Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

మహా సంక్లిష్టం.. ఈ చంద్ర యాత్ర!

మానవ మేధస్సుకు పట్టం కట్టే మహోజ్జ్వల ఘట్టానికి తెర లేస్తోంది!
ఒకప్పుడు రాత్రయిందంటే చాలు.. సుదూర తీరంలో ఊరిస్తూ, ఉడికిస్తుండే చందమామ గురించి ఏవేవో కథలు చెప్పుకోవçమే తప్పించి అసలక్కడికి ఓ బుజ్జి యంత్రాన్ని పంపించి బోలెడంత సమాచారం సేకరించొచ్చన్నది ఊహించటమే కష్టం. ఇప్పుడీ కలలను నిజం చేయబోతోంది మన ఇస్రో! నిజానికి ఇస్రో ఈ నెల 14 అర్ధరాత్రి దాటాక ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభమవుతున్న చంద్రయాన్‌-2 యంత్ర యాత్ర... అంతరిక్ష చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కష్టసాధ్యమైన ప్రయోగమని చెప్పుకోక తప్పదు! ఎందుకో చూద్దాం!!!

భూమి నుంచి అంతరిక్షంలోకి దూసుకుపోయి చంద్రుడి మీద దిగే వరకూ.. చంద్రయాన్‌-2లో చాలా దశలూ, అంచెలూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 3 కీలక విభాగాలున్నాయి.
1. మనం పంపించే రాకెట్‌ నుంచి విడివడి.. చంద్రుడి వరకూ వెళ్లి.. అక్కడ కక్ష్యలోనే తిరుగుతుండే ఆర్బిటర్‌ 
2. ఆ ఆర్బిటర్‌ నుంచి విడిపోయి జాబిల్లి మీద మృదువుగా దిగే ల్యాండర్‌.. ‘విక్రమ్‌’ 
3. ఆ ల్యాండర్‌ నుంచి నిదానంగా దొర్లుకుంటూ బయటకొచ్చి.. చిన్నచిన్న చక్రాలేసుకుని చంద్రుడి నేలపై కలియ తిరిగే రోవర్‌.. ‘ప్రగ్యాన్‌’. ఈ మూడింటినీ కలిపి ‘కాంపోజిట్‌ మాడ్యూల్‌’ అంటారు. ఇలా వేర్వేరు దశల్లో, వేర్వేరు పనులు చేస్తుండే మూడింటిని కలిపి ఏకకాలంలో.. ఒకే వ్యోమనౌక కింద ప్రయోగిస్తుండటం వల్లే ఈ ప్రయోగం అత్యంత సంక్లిష్టంగా మారింది.


నేల నుంచి జాబిల్లిని చేరేదిలా..

జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌-2 శ్రీహరికోట నుంచి పయనమవుతుంది. ఈ రాకెట్‌ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో తిరుగుతూ 170 కి.మీ.× 20,000 కి.మీ. దీర్ఘవృత్తాకార భూకక్ష్యను చేరిన తర్వాత.. అక్కడ  చంద్రయాన్‌-2 మాడ్యూల్‌ను కక్ష్యలోకి వదిలేస్తుంది.

ఇక అక్కడి నుంచి చంద్రయాన్‌-2 మాడ్యూల్లో ఉంచిన చిన్నచిన్న రాకెట్ల ద్వారా దాని కక్ష్యను శాస్త్రవేత్తలు దశలవారీగా పెంచుతారు. ప్రతి దశలోనూ కక్ష్యను మరింత దీర్ఘవృత్తాకారంగా పెంచుకుంటూ పోతారు. ఇలా 16 రోజుల పాటు ఈ వ్యోమనౌక భూమి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.

కక్ష్యలో ఆశించిన ఎత్తుకు చేరాక ఈ వ్యోమనౌక భూమి కక్ష్య నుంచి మెల్లగా చంద్రుడి దిశగా మళ్లుతుంది. దీనికి సుమారు 5 రోజులు పడుతుంది.

ఇప్పుడు మరోసారి రాకెట్‌ను మండించి.. దాన్ని చంద్రుడి కక్ష్యలోకి చేరుస్తారు. అప్పటికి ఇది భూమి నుంచి బయల్దేరి 20-21 రోజులవుతుంది.

ఇక అక్కడి నుంచి కక్ష్యలో క్రమంగా కిందకి దిగుతూ మెల్లగా జాబిల్లి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తులో నిలకడగా తిరగటం మొదలుపెడుతుంది. ఈ స్థితికి చేరుకోటానికి మరో 27 రోజులు పడుతుంది. దీంతో ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయే ఘట్టానికి రంగం సిద్ధమైనట్లే.

