద్‌లోనూ నీటికి కటకట

కూకట్‌పల్లి సమీపంలోని ఓ కాలనీలో నీళ్లు లేవు. దీంతో ఇళ్ల దగ్గర ఫంక్షన్లు వద్దంటూ చాలా అపార్టుమెంట్లవారు నిర్ణయించుకున్నారు! హైదరాబాద్‌తో పాటు దిల్లీ, బెంగళూరు, చెన్నై తదితర 21 ప్రధాన నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు జీరో స్థాయికి చేరుకుంటాయని నీతి ఆయోగ్‌ విడుదలచేసిన ‘కాంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌-2018’ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా కనీసం 10 కోట్ల మందికి తాగునీటి తిప్పలు తప్పవని హెచ్చరించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న నీటితో పోలిస్తే డిమాండ్‌ రెండింతలు అధికంగా ఉంటుందట!

- ఈనాడు ప్రత్యేక విభాగం.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.