Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

అడవెంత.. ఆక్రమణెంత?

రికార్డులు సరిగా లేక వివాదాలు
అటవీశాఖలో ఒకలా.. రెవెన్యూలో మరోలా
భూదస్త్రాల ప్రక్షాళనలో 48 లక్షల ఎకరాల పరిశీలన
7.5 లక్షల ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తింపు
18 లక్షల ఎకరాల విషయంలో గందరగోళం
కొన్ని జిల్లాల్లో అటవీ భూములకు సర్వే నంబర్లు సైతం లేక ఇబ్బంది
దస్త్రాల పరిశీలన పూర్తిచేయాలంటున్న అటవీశాఖ
ఈనాడు - హైదరాబాద్‌

అటవీ అధికారులపై వరసగా జరుగుతున్న దాడులు అలజడి సృష్టిస్తున్నాయి. అటవీ భూముల విషయంలో లెక్కలు పక్కాగా లేకపోవడమే ఈ వివాదాలకు, ఘర్షణలకు కారణంగా కనిపిస్తోంది. దీర్ఘకాలంగా సాగులో ఉన్నామని రైతులు.. ఈమధ్యే ఆక్రమించారంటూ అటవీ అధికారులు.. ఇలా ఎవరివాదన వారిదే. అడవుల సంరక్షణ కోసం కొన్నిచోట్ల అటవీప్రాంతం చుట్టూ అధికారులు కందకాలు తవ్విస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అడవి మధ్యలో పట్టా భూములు ఉండటం.. రైతులు ఆ పత్రాలు చూపి అటవీ అధికారుల్ని నిలదీస్తుండటం మరో పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి వివాదాల నేపథ్యంలో అటవీ భూములకు సంబంధించిన లెక్కలను పూర్తిస్థాయిలో పక్కాగా తేల్చాలని అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌కుమార్‌ ఝా మంగళవారం సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావును కలిశారు. తెలంగాణవ్యాప్తంగా అటవీశాఖకు ఉన్న భూములు.. వాటిలో ఎంతమేర ఆ శాఖ పరిధిలో ఉన్నాయి.. ఆక్రమణలు, వివాదాల గురించి వివరించినట్లు తెలిసింది. మొత్తం 66 లక్షల ఎకరాలకు గాను.. 18 లక్షల ఎకరాల అటవీ భూములకు సంబంధించిన దస్త్రాల ప్రక్షాళన జరగలేదని.. ఆ ప్రక్రియ సత్వరం పూర్తయ్యేలా రెవెన్యూశాఖను ఆదేశించాలని కోరినట్లు తెలిసింది. మిగిలిన అటవీ భూముల లెక్కలు తేల్చాలని సీఎం కార్యాలయం రెవెన్యూశాఖ ఉన్నతాధికారి ఒకరికి సూచించినట్లు సమాచారం.

మొక్కలతో చిక్కులు
హరితహారంలో భాగంగా అటవీశాఖ తన భూముల్లో ముఖ్యంగా క్షీణించిన అడవుల్లో మొక్కలను పెంచుతోంది. ఆక్రమణలకు గురైనవి, గతంలో ఆక్రమణకు ప్రయత్నం చేసిన భూములను కాపాడుకునేందుకు అక్కడ మొక్కలు నాటుతున్నామని అధికారులు చెబుతున్నారు. ఆ ప్రాంతాల్లో తాము చాలాకాలంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూములపై రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ వివాదానికి రాజకీయ నాయకులు తోడవడంతో వివాదాలు, ఘర్షణలు తలెత్తుతున్నాయి.

అటవీ శాఖ ఏమంటోంది?
అటవీహక్కుల చట్టం కింద అర్హులకు అప్పట్లోనే పట్టాలు ఇచ్చారని.. 2005 తర్వాత ఆక్రమణలు జరిగిన అటవీ భూములనే తాము స్వాధీనం చేసుకుంటున్నామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వాటిలోనూ దశాబ్దకాలం క్రితం ఆక్రమించి పోడుచేస్తున్న వారి జోలికి వెళ్లడం లేదని.. నాలుగేళ్లక్రితం నుంచి జరుగుతున్న ఆక్రమణలపైనే దృష్టిపెట్టామని వారు అంటున్నారు.

ఆరు లక్షల ఎకరాల మాటేంటి
రెవెన్యూశాఖ చేసిన భూదస్త్రాల పరిశీలనలో 6 లక్షల ఎకరాలు వివాదంగా ఉన్నాయి. సర్వే నంబర్లు లేకపోవడం.. ఆక్రమణలకు గురికావడం, కొన్నిచోట్ల పట్టాలు ఇవ్వడం వంటి అంశాలున్నాయి. ‘‘మిగిలిన 18 లక్షల ఎకరాల దస్త్రాలను పరిశీలించాలి. మొత్తం అటవీ భూములపై స్పష్టత రావాలి. ఆ తర్వాత వివాదాస్పదంగా ఉన్న భూములు, ఆక్రమణలకు గురైనవాటి విషయంలో ఏంచేయాలో స్పష్టత వస్తుంది’’ అని అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అటవీ భూములు తరచూ వివాదం అవుతుండటంతో.. అటవీ ప్రాంతాల హద్దులు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదే ఆదేశించింది. రెవెన్యూ, అటవీ, భూకొలతలు, భూదస్త్రాల నిర్వహణ శాఖలు సమావేశమై.. భూదస్త్రాల ప్రక్షాళన చేపట్టాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తిగా కాకుండా మూడింట రెండొంతులే జరిగింది.

సర్వే నంబర్లే లేవు
అటవీ భూములుగా ప్రకటించినవాటిలో లక్షల ఎకరాలకు సర్వే నంబర్లు కూడా లేవు. ఇది ఓ సమస్యగా మారిందని అటవీశాఖవర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఇవి 15 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. అందులో 75-80 శాతం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మహబూబూబాద్‌, భూపాలపల్లి జిల్లాల్లో ఉన్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అడవి మధ్యలో పట్టాలు ఇచ్చిన భూముల అంశాన్ని ఇటీవల తనను కలిసిన అటవీ అధికారులతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. సాంకేతిక తప్పిదమో, మరో కారణమో.. రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. లబ్ధిదారులైన రైతులను ఇబ్బంది పెట్టవద్దని అటవీశాఖ అధికారులకు స్పష్టం చేయడం.. అటవీభూముల విషయంలో క్షేత్రస్థాయిలో జరిగిన లోపాలకు ఓ నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

7.35 లక్షల ఎకరాల ఆక్రమణ!
అటు దస్త్రాల పరిశీలన, ఇటు క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అటవీ భూములు పెద్దసంఖ్యలో ఆక్రమణల్లో ఉన్నాయని అటవీశాఖ చెబుతోంది. వీటితో పాటు అటవీహక్కుల చట్టం కింద ఇచ్చిన భూములు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 7.35 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణలో ఉందని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద గిరిజనులకు ఇచ్చినవి మరో 3 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.