Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

కొత్త ప్రాజెక్టులు వచ్చేనా?

ఈ ఏడాదిలో పెద్దగా ప్రతిపాదనలే వెళ్లని దుస్థితి
బడ్జెట్‌కు ముందు ఎంపీలతో సమావేశం నిర్వహించని ద.మ. రైల్వే
నూతన రైళ్ల ప్రకటనపైనా సందిగ్ధత
రేపే కేంద్ర బడ్జెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నూతన ప్రాజెక్టులు, కొత్త రైళ్ల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. ఏడాదిలో ఉభయ రాష్ట్రాల నుంచి చెప్పుకోతగ్గ స్థాయిలో నిర్ధిష్ట ప్రతిపాదనలేవీ కేంద్రానికి చేరకపోవడం, పార్లమెంట్‌ సభ్యులతో సమావేశం నిర్వహించి వారు ఏం కోరుకుంటున్నారో రైల్వే శాఖకు నివేదించకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బీబీనగర్‌ (పగిడిపల్లి)-నల్లపాడు రెండోలైను, రాయగిరి-కాజీపేట మూడోలైను వంటి సర్వేలు పూర్తయిన ప్రాజెక్టుల నివేదికలను రైల్వేబోర్డుకు పంపడం మినహా..అటు జోన్‌ సొంతంగా కానీ, ఇటు ఎంపీల ద్వారా కానీ కొత్త ప్రాజెక్టులు, రైళ్ల గురించి ప్రతిపాదనలు తీసుకుని పంపించలేదని సమాచారం. ఈ పరిస్థితుల ప్రకారం బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తనకు తోచినట్లు చేసే కేటాయింపులు తప్ప.. పోరాడి సాధించినవేవీ ఉండవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2019-20 పూర్తిస్థాయి బడ్జెట్‌ శుక్రవారం(జులై 5న) రాబోతోంది. తాత్కాలిక బడ్జెట్‌కు ముందు అప్పటి ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మూడొంతుల మందికిపైగా కొత్త ఎంపీలు వచ్చారు. సమావేశం పెట్టి తమ నుంచి ప్రతిపాదనలు తీసుకోలేదని కొందరు ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ద.మ. రైల్వేకు రూ.5,924 కోట్లు కేటాయించింది. ఒక్క కొత్త ప్రాజెక్టు ఊసు కూడా లేదు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్‌లో అయినా కొత్త ప్రాజెక్టుల ప్రస్తావన ఉండాలని నిపుణులు, ప్రయాణికులు కోరుతున్నారు.

కేటాయింపులకు ఏది ప్రాతిపదిక కాబోతోందో?
ఆరు డివిజన్లతో ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను విభజిస్తూ మూడు డివిజన్లతో విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. మరి కేటాయింపులు ఎలా ఉంటాయి? ద.మ. రైల్వేగా చూస్తారా? కొత్తగా ఏర్పడే జోన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యాలు ఉంటాయా? అని అంతా ఎదురుచూస్తున్నారు.

కొత్త రైళ్ల ప్రధాన డిమాండ్లు ఇవే..
* కరీంనగర్‌ నుంచి ముంబయికి.. తిరుపతికి వెళ్లే రైలు రోజువారీ. హైదరాబాద్‌కు నేరుగా రైలు సదుపాయం.
* సికింద్రాబాద్‌ నుంచి దిల్లీ, విశాఖపట్నం మధ్య రద్దీకి తగ్గట్లు రైళ్ల సంఖ్య పెంపు.
* తిరుపతి-అయోధ్యను కలుపుతూ కొత్త రైలు.
* సికింద్రాబాద్‌-కాన్పూర్‌, గుంటూరు-గువాహటి.
* విశాఖపట్నం-అజ్మీర్‌.
* కర్నూలు, కడప నుంచి విజయవాడకు.
* సికింద్రాబాద్‌-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.
* గూడ్సు రైళ్లు తిరుగుతున్న మోటమర్రి-విష్ణుపురం సెక్షన్‌లో ప్రయాణికుల రైళ్లు.
* తెలంగాణలో కాజీపేట, ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల బాలాజీ డివిజన్ల ఏర్పాటు.
* విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ ఏర్పడ్డాక కూడా వాల్తేర్‌ పేరుతో డివిజన్‌ కొనసాగింపు.

కొత్త ప్రాజెక్టుల మంజూరుపై డిమాండ్లలో కొన్ని..
* ఏపీ రాజధాని అమరావతి అనుసంధాన రైలు ప్రాజెక్టును పట్టాలు ఎక్కించడం.
* సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు మూడో లైను మార్గం.
* విజయవాడ నుంచి విశాఖపట్నంకు మూడో లైను.
* సికింద్రాబాద్‌-శ్రీశైలం రోడ్డు.
* ఆదిలాబాద్‌-ఆర్మూర్‌ వయా నిర్మల్‌.

అధిక నిధులు కేటాయించాల్సిన ప్రాజెక్టుల్లో కొన్ని..
* మనోహరాబాద్‌-కొత్తపల్లి కొత్త లైను.
* ఉందానగర్‌-మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌.
* నడికుడి-శ్రీకాళహస్తి కొత్త లైను.
* గూడూరు-విజయవాడ మూడో లైను.
* గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్‌.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.