కక్ష్యలో స్థిరంగా తిరుగుతున్న ఈ దశలో.. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయేలా ఇస్రో ఆదేశాలు పంపుతుంది. దీంతో ల్యాండర్‌ చంద్రుడికి మరింత దగ్గరగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఆర్బిటర్‌ మాత్రం వంద కి.మీ. ఎత్తులో అలా చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది.

మెల్లగా ల్యాండర్‌ చంద్రుడి వైపు పయనించటం మొదలుపెడుతుంది. ఇలా చంద్రుడి ఉపరితలానికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నాక... ఈ ప్రయోగం మొత్తంలోనే అత్యంత కీలక దశ ఆరంభమవుతుంది. ఈ దశలో వేగాన్ని తగ్గించే రాకెట్లు మండుతాయి. చంద్రుడిపై గాలి ఉండదు కాబట్టి.. కక్ష్య నుంచి శరవేగంతో దూసుకొచ్చే ల్యాండర్‌ను ఆపటానికి పారాచూట్లు సైతం ఉపయోగపడవు. అందుకే ఈ ప్రత్యేక రాకెట్లు! ఈ దశల్లో భూమి నుంచి మనం దాన్ని నియంత్రించలేం. పూర్తిగా తన సొంత బుర్రతోనే ల్యాండర్‌ నిర్ణయాలు తీసుకోవటం మొదలుపెడుతుంది.

ఉపరితలానికి చేరువయ్యాక.. క్రమేపీ ల్యాండర్‌ తన వేగాన్ని గంటకు 3.6 కిమీ కన్నా తక్కువకు తగ్గించుకుంటుంది. కొంతసేపు దాదాపు నిశ్చల స్థితిలో ఉంటూ అక్కడి నేలను స్కాన్‌ చేయటం మొదలుపెడుతుంది. తాను ఎక్కడ దిగితే మంచిదో అన్వేషణ ఆరంభిస్తుంది. తనకు అమర్చిన కెమేరాల సాయంతో కింద రాళ్లురప్పల్లాంటి అవరోధాలేమీ లేకుండా, సూర్యకాంతి బాగుండే ప్రాంతాన్ని చూసుకుని.. అక్కడ దిగుతుంది. ల్యాండర్‌ క్షేమంగా చంద్రుడిపై కాలు మోపిన తర్వాత.. ఇక రోవర్‌ కథ మొదలవుతుంది.

ల్యాండర్‌ ఉంచి జారుడుబల్ల లాంటి ఒక ర్యాంప్‌ తెరుచుకుంటుంది. అందులోంచి ఆరు చక్రాల బుజ్జి రోవర్‌ మెల్లగా జారుకుంటూ కిందకు దిగుతుంది. అలా వస్తున్నప్పుడే దానికి ఉన్న సౌర ఫలకం విచ్చుకుంటుంది. సెప్టెంబర్‌ 6 లేదా 7 తేదీల్లో జరిగే ఈ ప్రక్రియ అంతా... ఓ 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది! అక్కడి నుంచీ గట్టి బుర్ర గల రోవర్‌ యంత్రం... చంద్రుడిపై 14 రోజుల పాటు తిరుగాడుతూనే... రకరకాల సమాచార సేకరణలో నిమగ్నమవుతుంది!

15 నిమిషాలు..అత్యంత కీలకం!

ల్యాండింగ్‌ ప్రక్రియలో జాబిల్లికి 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి విక్రమ్‌ కిందకి దిగే దశ అత్యంత కీలకమైంది. ఇది 15 నిమిషాల పాటు సాగుతుంది. భూమి మీద నుంచి మనం పంపే సంకేతం జాబిల్లిని చేరుకోవడానికి దాదాపు 15 నిమిషాలు పట్టడం వల్ల ఈ ల్యాండింగ్‌లో ఈ దశను ఇక్కడి నుంచి శాస్త్రవేత్తలు నియంత్రించడం అసాధ్యం. అందువల్ల ల్యాండర్‌కే సొంత మేధస్సును ఏర్పాటు చేశారు. అదే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ క్షేమంగా కిందకు దిగుతుంది. చివరి 15 నిమిషాల పాటు ఇస్రో శాస్త్రవేత్తలు కూడా మౌనంగా నిరీక్షించడం మినహా చేసేదేమీ ఉండదు.

