Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

బరువు తగ్గే మార్గంలో... ‘యాప్‌’సోపాలు!

  మన అలవాట్లకు తగ్గట్టు సూచనలివ్వని అప్లికేషన్లు
  అత్యధిక డౌన్‌లోడ్స్‌, స్టార్‌ రేటింగ్స్‌ ఉన్నా పనితీరు అంతంతే...
  జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనంలో వెల్లడి
ఈనాడు - హైదరాబాద్‌

జీవనశైలి అస్తవ్యస్తం. భోజనానికీ వేళాపాళా ఉండదు. పైగా తినేది జంక్‌ఫుడ్‌! ఫలితంగా చాలామంది అధిక బరువు, స్థూలకాయంతో సతమతమవుతున్నారు. బరువు తగ్గేందుకు కొందరు సెల్‌ఫోన్లలో యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, అవి ఇచ్చే సూచనలను పాటిస్తున్నారు. కానీ... వీటిలో చాలామటుకు మన దేశ ప్రజల ఆహార అలవాట్లకు తగ్గట్టు లేవని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు గుర్తించారు. 2016-17లో ప్లేస్టోర్‌ నుంచి అత్యధిక డౌన్‌లోడ్స్‌, స్టార్‌ రేటింగ్స్‌ వచ్చిన 20 ‘కేలరీ కౌంటింగ్‌ యాప్స్‌’పై ఆ సంస్థ శాస్త్రవేత్త డాక్టర్‌ సుబ్బారావు ఎం.గవరవరపు నేతృత్వంలోని బృందం అధ్యయనం చేసింది. హెల్త్‌ ఇన్‌ఫర్మటిక్స్‌ పత్రిక ఈ వివరాలను ప్రచురించినట్టు ఎన్‌ఐఎన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

అధ్యయనం ఇలా...
మొత్తం 20 అప్లికేషన్ల పనితీరును శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. వాటిలోని సమాచారం, శాస్త్రీయత, విషయ నైపుణ్యం, సాంకేతిక సలహాలు సజావుగా ఉన్నాయా?లేదా? అన్నది పరిగణనలోకి తీసుకున్నారు. ఏడు అప్లికేషన్లు నిర్దేశిత ప్రమాణాలకు దారిదాపుల్లో ఉండగా... మిగతావి కనీస ప్రమాణాలు లేనివి. బరువు తగ్గేందుకు ఉద్దేశించిన యాప్స్‌ శాస్త్రీయ సమాచారాన్ని ఇవ్వట్లేదనీ, ముఖ్యంగా భారతీయుల ఆహారపు అలవాట్లకు తగినట్టు అవి లేవని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఒక్కో యాప్‌ ఒక్కోలా సూచనలివ్వడంతో వేటిని పాటించాలన్న గందరగోళం కూడా నెలకొందన్నారు. ‘‘163 సెం.మీ. ఎత్తు, 66 కిలోల బరువు ఉన్న 22 ఏళ్ల యువతి... వారానికి 500 గ్రాముల బరువు తగ్గాలనుకుంది. కానీ ఇరవై అప్లికేషన్లు రకరకాల సూచనలిస్తూ నిత్యం 1,191 నుంచి 1,955 కిలో కేలరీల ఆహారాన్ని తగ్గించాలని సూచించాయి’’ అని డా.సుబ్బారావు వెల్లడించారు.

ఆరోగ్యకర సమాచారమేదీ?
చాలా యాప్స్‌ ఆరోగ్యకరంగా బరువు తగ్గే అంశాలను సూచించడం లేదు. పండ్లు, కాయగూరలు... కొవ్వులేని, పీచు పదార్థాలను అధికంగా తినాలని చెప్పడం లేదని అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 40% అప్లికేషన్లు మాత్రమే ఇలాంటి సూచనలిస్తున్నాయి. భారతీయులు తినే సాధారణ భోజనంలో ఎన్ని కేలరీలు ఉంటాయన్న సమాచారం కూడా వాటిలో లభ్యం కావడం లేదు. కేవలం అధిక డౌన్‌లోడ్స్‌, స్టార్‌ రేటింగ్‌ ఆధారంగా మాత్రమే యాప్స్‌ను వినియోగించడం మంచిదికాదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

‘న్యూట్రిఫై ఇండియా నౌ’తో పరిష్కారం...
భారతీయ ఆహార అలవాట్లకు అనుగుణంగా కేలరీలను కరిగించుకునేందుకు వీలుగా ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో ‘న్యూట్రిఫై ఇండియా నౌ’ యాప్‌లో సూచనలిస్తున్నట్టు ఎన్‌ఐఎన్‌ సంచాలకురాలు ఆర్‌.హేమలత చెప్పారు. స్థానికంగా లభ్యమయ్యే ఆహారం, వంటకాలు, పోషకాల విలువ ఆధారంగా దీన్ని రూపొందించినట్టు వివరించారు. ప్రయోగ దశలో ఉన్న ఈ అప్లికేషన్‌ పనితీరును మెరుగుపరుస్తున్నట్టు పేర్కొన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.