close

ప్ర‌త్యేక క‌థ‌నం

మత్తు ఇస్తారు చిత్తు చేస్తారు

విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల విక్రయం.. యథేచ్ఛగా సైబర్‌ మోసాలు
అంతకంతకూ పెరుగుతున్న నైజీరియన్ల నేరాలు
దిల్లీ దాటాక దొరకని నిందితుల ఆచూకీ
విదేశీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీస్‌ విభాగాల మధ్య సమన్వయలోపమే కారణం

ఆఫ్రికా దేశాల్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొందరు యువతీయువకులు వారి మోసాలకు భారత్‌ను కేంద్రంగా చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భారత్‌లో ప్రజలు సులభంగా మోసపోతారన్న అంచనా... అంతర్జాల ఆధారిత మోసాలను గుర్తించలేరన్న ధీమా వారిది. అఫ్రికా దేశాల నుంచి తొలుత దిల్లీకి వచ్చి తర్వాత హైదరాబాద్‌ లాంటి మెట్రోనగరాలు, పట్టణాలకు చేరి నేరాలు చేస్తున్నారు. పర్యాటక, ఉన్నత విద్య, వ్యాపారం, వైద్య చికిత్సల పేరుతో వీరు వీసాలు తీసుకుని వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నైజీరియన్లే. కొంతమంది నిజాయితీగా ఆయా కార్యకలాపాలకే పరిమితమవుతున్నా.. నేరాలకు పాల్పడుతున్న వారివల్లే నైజీరియన్‌ ఎక్కడ కనిపించినా జనం అనుమానంగా చూసే పరిస్థితులు తలెత్తాయి. వారి నేరాలు బయటపడుతున్నా ఇప్పటిదాకా కట్టడిచేసే గట్టి చర్యల్లేవు. విదేశీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీస్‌ విభాగాల మధ్య సమన్వయ ప్రయత్నాలు ప్రారంభం కాలేదు. ఆఫ్రికా దేశాల నుంచి దిల్లీ వచ్చాక.. వారు ఎటు పోతున్నారో... ఎక్కడుంటున్నారో... ఏం చేస్తున్నారో తెలుసుకునే వ్యవస్థ లేకపోవడంతో వారికి నేరాలకు పాల్పడడం, మోసాలకు దిగడం మంచినీళ్లప్రాయంగా మారింది.


 

నైజీరియన్‌... నీవెక్కడ?
దిల్లీకి వచ్చాక గాయబ్‌...
ఎటు నుంచి ఎక్కడకెళ్తున్నారో కనిపెట్టలేని దైన్యం

హాయ్‌... నాపేరు విజయ్‌ మల్హోత్రా... లండన్‌లో ఐదు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నా... మా పూర్వీకులు భారత్‌లో ఉండేవారు... మా అమ్మా, నాన్నల కోరిక మేరకు భారతీయురాలిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా... నా వ్యాపార టర్నోవర్‌ ఏటా రూ.1,400కోట్లు... హిందూ సంప్రదాయం, కుటుంబ విలువలు పాటించే యువతులైతే చాలు... ఆసక్తి ఉన్నవారు నాతో మాట్లాడండి.
నా పేరు రాజగోపాల్‌. కరోల్‌బాగ్‌లో ఉంటున్నా. రెండు ప్రైవేటు స్కూళ్లకు యజమానిని. నెలరోజుల క్రితమే బీఎండబ్ల్యూ ఎక్స్‌ సిరీస్‌ కారు కొన్నా.  అమెరికాలో ఉంటున్న మా సోదరుడు అనారోగ్యంపాలయ్యాడు. అతడికి సేవలు చేసేందుకు ఏడాదిపాటు అక్కడే ఉండాలి. భార్యాపిల్లలతో వెళ్తున్నందున కారు అవసరం లేదు. రూ.90 లక్షల కారును రూ.48 లక్షలకే విక్రయిస్తున్నా. రవాణా ఛార్జీలు, బయానా నిమిత్తం రూ.5లక్షలు నా ఖాతాలో వేసి కారు తీసుకున్నాక మిగిలిన డబ్బు పంపండి.
గర్వాల్‌ సన్స్‌ నుంచి విజ్ఞప్తి... మా కంపెనీకి విలువైన వినియోగదారులున్నారు.. కొన్ని సాంకేతిక సమస్యలు, అంతర్గత విషయాలు, ఆడిట్‌ వ్యవహారాల కారణంగా మా బ్యాంక్‌ ఖాతాలను వేరే బ్యాంక్‌కు మారుస్తున్నాం. అంతర్జాల ఆధారిత చెల్లింపులు చేసినప్పుడు ఈ మార్పును గమనించండి. మీరు నగదు బదిలీ చేశాక మాకు మెయిల్‌ ద్వారా సమాచారం ఇవ్వండి.