మొన్న ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు పంపిన బెరెషీట్‌ వ్యోమనౌక చంద్రుడిపై దిగే క్రమంలో కూలిపోయింది. అందులో ల్యాండింగ్‌ ప్రక్రియను ఇంజినీర్లే నియంత్రించటానికి ప్రయత్నించారు. కానీ దానికి భూకేంద్రం సంకేతాలు అందడంలో  జాప్యం జరగటంతో అది విఫలమై, కూలిపోయింది.  చంద్రయాన్‌-2కు ఈ ఇబ్బంది ఉండదు!

చంద్ర కక్ష్యలోకి వెళ్లే ఆర్బిటర్‌

ర్బిటర్‌ చంద్రుడి చుట్టూ కక్ష్యలోనే తిరుగుతూ అక్కడి నుంచే ఫొటోలు, డేటాను సేకరించి భూమికి పంపుతుంది. చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేసి, అనేక చిత్రాలను, మ్యాప్‌లను అందిస్తుంది. ఇది ఒక రకంగా మునుపటి చంద్రయాన్‌-1 తరహాలోనిదే కాబట్టి దీని రూపకల్పనలో ఇస్రోకు పెద్దగా ఇబ్బందులేం ఎదురుకాలేదు.

జాబిల్లి మీద దిగే ల్యాండర్‌

పిరమిడ్‌ ఆకారంలో ఉండే ల్యాండర్‌ను చంద్రుడిపై ఒక రోజు (అంటే మన భూమిపై 14 రోజులన్న మాట) పనిచేసేలా రూపొందించారు. ఇస్రో రూపొందించిన అత్యంత సంక్లిష్ట సాధనాల్లో ఇదొకటి. నాలుగు కాళ్లు ఉండే ఈ యంత్రానికి చంద్రుడిపై మృదువుగా దిగే సామర్థ్యం ఉంది. ల్యాండింగ్‌కు సంబంధించిన ఆల్గోరిథమ్‌ను భారత్‌ పరిశోధకులే రూపొందించారు. దీనిలోని విశిష్ట సెన్సర్లు, సాఫ్ట్‌వేర్‌.. దీనికి స్వీయ మేధస్సును తెచ్చిపెట్టాయి.

చంద్రుడిపై సాఫీగా దిగడం కోసం ఇందులో ప్రత్యేకంగా మండే రాకెట్లను (థ్రాటల్‌ ఏబుల్‌ ఇంజిన్లను) ఇస్రోనే అభివృద్ధి చేసింది. ఇవి అవసరం మేరకే మండుతూ ల్యాండర్‌ వేగాన్ని తగ్గిస్తూ.. దాని కదలికలను నియంత్రిస్తాయి. కింద పరిస్థితులను చూసుకుంటూ సాఫీగా దిగేందుకు ఇందులోని ప్రత్యేక నేవిగేషన్‌, గైడెన్స్‌, కంట్రోల్‌ (ఎన్‌జీసీ) సెన్సర్లూ ఉపకరిస్తాయి.

చంద్రుడి మీద దిగే రోవర్‌

ల్యాండర్‌ నుంచి బయటకొచ్చి.. చంద్రుడిపై తిరిగే ప్రగ్యాన్‌ రోవర్‌.. కొంత ఇస్రో పంపే ఆదేశాలకు అనుగుణంగా, కొంత సొంత బుర్రతో పనిచేస్తుంది. ఇది  బ్రీఫ్‌ కేస్‌ అంతే ఉంటుంది. చంద్రుడి నేలను దగ్గరగా పరిశీలించి, ఆ డేటా భూమికి పంపుతుంది. కదలిక కోసం ఈ యంత్రంలో అల్యూమినియంతో తయారైన ఆరు ప్రత్యేక చక్రాలు అమర్చారు. ఏ దారిలో వెళ్లాలో తేల్చుకునేందుకు దీనిలో నేవిగేషన్‌ కెమెరా, ఇన్‌క్లైనోమీటర్‌ ఉన్నాయి. చంద్రుడి నేలలో కూరుకుపోకుండా నడిచేలా దీని చక్రాలను విడివిడి మోటార్లతో రూపొందించారు. మలుపు తిరగడానికి, ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవి ‘స్కిడ్‌-స్టీరింగ్‌’ సూత్రాన్ని అనుసరిస్తాయి. ఈ రోవర్‌ సెకనుకు 1-2 సెంటీ మీటర్ల దూరమే ప్రయాణిస్తుంది. ఉపరితలాన్ని శోధించి, అక్కడ నీరు, ఇతర రసాయనాలను గుర్తించడంలో సాయపడుతుంది. ఇది 15 రకాల పరీక్షలను అక్కడికక్కడే చేస్తుంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.