Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రైవేటు మార్గంలో రైలు

పీపీపీ విధానానికి అగ్రతాంబూలం 
ఏడాదికి 10,000 కిలోమీటర్ల పనులు 
వ్యయం రూ.2.07 లక్షల కోట్లు 
12 ఏళ్లలో మౌలికానికి రూ.50 లక్షల కోట్లు అవసరం 

రైల్వే ప్రతిపాదనలు సమర్పించిన ఆర్థిక మంత్రి 
ఆదాయం రూ.2.16 లక్షల కోట్లు, కేంద్రం నుంచి భారీ మద్దతు 

ఈనాడు, దిల్లీ: రైల్వేలో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు అవసరం కానున్న దృష్ట్యా ప్రభుత్వ-ప్రైవేటు-భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిని పెద్దఎత్తున వినియోగించుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వేగవంతమైన అభివృద్ధికి, ప్రయాణికుల సేవల్ని మెరుగుపరిచేలా అనుసంధానత సాధించడానికి ఇది అవసరమని చెప్పారు. పన్నెండేళ్ల కాలంలో రూ.50 లక్షల కోట్లు కావాల్సి వస్తుందని అంచనావేశారు. శుక్రవారం కేంద్ర బడ్జెట్లో భాగంగా రైల్వే సంబంధిత ప్రతిపాదనలను ఆమె పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్రం తరఫున బడ్జెట్‌ సాయం కింద రైల్వేకు రూ.65,837 కోట్లు ఇస్తామని, మునుపెన్నడూ లేనంతగా మూలధన వ్యయం రూ.1.60 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్పారు. గత ఏడాది బడ్జెట్‌ మద్దతు కింద రూ.55,088 కోట్లు, మూలధన వ్యయంగా రూ.1.48 లక్షల కోట్లు చూపించారు. ప్రయాణికుల సదుపాయాలకు కేటాయింపులు గత ఏడాది కంటే 200% పెంచి, రూ.3422 కోట్లు ఇచ్చారు. ప్రత్యేక ప్రయోజక వాహక సంస్థ (ఎస్పీవీ)ల ద్వారా సబర్బన్‌ రైల్వేల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తామని, పీపీపీ విధానంలో మెట్రో రైలు వ్యవస్థను పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. రోలింగ్‌స్టాక్‌ తయారీకి ప్రైవేటు పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించాలని నిర్ణయించామన్నారు. ఆ వివరాలు .. 

సిబ్బందికి నైపుణ్య శిక్షణ: రైల్వేలోని 13 లక్షలమంది ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ప్రయాణికులతో ఎలా మెలగాలి, ఖర్చులెలా తగ్గించుకోవాలి, పని సంస్కృతి మెరుగు... ఈ మూడు అంశాల్లో శిక్షణ ఉంటుంది. దీనిలో రాణించినవారికి తదుపరి దశ శిక్షణకు పంపిస్తారు. 
భద్రతకు ప్రాధాన్యం 
భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత సురక్షితమైన సంవత్సరంగా 2018-19 నిలిచిపోనుంది. కాపలాదారుల్లేని లెవెల్‌ క్రాసింగుల తొలగింపు, బ్రాడ్‌గేజ్‌ మార్పిడి పనుల్ని ఆ ఏడాదిలో లక్ష్యం మేరకు పూర్తిచేశారు. 
స్వర్ణ చతుర్భుజి మార్గంలోని 2,568 రైల్వే క్రాసింగ్‌లపై వంతెనలు నిర్మించి వాహనాల రాకపోకలకు అడ్డంకుల్లేకుండా చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. దేశంలో 50-60% రైళ్ల రాకపోకలు ఈ మార్గంలోనే జరుగుతాయి. కాబట్టి వాటికి ఇబ్బందులు తొలగించడం వల్ల మొత్తంమీద రవాణా వేగవంతమవుతుంది.

ఇది అందరి బడ్జెట్‌

‘ఇది పేదలు, ధనికులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహా 130 కోట్ల మంది భారతీయుల బడ్జెట్‌.పని సంస్కృతిని ప్రోత్సహించి, అవకాశాలు కల్పించేదిగా ఉంది. సరకు రవాణాలో రైల్వే వాటా పెరుగుతుంది. మెరుగైన సదుపాయాల వల్ల ప్రయాణికులూ రైళ్ల వైపు మొగ్గుతారు.’