...ఇవన్నీ మోసాలు చేసేందుకు నైజీరియన్లు వేసే ఎత్తుగడలు. మోసాలు... మాదకద్రవ్యాల వ్యాపారం చేయడమే లక్ష్యంగా పది, పదిహేనేళ్ల నుంచి భారత్‌కు వస్తున్నారు. అంతర్జాలంలో ప్రకటనలు ఇవ్వడం, ఆసక్తి ప్రదర్శించిన వారిని మాటలతో నమ్మించడం వారి నైజం. పెళ్లి చేసుకుంటామని, ఖరీదైన బంగారు, వజ్రాభరణాలు పంపించామని, ప్రేమకు గుర్తుగా వేల డాలర్ల పెట్టెను పంపుతున్నామని, రూ.కోట్లలో లాటరీ వచ్చిందంటూ వల విసురుతున్నారు. సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో నకిలీ పేర్లతో ఖాతాలను తెరుస్తున్నారు. యువకులైతే అందమైన యువతుల చిత్రాలను ఫేస్‌బుక్‌ ఖాతా ప్రొఫైల్‌గా ఉంచుతున్నారు. యువతులు, మహిళలైతే విదేశీ యువకుల ఫొటోలతో ఆకర్షిస్తున్నారు.

మళ్లీ మళ్లీ నేరాలు
పదిహేనేళ్ల క్రితం ఒకటి, రెండు నేరాలు నమోదుకాగా... రెండు, మూడేళ్ల నుంచి వారి నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టుకుని జైలుకు పంపుతున్నా... బెయిల్‌పై బయటకొచ్చి మళ్లీ, మళ్లీ నేరాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌, పుణె నగరాల్లో పదుల సంఖ్యలో ఇలాంటి నేరస్థులున్నారు. కంటికి కనిపించకుండా కేవలం ఫోన్‌లో మాట్లాడుతూ నేరాల పరంపరను కొనసాగిస్తున్నారు. రూ.కోట్లు కొల్లగొడుతున్నారు.

దిల్లీకి వచ్చి నమోదు చేసుకున్నాక...
దిల్లీకి వచ్చిన తర్వాత వీరు అక్కడి విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. తర్వాత వారికి ఇష్టమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. వీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అన్న వివరాలను తెలుసుకునే వ్యవస్థ లేకపోవడంతో వీసా గడువు ముగిసినా వారిని విదేశీ మంత్రిత్వ శాఖ కనిపెట్టలేకపోతోంది. పోలీసులు అరెస్ట్‌ చేసినప్పుడు మాత్రం నైజీరియన్లు నిందితులని బహిర్గతమవుతోంది. విదేశీ మంత్రిత్వశాఖ, వేర్వేరు రాష్ట్రాల పోలీసుల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 25 వేల మంది నైజీరియన్లున్నారు. వీరిలో 50శాతం మంది గోవా రాష్ట్రంలో, 30 శాతం మంది దిల్లీ ప్రాంతంలో నివాసముంటున్నారు. మిగిలిన 20 శాతం మంది ముంబయి, పుణె, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఉంటున్నారు. నిజంగా ఎంతమంది ఉన్నారన్న అధికారిక లెక్కలు విదేశీయుల ప్రాంతీయ నమోదు కేంద్రంలో లేవు.

సైబర్‌ నేరాలు.. రూ.కోట్లలో వసూలు
మాదక ద్రవ్యాలు తీసుకురావడం, వాటిని విక్రయించడం ద్వారా లాభం వచ్చినా శ్రమ ఎక్కువగా ఉంటోందనుకుంటున్న కొందరు.. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. పదేళ్ల క్రితం వారు డెబిట్‌ కార్డులను క్లోనింగ్‌ చేయడం, బ్యాంకుల పేరుతో ఫిషింగ్‌ మెయిళ్లను పంపడం వంటివి చేసి రూ.లక్షల్లో నగదు స్వాహా చేసేవారు. అనంతరం లాటరీలు, ఆయుర్వేద మందులు, విదేశీ పక్షుల అమ్మకాల వంటివాటితో మోసాలకు పాల్పడేవారు. నాలుగైదేళ్ల నుంచి ఎక్కువగా ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి చేసుకుంటామని, దాతృత్వ సంస్థల ద్వారా రుణాలిప్పిస్తామని, విదేశాల్లో వేల డాలర్ల కొలువులు ఇప్పిస్తామని, వారసులుగా నటిస్తే కోట్ల పౌండ్లు వస్తాయంటూ బాధితులకు ఎర వేసి రూ.కోట్లు వసూలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రేమ, స్నేహం పేరుతో యువతీ, యువకులను పరిచయం చేసుకుని చాటింగ్‌ చేస్తూ విలువైన బహుమతులను పంపుతున్నామని, కార్గో వారితో మాట్లాడి తీసుకోవాలని చెబుతున్నారు. తర్వాత వీరే ఫోన్‌ చేసి బహుమతులను తీసుకోవాలంటే కస్టమ్స్‌.. ఐటీ, ఇతర పన్నులంటూ బాధితుల నుంచి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్‌ నగరం నుంచే పెళ్లిళ్ల మోసం ద్వారా గతేడాది రూ.1.87కోట్లు వసూలు చేశారు.

