close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఒకటి తర్వాత... రెండెందుకు?

చంద్రయాన్‌-1 ఓ సంచలనం. భారత అంతరిక్ష చరిత్రలో పెద్ద ముందడుగు!

వినువీధిలో భారత్‌ సత్తా చాటేందుకు మన ‘మిస్సైల్‌ మ్యాన్‌’.. అబ్దుల్‌ కలాం కన్న కల అది. భారత్‌కు చంద్రుడి మీదకు వెళ్లేంత సత్తా ఉందా? అని యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా చూస్తున్న ఘడియల్లో.. మన ఇస్రో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ సరిగ్గా 11 ఏళ్ల క్రితం చంద్రయానాన్ని నిజం చేసి చరిత్ర సృష్టించింది. దాదాపు దశాబ్దం తర్వాత ఇప్పుడు మళ్లీ రెండో చంద్రమండల యాత్రకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-1 సాధించిందేమిటి? మళ్లీ ఇప్పుడు చంద్రయాన్‌-2 ఎందుకు? మొదటి యాత్రకూ, తాజా ప్రయత్నానికీ ఏమిటి తేడా? వంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు పైకొస్తున్నాయి!


 

చంద్రయాన్‌-1

కక్ష్యకే పరిమితం
గతంలో పంపిన చంద్రయాన్‌-1 ప్రధానంగా చంద్రుడి చుట్టూ ఓ కక్ష్యలో తిరుగుతూ.. చంద్రుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, భూమికి పంపింది. కాకపోతే చంద్రుడిపై భారత ముద్ర ఉండాలన్న ఉద్దేశంతో ఓ 35 కేజీల పరిశోధక ‘మూన్‌ ఇంపాక్ట్‌ ప్రోబ్‌’ను (ఎంఐపీ) చంద్రుడి మీదికి జారవిడిచింది. అది  విసిరేసినట్లుగా వెళ్లి చంద్రుడిని బలంగా ఢీ కొట్టింది. జాబిల్లి ఉపరితలాన్ని తాకి బద్దలయ్యేలోగా కొన్ని పరిశోధనలు చేసి, సమాచారం పంపింది.

సాధించిందేమిటి?
* చంద్రుడి ఉపరితలం మీద నీరు, ఐస్‌ ఉందని గుర్తించడం చంద్రయాన్‌-1 సాధించిన సంచలన విజయం! అంతరిక్ష ప్రయోగాల దిశ, దశ మార్చిన ఆవిష్కారం ఇది. చంద్రుడి మీద నీరు.. మనం రోజువారీ చూసే నీటి రూపం (హెచ్‌2ఓ)లో కాకుండా హైడ్రాక్సైల్‌ అయాన్ల (ఓహెచ్‌) రూపంలో ఉందని ఇది గుర్తించింది.
* చంద్రయాన్‌-1లో అమెరికా, ఐరోపా, బల్గేరియాలు కూడా తమతమ సొంత పరిశోధనల కోసం ఆరు పరికరాలను పంపాయి. నీటి ఆనవాళ్లను ముందుగా అమెరికా సాధనం ‘మూన్‌ మినరాలజీ మ్యాపర్‌’ పట్టుకుంది, అందుకే నీటి ఉనికి గురించి ముందు ‘నాసా’ ప్రకటించింది. ఆ తర్వాత ఇస్రో కూడా దాన్ని నిర్ధారించింది.
* భూకంపాల తరహాలోనే చంద్రకంపాలు కూడా వస్తున్నాయని, చంద్రుడి ఎగువ ఫలకాల్లో కదలికలు సంభవిస్తున్నాయని (టెక్టానిక్‌ యాక్టివిటీ) గుర్తించింది. అలాగే చంద్రుడిలో శాశ్వతంగా చీకటిలోనే ఉండిపోయే అనేక బిలాలను తొలిసారిగా ఫోటోలు తీసి పంపింది.  చంద్రుడి ఉపరితల ‘హై రిజల్యూషన్‌ మ్యాప్‌’ను సిద్ధం చేసింది.

చంద్రయాన్‌-1 చంద్రుడి చుట్టూ దాదాపు 3 వేల సార్లు పరిభ్రమించి 70,000 ఫొటోలను పంపింది.

అర్ధంతరంగా ముగిసింది!

రెండేళ్లు పని చేసేలా రూపొందించినా చంద్రయాన్‌-1 ప్రస్థానం 10 నెలలకే ముగిసింది. ప్రయోగించిన కొద్దినెల్లకే వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మొదట్లోనే విద్యుత్‌ వ్యవస్థ విఫలమైంది. ఇస్రో ఇంజినీర్లు శ్రమించి, దాన్ని అధిగమించారు. 2009 జనవరిలో వ్యోమనౌకలోని ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయి. దాంతో వేడి పెరిగిపోయింది. మెల్లగా దానిలోని ‘స్టార్‌ సెన్సర్‌’ విఫలమై, అది గాడి తప్పింది, 2009 ఆగస్టు 29న దాంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికే అది తన లక్ష్యాల్లో 90% వరకూ పూర్తి చేయటంతో శాస్త్రవేత్తలు దాన్ని చాలావరకూ విజయంగానే పరిగణించారు. తర్వాత 2016లో ఒకసారి అది చంద్రుడి చుట్టూ ఒక దిశానిర్దేశం లేకుండా తిరుగుతూ నాసా రాడార్ల కంటపడింది.

