Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

జల గణ మన

ప్రారంభమైన జలశక్తి అభియాన్‌ 
నీటి ఎద్దడిపై ప్రచారోద్యమాన్ని చేపట్టిన కేంద్రం 
దేశవ్యాప్తంగా రెండు దశల్లో అమలు 
ఏపీలో 9, తెలంగాణలో 24 జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు 
ఈనాడు - దిల్లీ

దేశంలో నానాటికీ తరిగిపోతున్న జల వనరులను సంరక్షించుకొని, వాన నీటిని ఒడిసి పట్టుకొనేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు జలశక్తి అభియాన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నీటి పొదుపు, సంరక్షణ, పునర్వినియోగాలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని నీటికి ఇబ్బందిపడుతున్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో రెండు దశల్లో నిర్వహించదలచిన ప్రచార ఉద్యమాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సోమవారం ప్రారంభించారు. కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. తొలి దశ కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 24 జిల్లాలు, 137 బ్లాకులను ఇందుకు ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌ (9 జిల్లాలు, 64 బ్లాకులు), తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చెరి రెండో దశలోకి వస్తాయి. అన్ని వర్గాల ప్రజలను మమేకం చేయనున్నారు. 

దేశవ్యాప్తంగా జలసంరక్షణ కార్యక్రమాలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు అన్ని శాఖలను రంగంలోకి దించుతోంది. అలాగే ప్రజలందరి భాగస్వామ్యాన్నీ కోరుకుంటోంది. ప్రధాన మంత్రి ముఖ్య సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్‌ జల సంరక్షణకు సంబంధించిన సాంకేతిక సహకారం అందిస్తారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాస్త్రసాంకేతిక శాఖలు, విభాగాలను ఒకచోటికి తెచ్చి జల సంరక్షణ కోసం ఏ సాంకేతిక పరిజ్ఞానం అత్యుత్తమంగా ఉపయోగపడుతుందో మదించి దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ప్రచారోద్యమాన్ని పర్యవేక్షించి విజయవంతం చేసే బాధ్యతలను 256 మంది కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులకు అప్పగించారు. వీరు ఒక్కొక్కరు ఒక్కో జిల్లా బాధ్యతలను పర్యవేక్షిస్తారు. వీరికి తోడు 447 మంది ఉపకార్యదర్శులు, డైరెక్టర్లు పాల్గొంటారు. కేంద్ర భూగర్భ జల మండలి, కేంద్ర జల మండలితో పాటు కేంద్ర ప్రభుత్వంలోని జలవనరులకు సంబంధించిన ఇతర విభాగాలకు చెందిన 447 మంది సాంకేతిక అధికారులు కూడా భాగస్వాములవుతారు. ప్రతి రాష్ట్రంలో అక్కడి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఒక్కో బ్లాకుకు ఇద్దరు అధికారులను బాధ్యులుగా నియమిస్తారు. 

ప్రజలందరికీ భాగస్వామ్యం 
ప్రజా ఉద్యమంలో స్వచ్ఛంద సంస్థలు, నెహ్రూయువకేంద్రాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, పాఠశాల విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులను ఇందులో భాగస్వాములను చేస్తారు. ఇది సాంకేతికతో ముడిపడి ఉన్నందున జిల్లా స్థాయిలో ఇంజినీరింగ్‌ విద్యార్థులనూ ఆహ్వానిస్తారు. కేంద్రంలోని ప్రతి శాఖ జులై 1 నుంచి సెప్టెంబరు 15లోపు ఏదో ఒక రోజును ఎంచుకొని ఆ రోజు
పూర్తిస్థాయిలో జల సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రజలంతా జలశక్తి అభియాన్‌లో పాల్గొని శ్రమదానం చేయాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో తాము చేసిన నీటిసంరక్షణ పనులకు సంబంధించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసి ఇతరులకు స్ఫూర్తినివ్వాలని కోరారు. దేశంలో ఏటా వర్షం రూపంలో లభ్యమయ్యే 420 శతకోటి ఘనపు మీటర్ల నీటిలోంచి 8శాతానికి మించి ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు. అందుకే దీన్ని జనచేతన ఉద్యమంగా మలచి ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణ గురించి చర్చించేలా, ఆలోచించేలా చేయడానికి ఈ బృహత్తర ప్రచారోద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. దేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పటికే జలసంరక్షణ కార్యక్రమాలు చేపట్టాయని, అందులో నీరు-చెట్టు ఒకటని పేర్కొన్నారు. ఇవన్నీ ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చినట్లు చెప్పారు. ఉపాధి హామీ పథకంలో 65% నిధుల్ని సహజవనరుల సంరక్షణ కోసమే ఉపయోగిస్తారని, ఈసారి అందులో అత్యధిక మొత్తం జలసంరక్షణ కోసం వినియోగించాలని తెలిపారు. 
ఏం చేస్తారంటే... 
జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నీటిసంరక్షణ ప్రణాళిక రూపొందిస్తారు. రైతులు తక్కువ నీటితో ఎక్కువ పంటలు సాగుచేసే దిశగా ప్రోత్సహించడానికి ప్రతి జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్ర మేళాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా రైతులు సంప్రదాయ సాగునీటి విధానం నుంచి బిందు, తుంపర సేద్యంవైపు మళ్లేలా ప్రోత్సహిస్తారు.
పట్టణాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థ జలాల పునర్వినియోగంపై దృష్టి సారిస్తారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన నోడల్‌ అధికారులు స్థానిక సంస్థలతో సమావేశమై వ్యర్థనీటి పునర్వినియోగానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి నిర్దిష్ట గడువులోగా అమల్లోకి తెస్తారు. ఈ నీటిని పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం మళ్లిస్తారు. వంటశాలలు, మరుగుదొడ్ల నుంచి వెలువడే గ్రే, బ్లాక్‌వాటర్‌ను వేరువేరు మార్గాల ద్వారా వదిలిపెట్టే విధంగా ఇప్పుడున్న చట్టాల్లో మార్పులు తీసుకొస్తారు. ఈ రెండింటికీ ప్రత్యేక గొట్టపు మార్గాలు ఏర్పాటు చేస్తే మరుగుదొడ్డి నీటి కంటే వంట గది నుంచి వచ్చే నీటిని శుద్ధిచేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అన్ని చోట్లా ఈ విధానాలను తీసుకొచ్చేలా ప్రోత్సహిస్తారు. 
పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు కోసం ప్రతి పట్టణంలో కనీసం ఒక జలవనరును అభివృద్ధి చేయడమో, లేదంటే ఇప్పుడున్న వాటిని మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావడమో చేస్తారు. ఈ కార్యక్రమాన్ని సాంకేతికంగా విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు, ఐఐటీయన్లను భాగస్వాములను చేస్తారు. 
అంతిమంగా గ్రామాల్లో నీరుపారే పల్లపు ప్రాంతాలను గుర్తించేలా త్రీడీ మ్యాపులు అభివృద్ధి చేసి అక్కడ నీటి సంరక్షణ నిర్మాణాలు చేపడతారు.  ఇందులో కేంద్ర జలశక్తి, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణ, అటవీ, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖలు భాగస్వాములవుతాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.