విమానాలు.. నౌకల్లో మాదక ద్రవ్యాలు
మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఎంచుకున్న నైజీరియన్లు కొకైన్‌, బ్రౌన్‌షుగర్‌ వంటి వాటిని దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌, గోల్డెన్‌ ట్రయాంగిల్‌ నుంచి విమానాలు, నౌకల ద్వారా తెప్పిస్తున్నారు. అక్కడున్న నైజీరియన్లు ఇక్కడికి పంపుతున్నారు. నౌకల ద్వారా వస్తున్న కొకైన్‌ను ముంబయి ఓడరేవుకు 12 నాటికల్‌ మైళ్ల దూరంలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి చిన్న, చిన్న పడవల ద్వారా తీసుకొస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి గోవా, మంగుళూరు, ముంబయి నగరాలకు పంపుతున్నారు. విమానాల ద్వారా వచ్చే డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు గుర్తించకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కార్గోల ద్వారా తీసుకుంటున్నారు. మరికొందరు దక్షిణాఫ్రికా, గోల్డెన్‌ ట్రయాంగిల్‌, పాకిస్థాన్‌ సరిహద్దు గుండా పంజాబ్‌ రాష్ట్రానికి తీసుకొచ్చి దిల్లీకి పంపుతున్నారు. దిల్లీలో మాదక ద్రవ్యాలు విక్రయించే మార్కెట్‌కు తరలించి అక్కడి నుంచి గ్రాముల లెక్కన తీసుకుని దిల్లీలోని పబ్బులు, బార్లు, సెలబ్రిటీలకు విక్రయిస్తున్నారు.

లక్ష్యం సెలబ్రిటీలు... టాలీవుడ్‌... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు... విద్యార్థులు
మాదక ద్రవ్యాలను గోవా, మంగుళూరు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్న నైజీరియన్లు ముందుగా అక్కడే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. విహారయాత్ర కోసం గోవాకు వస్తున్న సెలబ్రిటీలు, టాలీవుడ్‌లో కొందరు నటీనటులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులను పరిచయం చేసుకుంటున్నారు. వారికి తక్కువ ధరకు కొకైన్‌ ఇచ్చి అలవాటు చేస్తున్నారు. ‘హైదరాబాద్‌లో మీ స్నేహితులు, పరిచయస్తులకు కూడా ఇస్తాం... మీకు కొద్దిరోజులు ఉచితంగా ఇస్తామ’ని చెబుతున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వచ్చి గుట్టు చప్పుడు కాకుండా కొకైన్‌, బ్రౌన్‌ షుగర్‌లను విక్రయిస్తున్నారు. అనంతరం మార్కెట్‌ను పెంచుకునేందుకు కొన్ని పబ్బులు, రిసార్టులను ఎంచుకుంటున్నారు. వేల సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యే వేడుకల్లో లిక్విడ్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. రూ.లక్షలు సంపాదించేందుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిలో కొందరిని ఎంచుకుని వారికి కొకైన్‌ సరఫరా చేస్తున్నారు. విక్రయించిన తర్వాత కమీషన్‌ ఇచ్చి మిగిలిన సొమ్ము తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్ల వద్ద ఏజెంట్లుగా కొందరు ఇంజినీరింగ్‌ విద్యార్థులున్నారని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.

