Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

రామ్‌ప్రసాద్‌ హత్యకు రూ.కోటి సుపారీ

హత్య కేసులో 9 మందికి ప్రమేయం
అదుపులో ఆరుగురు, మరో ముగ్గురి కోసం వేట
సంఘటన స్థలానికి సమీపంలో కోగంటి సత్యం?
సీసీ టీవీ పుటేజీల్లో నిందితుల జాడలు
హత్య తర్వాత కొందరు పరారీ..  జనంలో కలిసిపోయిన శ్యామ్‌
కిరాయి ముఠాకు చెల్లింపులన్నీ శ్యామ్‌ చేతుల మీదుగానే
పోలీసుల దర్యాప్తులో వెలుగుచూస్తున్న నిజాలు

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపారి రామ్‌ప్రసాద్‌ను చంపేందుకు ప్రత్యర్థులు కిరాయి హంతకులకు రూ.కోటి ఇచ్చినట్టు పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఈ హత్య పథకం, ప్రణాళికలో మొత్తం తొమ్మిది మంది ప్రమేయం ఉందని కూడా గుర్తించారు. ఇందులో ఆరుగురు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా, మరో ముగ్గుర్ని పట్టుకునేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లు కూడా దొరికితే చంపిందెవరు? ఎందుకు చంపారు? అన్న అంశాలపై సాక్ష్యాధారాలు అభించే అవకాశాలు ఉండటంతో, ఆ తర్వాత అందర్నీ అధికారికంగా అరెస్ట్‌ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

చెల్లింపులన్నీ శ్యామ్‌ చేతుల మీదుగానే
రెండు నెలల క్రితమే హత్యకు ప్రణాళిక రచించిన సూత్రధారులు, పాత్రధారులు అప్పట్నుంచి హైదరాబాద్‌లో ఉన్నారని పోలీసులు తెలుసుకున్నారు. హంతకులకు బయానాలు, నగదు చెల్లింపులను కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్‌ చేసినట్టు ఆధారాలు సేకరించారు. రామ్‌ప్రసాద్‌పై దాడి జరిగిన రోజు(జూన్‌, 6) రాత్రి సంఘటన స్థలంలో ఎనిమిది మంది ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుసుకున్నారు. వీటి ఆధారంగా మరిన్ని సాక్ష్యాలను సేకరిస్తున్నారు.

సత్యానికి చెప్పిన తర్వాతే ప్రణాళిక అమలు
రామ్‌ప్రసాద్‌ను చంపేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నాక ఈ విషయాన్ని కోగంటి సత్యానికి వివరించానని పోలీసుల అదుపులో ఉన్న శ్యామ్‌ అంగీకరించినట్టు తెలిసింది. ‘‘రామ్‌ప్రసాద్‌ గృహ ప్రవేశ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అది పూర్తయ్యాక హత్య చేస్తాం. ఇందుకు మనవాళ్లు సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో మూడు చోట్ల అతడిని చంపేందుకు అనువైన స్థలాలున్నాయి’’ అని కోగంటి సత్యానికి చెప్పానని శ్యామ్‌ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. దీంతో అతన్ని ఎలా చంపుతారో దగ్గరుండి చూడాలని కోగంటి సత్యం భావించాడని, హత్య జరిగిన రోజు ఆయన సంఘటన స్థలానికి వచ్చాడని, హంతకులున్న స్థలానికి కొంత దూరంలో ఉన్నాడని’’ పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం.

డ్రైవర్‌ కేకలతో..ఎవరికి వారే పరార్‌
హత్య చేశాక వేగంగా పారిపోయేందుకు వీలుగా హంతకులు వాహనాన్ని తెచ్చుకున్నారు. దాడి తర్వాత అందరూ అందులో పారిపోవాలనుకున్నారు. ‘‘దాడి చేస్తుండగా రామ్‌ప్రసాద్‌ కారు డ్రైవర్‌ కేకలు వేయడం, స్థానికులు గుమిగూడటంతో వారి ప్రణాళిక ఫలించ లేదు. పోలీసులకు దొరక్కండా ఉండేందుకు ఎవరికి వారే వాహనం వైపు పరుగెత్తారు. జీప్‌ వేగంగా వెళ్లిపోవడంతో శ్యామ్‌ ఘటన స్థలానికి కొంత దూరంలో ఉండిపోయాడు. తర్వాత జనంలో కలిసిపోయి కొద్దిసేపు అక్కడే ఉన్నాడు. అనంతరం పంజాగుట్ట సర్కిల్‌ వరకూ నడుచుకుంటూ వెళ్లి ఆటోలో తాను బసచేసిన ప్రాంతానికి వెళ్లాడు’’ అని విచారణలో తేలినట్టు తెలిసింది. కోగంటి సత్యం మాత్రం కారు తీసుకురావాలంటూ తన స్నేహితుడిని పురమాయించి, అది వచ్చాక ఆ కారులో వెళ్లిపోయినట్టు, జీపులో పారిపోయిన హంతకులు పోలీసుల దృష్టి మళ్లించేందుకు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల వైపు వెళ్లి, తిరిగి పంజాగుట్టకు వచ్చి, తర్వాత గచ్చిబౌలి వైపు వెళ్లి అక్కడ జీప్‌ను వదిలేసి పారిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు.

బలమైన ఆధారాల కోసం ప్రయత్నం
హత్య కేసులో కోగంటి సత్యానికి ప్రమేయం ఉన్నట్టు బలమైన సాక్ష్యాధారాలు కొన్ని మాత్రమే లభించినట్టు తెలిసింది. ‘‘ప్రత్యర్థిని చంపాలన్న కోరికను ఆయన తమ వద్ద వ్యక్తం చేశాడు. ఆయన కోరిక తీర్చేందుకే తాము హత్య చేశాం’’ అంటూ శ్యామ్‌ పోలీసులకు చెబుతున్నా.. సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని సమాచారం. ‘‘కత్తులతో దాడి చేసిన వారందర్నీ గుర్తించాక, ఆయుధాలపై వారి వేలిముద్రలు సరిపోలిన తర్వాత నిందితులను నిర్ధారిస్తామని’’ ఓ పోలీస్‌ అధికారి ‘ఈనాడు’కు తెలిపారు. ‘‘చంపింది ఎవరన్నది తెలుసుకున్నాం. చంపించింది ఎవరో తేలితే అందర్నీ అరెస్టు చేస్తాం’’ అని ఆయన తెలిపారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.