close

ప్ర‌త్యేక క‌థ‌నం

పోలీసులూ.. మౌనమేల!

 మహిళా అధికారి హాహాకారాలు  చేస్తున్నా పట్టని సిబ్బంది
అడ్డగోలుగా దాడి చేస్తున్నా  అడ్డుకోలేని దైన్యం
 కాగజ్‌నగర్‌ ఘటనలో  పోలీసు పాత్రపై విమర్శలు
 బదిలీలు, పోస్టింగుల్లో  నేతల పాత్ర వల్లనేనని ఆరోపణలు
ఈనాడు - హైదరాబాద్‌

చేతిలో లాఠీలు, భుజాలకు ఆయుధాలు ఉన్నాయి. కళ్లెదుటే ఆందోళనకారులు అటవీశాఖ అధికారులపై దాడులకు తెగబడుతున్నా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించ లేదు. దెబ్బలకు తాళలేక మహిళా సిబ్బంది హాహాకారాలు పెడుతున్నా వారు ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. హక్కుల కోసం ఎలుగెత్తే ఆందోళనకారులపై ఎడాపెడా లాఠీలు ఝుళిపించే వాళ్లు మహిళా అధికారి, ఇతర సిబ్బందిపై దాడికి దిగిన వారిని కనీసం చెదరగొట్టడానికీ ముందుకు రాలేదు. దాడి దృశ్యాలు, అక్కడ పోలీసులు పోషించిన పాత్ర తదితరాలు సామాజిక మాద్యమాల్లో ప్రసారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిలా ప్రవర్తించారన్నదీ చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ, సీఐలపై సస్పెన్షన్‌ వేటు పడినా, అక్కడ పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరుపై లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
చట్టవిరుద్ధమైన పనులు ఏమి జరిగినా అడ్డుకోవడం, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం పోలీసుల ప్రాథమిక విధి. తమను తాము రక్షించుకునేందుకు, అవసరమైతే సామాన్యులకు రక్షణ కల్పించేందుకే ప్రభుత్వం వారికి లాఠీలు సహా ఆయుధాలు ఇచ్చింది. కాగజ్‌నగర్‌ మండలం కొత్త సార్సాల గ్రామంలో ఆదివారం జరిగిన ఘటనలో మాత్రం వారు వాటిలో ఏదీ ఉపయోగించలేదు. ‘‘పోడు వ్యవసాయాన్ని ఆపేందుకు అక్కడికి వెళ్లిన అటవీశాఖ సిబ్బంది రక్షణగా పోలీసులనూ వెంట తీసుకెళ్లారు. ఒకవేళ అనూహ్య పరిణామాలు తలెత్తితే అడ్డుకుంటారని, పరిస్థితి అదుపులోకి తెస్తారని ఊహించాం. అందుకు భిన్నంగా వారు వ్యవహరించడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాగైతే స్మగ్లింగ్‌, కలప అక్రమ రవాణా వంటివి అడ్డుకోవడం ఎలా సాధ్యం’’ అని అటవీశాఖ ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు.

 ఎటు చూసినా వైఫల్యమే
గత కొంతకాలంగా పోడు వ్యవసాయంపై అక్కడ సమస్య రగులుతూనే ఉంది. ఈ స్థాయిలో కాకపోయినా స్థానికుల నుంచి వ్యతిరేకత ఉంటుందనే విషయం అందరికీ తెలుసు. పోలీసు సిబ్బంది తమ నిఘా వ్యవస్థ ద్వారా పరిస్థితిని అంచనా వేసి ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడమో? ప్రజలతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడమో జరిగేది. ఈ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. పోనీ ముందుగా అంచనా వేయలేకపోయారనుకుందాం. స్థానికులు అటవీశాఖ సిబ్బందిపై దాడులకు దిగిన వెంటనే లాఠీఛార్జి మొదలుపెట్టి ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదు. అదీ జరగలేదు.

 ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కూడానా?
దురుసు ప్రవర్తన కారణంగా పోలీసుశాఖ పరువు పోతుందనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ పేరుతో ప్రయోగాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలతో దురుసుగా ప్రవర్తించవద్దని, స్టేషన్‌కు వచ్చిన వారితో స్నేహపూర్వకంగా మెలగాలనేది దీని సిద్ధాంతం. ఆందోళనలు వంటివి జరిగినప్పుడు కూడా సాధ్యమైనంత వరకూ సామరస్యంగానే ఉండాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. దీని వల్ల కూడా పోలీసులు సంయమనం పాటిస్తున్నారనే విమర్శలున్నాయి. ‘‘ఒకవేళ లాఠీ ఝుళిపిస్తే ఎవరో ఒకరు దాన్ని సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో ప్రసారం చేస్తున్నారు. దాని ఆధారంగా అధికారులు తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు’’ అని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు.
ఏదేమైనా బదిలీలలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా నివారించాలని, నిజాయతీ ఆధారంగానే పోస్టింగులు ఇచ్చినప్పుడే ఇలాంటి సమస్యలు తలెత్తవని నిపుణులు సూచిస్తున్నారు.

రాజకీయ ప్రమేయమే కారణమా?
పోలీసుశాఖ బదిలీలలో రాజకీయ ప్రమేయం ఉందనేది కాదనలేని వాస్తవం. స్థానిక ప్రజాప్రతినిధులు లేఖలు ఇచ్చిన వారికే పోస్టింగులు ఇచ్చే సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతోందనేది నిష్ఠుర సత్యం. అలా ప్రజాప్రతినిధుల సిఫార్సుతో వస్తున్న పోలీసులు వారికి అనుకూలంగానే వ్యవహరించడం సహజం. కాగజ్‌నగర్‌ ఉదంతంలో సస్పెండయిన ఓ పోలీసు అధికారి స్థానిక శాసన సభ్యునితో సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలున్నాయి. ఆ శాసనసభ్యుడి తమ్ముడే స్వయంగా రంగంలోకి దిగి వీరంగం వేయడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారనే విమర్శ వినిపిస్తోంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.