కట్టడి ఇలా....
కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల పోలీస్‌ విభాగాల మధ్య సమన్వయంతో పాటు నైజీరియన్లకు కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించాలని పోలీస్‌ అధికారులు సూచిస్తున్నారు.
దిల్లీలోని విదేశీ ప్రాంతీయ నమోదు కేంద్రంలో తమ పేర్లు నమోదు చేసుకున్న నైజీరియన్లు వారు ఎక్కడికి వెళ్తున్నారో సమాచారం ఇవ్వాలి. సెల్‌ఫోన్‌ నంబర్లను అందులో రాయాలి. వారు ఉన్నచోటు కాకుండా మరో ప్రాంతానికి వెళ్తే ఆ సమాచారాన్ని విదేశీ ప్రాంతీయ నమోదు కేంద్రం అధికారులకు తప్పక తెలపాలి.
వారు ఉంటున్న ఇల్లు, కార్యాలయం వివరాలను స్థానిక పోలీసు ఠాణాలో తప్పనిసరిగా ఇవ్వాలి. అక్కడ తమ వీసా గడువు ఫలానా రోజు వరకూ ఉందని చెప్పాలి. చదువుకుంటున్నట్లైతే ఆ విద్యాసంస్థల పేర్లు, చిరునామాలను పేర్కొనాలి. వీసా గడువు పూర్తయిన పక్షంలో వీసా గడువు పెంపు కోసం అభ్యర్థించిన వివరాలను పోలీస్‌ అధికారులకు వివరించాలి.
పర్యాటక ప్రాంతాలలో హోటల్‌, అతిథి గృహాల్లో బస చేసినప్పడు నిర్వాహకులు వారి గుర్తింపు కార్డులను తీసుకుని స్థానిక పోలీస్‌ ఠాణాలకు వివరించాలి. నైజీరియన్లకు ఇల్లు, ఫ్లాట్‌లు అద్దెకు ఇచ్చిన యజమానులు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
అంతర్జాల నేరాలు, డ్రగ్స్‌ విక్రయించి పోలీసులకు పట్టుబడిన నైజీరియన్లు జైల్లో ఉన్నారా? బెయిల్‌పై బయటకు వచ్చారా? బయటకు వస్తే వారు ఏం చేస్తున్నారు? శిక్షపూర్తయిన వారు వారి దేశానికి వెళ్లారా? అన్న అంశాలను స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక పోలీస్‌ విభాగం(స్పెషల్‌ బ్రాంచ్‌) అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని విదేశీ ప్రాంతీయ నమోదు కేంద్రంతో పాటు ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో పంచుకోవాలి.

తొలుత కలిసి మత్తు వ్యాపారం.. తర్వాత సొంత వ్యాపారం

క్షిణాఫ్రికా, కెన్యా, నైజీరియా దేశాల నుంచి పదుల సంఖ్యలో నైజీరియన్లు భారతదేశానికి వస్తున్నారు. ఇందులో కొందరు నిజంగానే చదువుకునేందుకు వస్తున్నారు. పర్యాటకం, వ్యాపారం పేరుతో వస్తున్నవారిలో 95శాతం మంది మోసాలకు పాల్పడుతున్నారు. దిల్లీకి రాగానే నైజీరియన్లుంటున్న వసంత్‌కుంజ్‌, నోయిడా, గుర్‌గావ్‌లకు వెళ్తున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడేవారు అక్కడే ఉంటున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించేవారు మాత్రం కోల్‌కతా, ముంబయి, గోవా, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు వెళ్తున్నారు. అక్కడ అంతకుముందున్నవారితో మాట్లాడి మాదక ద్రవ్యాలు ఎలా విక్రయించాలో తెలుసుకుంటున్నారు. కొద్దిరోజుల పాటు వారితో కలిసి డ్రగ్స్‌ వ్యాపారం నిర్వహించాక.. సొంతంగా వ్యాపారం మొదలు పెడుతున్నారు. ఇదే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేయడం, ఫుట్‌బాల్‌ క్లబ్బుల్లో సభ్యులుగా చేరి శిక్షణ పొందడం వంటివి చేస్తున్నారు.

వేర్వేరుగా వచ్చినా.. వచ్చాక ఒక్కటిగా...

నైజీరియా దేశానికి చెందిన ఓ ముగ్గురు నాలుగేళ్ల క్రితం వేర్వేరుగా హైదరాబాద్‌కు వచ్చారు. ఓ ప్రైవేటు విద్యా సంస్థలో విలియమ్స్‌ విద్యార్థిగా చేరగా... బెర్నాడ్‌ కేశాలంకరణ నిపుణుడిగా మారాడు. లూకాస్‌ టెక్స్‌టైల్స్‌ వ్యాపారం చేసేవాడు. కొద్దిరోజులకే స్నేహితులయ్యారు. తర్వాత మాదక ద్రవ్యాలు విక్రయించడం ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల ఈవెంట్‌లు, ముజ్రాలు, రేవ్‌ పార్టీలకు వీరు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారు. రూ.లక్షల్లో ఆదాయం వస్తుండడంతో బంజారాహిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. రెండేళ్లకు పోలీసులు వీరి డ్రగ్స్‌ దందా గుర్తించారు. 250 గ్రాముల కొకైన్‌, 25గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఎక్కువగా టాలీవుడ్‌ నటులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు డ్రగ్స్‌ సరఫరా చేశారు.
- ఈనాడు, హైదరాబాద్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.