- పీయూష్‌ గోయల్‌, రైల్వే మంత్రి

2022కు విద్యుదీకరణ 2021-22కల్లా

మొత్తం బ్రాడ్‌గేజ్‌ వ్యవస్థ విద్యుదీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఈ ఒక్క సంవత్సరమే 7వేల కిలోమీటర్లు పూర్తిచేస్తారు. 
2019-20లో కొత్తలైన్లు, గేజ్‌ మార్పిడి, అదనపు మార్గాలకు కలిపి 3,750 కిలోమీటర్ల లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 
దిల్లీ-మేరఠ్‌ మధ్య నిర్మించిన ‘శీఘ్ర ప్రాంతీయ రవాణా వ్యవస్థ’ తరహాలో సబర్బన్‌ రైళ్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఎస్పీవీలను ఏర్పాటు చేయనున్నారు. 
నిర్భయ నిధి రూపంలో రూ.267.64 కోట్లు, అంతర్గత వనరుల ద్వారా రూ.10,500 కోట్లు సమకూర్చుకుంటారు.

అన్ని స్టేషన్లు, రైళ్లలో సీసీటీవీ నిఘా 

ప్రయాణికుల భద్రత కోసం అన్ని స్టేషన్లు, రైళ్లలో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  
ఇప్పటివరకూ 455 స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు.  
2020-21కల్లా మిగిలిన అన్ని స్టేషన్లలో ఈ ఏర్పాటుచేస్తారు.  
1,203 కోచ్‌లలో ఉన్న సీసీ టీవీలను 2021-22 నాటికి అన్ని కోచ్‌లకూ అందుబాటులోకి తెస్తారు.

ప్రయాణికులకు సౌకర్యాల పెంపు

ప్రయాణికులకు ఆహ్లాద వాతావరణాన్ని కల్పించడానికి రూ.3422.57 కోట్లతో పెద్దఎత్తున రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపడతారు.  
2023 నాటికి ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైళ్ల ప్రాజెక్టును పూర్తిచేయనున్నారు. 
దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్‌ ట్రైన్‌-18 (వందేభారత్‌) రైళ్లను ప్రవేశపెడతారు. 
ఇప్పటివరకు 1,603 రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించారు. ఆగస్టు 31 నాటికి హాల్ట్‌ స్టేషన్లలో మినహాయించి మిగతా 4,882 స్టేషన్లలో దీనిని కల్పిస్తారు. 
ఆర్థికంగా లాభదాయకమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తానంటే ఎందుకు వద్దనాలి? కోల్‌ఇండియా వంటి సంస్థలు బొగ్గు గనుల నుంచి సరకు రవాణా చేయడానికి రైల్వే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? వాళ్లే ఆ పెట్టుబడి పెట్టుకోవాలి. ఇలాంటి అవకాశాలపై దృష్టి సారించాలి. మెట్రో రైలు పెట్టెల తయారీలో పెట్టుబడి పెడతాం.

- నిర్మలా సీతారామన్‌, ఆర్థిక మంత్రి

‘కాయకవే కైలాస’ అన్నది బసవేశ్వరుడి బోధ! అందుకే మా ప్రభుత్వం ‘కాయక, దశోహ’ సిద్ధాంతాలను అనుసరిస్తూ.. కోటి మంది యువతకు పీఎం కౌశల్‌ వికాస్‌ యోజన కింద పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలలో శిక్షణ ఇస్తున్నాం.

భారీ లక్ష్యం

2019-20 ఆదాయం రూ.2.16 లక్షల కోట్లు, వ్యయం రూ.2.07 లక్షల కోట్లు. 
కొత్తలైన్లు, గేజ్‌ మార్పిడి, జంట మార్గాల నిర్మాణం (డబ్లింగ్‌), విద్యుదీకరణ వంటి పనులు: 10వేల కి.మీ.  
23,000 రైలు పెట్టెలు/ సరకు రవాణా వ్యాగన్ల (రోలింగ్‌ స్టాక్‌ను) కొనుగోలు.  
డీజిల్‌ ఇంజిన్లు కొనుగోలు చేయరు. 
సరకు రవాణా: 127.4 కోట్ల టన్నులు.  
ప్రయాణికుల సంఖ్య: 859.3 కోట్లు 
మూలధన వ్యయం: 1,60,175.64 కోట్లు  
బడ్జెటేతర మార్గంలో నిధుల సమీకరణ: ‘భారతీయ రైల్వే ఆర్థిక సంస్థ’ నుంచి రూ.29,031 కోట్లు, పీపీపీ ద్వారా రూ.28,100 కోట్లు

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.