బుల్లి సాధనం వల్లే..

మొదట్లో చంద్రుడి కక్ష్యలోని ఉష్ణం వల్లే చంద్రయాన్‌-1 కథ అర్ధంతరంగా ముగిసిందని భావించినా.. తర్వాత చేసిన పరిశోధనల్లో అమెరికా నుంచి దిగుమతి చేసుకుని, దానిలో వాడిన చిన్న ‘డిసి-డిసి కన్వర్టర్‌’ వల్లే అది విఫలమైందని వెల్లడైంది. 5వేల డాలర్లతో కొన్న ఆ కన్వర్టర్‌ బరువు కేవలం 110 గ్రాములు. అంత చిన్న పరికరం మొత్తం వ్యోమనౌకే విఫలమయ్యేలా చేయటం చూసి.. ‘‘ఇది ఒక చీమ.. ఏనుగును చంపడం లాంటిదన్నమాట’’ అని ఇస్రో ఇంజినీర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. అందుకే ఈ పరికరాన్ని ఇప్పుడు మరింత సమర్థంగా దేశీయంగానే రూపొందించి చంద్రయాన్‌-2లో వాడుతున్నారు. గతంలో మంగళ్‌యాన్‌లో కూడా దీన్ని వాడగా, అది ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తోంది!

 

చంద్రయాన్‌-2
ఏమిటి తేడా?

వాస్తవానికి చంద్రయాన్‌-2కు మూలాలన్నీ చంద్రయాన్‌-1లోనే ఉన్నాయి. కాకపోతే దానికి ఇది పెద్ద కొనసాగింపు. చంద్రయాన్‌-1 చంద్రుడి కక్ష్యలోనే తిరిగితే.. చంద్రయాన్‌-2 చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరగటమే కాదు.. సున్నితంగా చంద్రుడి మీద దిగుతుంది కూడా. చంద్రయాన్‌-1 అనుభవాలను పునాదిగా చేసుకుని ఇస్రో దీన్ని మరింత పకడ్బందీగా తీర్చిదిద్దుతోంది.

ఇవీ తేడాలు
* ఢీకొట్టటం కాదు.. నిదానంగా దిగటం: చంద్రయాన్‌-1లోని ఎంఐపీ.. విసిరేసినట్టుగా చంద్రుడిని ఢీ కొట్టి బద్దలైపోగా.. చంద్రయాన్‌-2లోని ల్యాండర్‌ మాత్రం తన రాకెట్లతో వేగాన్ని నియంత్రించుకుంటూ చాలా నిదానంగా చంద్రుడి మీద దిగుతుంది. దానిలో నుంచి రోవర్‌ బయటకొచ్చి చంద్రుడి మీద ఆ ప్రాంతమంతా కలియదిరుగుతుంది కూడా. ఒక రకంగా చంద్రుడిని ఢీకొట్టటంతో మొదటిదాని ప్రస్థానం ముగిసిపోగా.. చంద్రుడి మీద దిగటంతోనే చంద్రయాన్‌-2 ప్రస్థానం మొదలవుతుందని చెప్పుకోవచ్చు.
* అపూర్వ సమాచారం: చంద్రయాన్‌-2లో ఎంతో సూక్ష్మంగా, అత్యంత సమర్థంగా పని చేసే ఎన్నో పరికరాలు అమర్చారు. వీటితో అపూర్వ సమాచారం మనకు అందబోతోంది.  చంద్రయాన్‌-1లోని మొత్తం 11 పరికరాల్లో 5 మాత్రమే మనవి. కానీ చంద్రయాన్‌-2లోని మొత్తం 14 ఉపకరణాల్లో 13 మనవే. కేవలం లేజర్‌ రిట్రో రిఫ్లెక్టోమీటర్‌ అర్రే (ఎల్‌ఆర్‌ఏ) అనే ఒక్క పరికరాన్నే అమెరికా నుంచి తీసుకున్నారు. ఇదేమంత కీలక పరికరం కాదు.
* చంద్రయాన్‌-1 గుర్తించిన చంద్రుడి మీది నీటి (హైడ్రాక్సైల్‌ అయాన్ల) తీరు తెన్నులను చంద్రయాన్‌-2 మరింత లోతుగా పరిశోధిస్తుంది. ఇందుకోసం దీనిలో ఖనిజాలు, నీటి అణువుల వంటివాటిని సవివరంగా గుర్తించే ఇమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌ (ఐఐఆర్‌ఎస్‌), సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి ఖనిజాలను మనం తవ్వితెచ్చుకునే వీలుందా? అన్నదీ తెలుస్తుంది. చంద్రుడికి సంబంధించిన త్రీడీ మ్యాప్‌లను రూపొందించేందుకు, జాబిల్లి పుట్టుక గురించి తెలుసుకునేందుకు అవసరమైన సమారాన్ని కూడా చంద్రయాన్‌-2 సేకరిస్తుంది. అంతిమంగా  భవిష్యత్తులో మనం అక్కడికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకునే వీలుందా? అన్న ప్రశ్నకు కొంతవరకైనా కచ్చితమైన జవాబును అందిస్తుంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.