close

ప్ర‌త్యేక క‌థ‌నం

కదలరు.. వదలరు

దశాబ్దాలుగా హైదరాబాద్‌ సహా జిల్లా కేంద్రాల్లోనే మకాం
పైరవీలతో పోస్టింగులు..
పెద్దలకు అనుయాయులుగా మారి సెటిల్మెంట్లు
సీసీఎల్‌ఏకు చేరిన ఉద్యోగుల జాబితా

* భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం తహసీల్దార్ల నియామకం, తదనంతర కాలంలో పోస్టింగ్‌ల సమాచారాన్ని కలెక్టర్ల నుంచి తెప్పించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో 25 నుంచి 35 మంది వరకు ఒకే చోట ఎక్కువసార్లు పోస్టింగ్‌లు పొందారని, పక్కపక్క మండలాలకు బదిలీలు అవుతూ కాలం గడిపారని గుర్తించింది. వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోనూ 20 మంది వరకు ఇదే వరుసలో ఉన్నారు.
* ఇతర జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏదో ఒక స్థానంలో పాతుకుపోవడం, మధ్యలో ఒకటి రెండు సంవత్సరాలు ఇతర ప్రాంతాల్లో పనిచేసి తిరిగి అదే చోట పోస్టింగ్‌లు వేయించుకున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు లెక్క తేల్చింది.

ఈనాడు - హైదరాబాద్‌

రూ.కోట్ల విలువైన భూములు..స్థిరాస్తి వ్యాపారం. ప్రముఖుల ఆస్తులు ఉన్న ఉమ్మడి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ శాఖకు చెందిన ఉద్యోగులు ఒకే చోట ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. ఏదో ఒక కారణంతో ఈ ప్రాంతాలకు బదిలీపై వచ్చిన డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, డిప్యూటీ కలెక్టర్లు కొందరు దశాబ్దాలుగా ఇక్కడే మకాం వేస్తున్నారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు చెందిన విలువైన భూములు ఇక్కడే ఉండటంతో వారికి అనుయాయులుగా మారడం, కొన్ని పార్టీలకు చెందిన నాయకుల పనులు చేసిపెడుతుండటం వారికి శ్రీరామరక్షగా మారుతోంది. ఇటీవల భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయం అన్ని జిల్లాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి తహసీల్దారు స్థాయి వరకు ఉద్యోగుల వివరాలను కలెక్టర్ల ద్వారా సేకరించగా ఈ విషయం వెలుగుచూసింది. ముఖ్యంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కదలకుండా ఏళ్లతరబడి పనిచేస్తున్న వారున్నట్టు తేల్చింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లలో పోస్టింగ్‌లు ఖరీదుగా మారాయి. ఇక్కడి పోస్టింగ్‌ దక్కాలంటే పెద్ద ఎత్తున పైరవీ తప్పదన్న ప్రచారం రెవెన్యూ ఉద్యోగుల్లో ఉంది. ఒకవేళ బదిలీలు జరిగినా పక్కపక్క మండలాలకు పోస్టింగ్‌లు వేయించుకోవడం, లేదంటే జిల్లా కేంద్రానికి ఏడాది కాలం పాటు వెళ్లి, తిరిగి అదే ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితులూ ఉన్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను పరిశీలిస్తే కొందరి సర్వీస్‌ అంతా ఈ రెండు జిల్లాల చుట్టూనే కనిపిస్తుండటం దానికి నిదర్శనమే. ఉమ్మడి ఎనిమిది జిల్లాల కలెక్టరేట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలాలు, స్థిరాస్తి భూం ఉన్న ప్రాంతాలు, ఇతరత్రా అభివృద్ధి చెందిన మండలాల్లో కొందరు దీర్ఘకాలంగా పనిచేస్తున్నారు.

ప్రక్షాళనతోనైనా మార్పు వచ్చేనా
ఆరో జోన్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన ఉద్యోగులు అధిక శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పనిచేసేందుకే మొగ్గుచూపుతున్నారు. కొందరు పిల్లల చదువులు, నగర జీవనానికి ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడే స్థిరపడుతున్నారు.

ఇతర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని ఆయా జిల్లాలకు వెళ్లి వస్తున్నారు. రాజధాని ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలంటూ రెవెన్యూ సంఘాలు ఉన్నతాధికారులకు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. సీఎం కేసీఆర్‌ రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సీసీఎల్‌ఏ అలాంటి వారి వివరాలను సేకరించింది. త్వరలో వారికి బదిలీలు తప్పవని సీసీఎల్‌ఏ వర్గాలు పేర్కొంటుండగా..ఇదంతా తమకు మామూలేనని, మళ్లీ పరిస్థితి తమకు అనుకూలంగానే మారుతుందని కొందరు అధికారులు ధీమాతో ఉన్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.