close

ప్ర‌త్యేక క‌థ‌నం

చందమామపైనా ఓ గూడు

చంద్రుడిపైకి అలా వెళ్లి.. ఇలా వచ్చేయడం కాకుండా అక్కడ శాశ్వతంగా గూడు ఏర్పాటు చేసుకోవాలని అనేక దేశాలు కలలు కంటున్నాయి. ఒకప్పుడు సైన్స్‌ కాల్పనిక సాహిత్యానికే పరిమితమైన ఈ స్వప్నం వాస్తవ రూపంలోకి రాబోయే రోజు ఎంతో దూరంలో లేదు. జాబిల్లి మీదకు భారత్‌ ప్రయోగిస్తున్న చంద్రయాన్‌-2 వ్యోమనౌక ఈ దిశగా వేస్తున్న అడుగే. అక్కడ ఆవాసాన్ని ఏర్పర్చుకోవడానికి అవసరమైన అవకాశాలు, అవరోధాల గురించి ఇది సవివరంగా శోధిస్తుంది. ఇప్పటికే అనేక దేశాలు చంద్రుడిపై స్థిర ఆవాసం దిశగా కసరత్తు మొదలుపెట్టాయి.

ప్రస్తుతానికి సుదీర్ఘకాల జీవనానికి జాబిల్లి అనువుగా లేదు. ఉష్ణోగ్రతలు 127 డిగ్రీల నుంచి మైనస్‌ 173 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉంటాయి. భూమి తరహాలో వాతావరణ రక్షణ కవచం లేకపోవడం వల్ల రేడియోధార్మికత, ఉల్కల ఢీ తాకిడి ఎక్కువ. జాబిల్లిపై రెండు వారాల పాటు చీకటి, మరో రెండు వారాల పాటు సూర్యకాంతి ఉంటున్నాయి. ఇలాంటి సవాళ్లను అధిగమించే దిశగా అనేక దేశాలు నడుం బిగించాయి.

భారత్‌ ఇగ్లూలు

చంద్రుడిపై ఇగ్లూలను నిర్మించే పనిని ఇస్రో ప్రారంభించింది. వీటిని ‘చంద్రమండల ఆవాసాలు’ (లూనార్‌ హ్యాబిటాట్స్‌)గా పిలుస్తున్నారు. చంద్రుడి మీదకు రోబోలు, త్రీడీ ప్రింటర్లను పంపి వీటిని నిర్మిస్తారు. ఇందుకు చంద్రుడి మీదున్న మట్టి, ఇతర పదార్థాలనే ఉపయోగిస్తారు. ఇప్పటికే ఒక నమూనా, ఐదు డిజైన్లు సిద్ధమయ్యాయి. జాబిల్లిపై ఆవాసాలకు వీలు కల్పించే స్మార్ట్‌ పదార్థాలపైనా ఇస్రో దృష్టి పెట్టింది. ఇలాంటి ప్రయోగాల కోసం చంద్రుడి మట్టిని పోలిన పదార్థాన్ని 60 టన్నుల మేర  సృష్టించింది. చంద్రుడి నుంచి అమెరికా తెచ్చిన నమూనాలతో దీన్ని పోల్చి చూసినప్పుడు 99.6 శాతం మేర సరిపోలింది.

అమెరికా గేట్‌వే

1970ల తర్వాత మరోసారి చంద్రుడిపైకి మానవసహిత యాత్రలు చేపట్టాలని అమెరికా నిర్ణయించింది. 2024 కల్లా అక్కడికి వ్యోమగాములను పంపాలని భావిస్తోంది. ఈసారి జాబిల్లిపైకి వెళ్లి రావడమే కాకుండా అక్కడ శాశ్వత ఆవాసానికి పునాదులు వేయాలని అనుకుంటోంది. నీరు పుష్కలంగా ఉన్న చంద్రుడి దక్షిణ ధ్రువంపై కన్నేసింది. 2026 నాటికి ‘గేట్‌వే’ పేరుతో చంద్రుడి కక్ష్యలో ఒక చిన్న అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. చంద్రుడి ఉపరితలం మీదకు వెళ్లే క్రమంలో అది మజిలీగా పనికొస్తుందని భావిస్తోంది.

ఐరోపా  గ్రామం

జాబిల్లిపై ఒక గ్రామాన్ని ఆవిష్కరించాలన్న దార్శనికతను  2016లో ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ) ఆవిష్కరించింది. అందులో శాస్త్రవేత్తల నుంచి కళాకారుల వరకూ అన్ని వర్గాల ప్రజలు ఉంటారని పేర్కొంది. ఆ గ్రామంలో ఖగోళ పరిశోధన, భూమి మీద కొరతగా ఉన్న ఖనిజాల కోసం అన్వేషణ వంటివి జరుగుతాయి.

చైనా  చాంగురే

జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆవాసం ఏర్పాటును చైనా లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్‌లో అక్కడికి పంపే ‘చాంగే-7’ ఇందుకు పునాదులు వేయబోతోంది. ఈ దిశగా ‘లూనార్‌ ప్యాలెస్‌-1 అనే నమూనా స్థావరాన్ని భూమి మీద సిద్ధంచేసింది. జీవుల మనుగడకు ఒక వాతావరణ వ్యవస్థను సృష్టించింది. అందులో వలంటీర్లు 370 రోజులు నివసించారు.

నేల మాళిగలోనే..

హానికారక రేడియోధార్మికత నుంచి రక్షణ కోసం జాబిల్లిపై శాశ్వత ఆవాసాలను చాలావరకూ నేలమాళిగలోనే నిర్మించడం క్షేమం. జపాన్‌కు చెందిన సెలీన్‌, నాసాకు చెందిన గ్రెయిల్‌ వ్యోమనౌకలు చంద్రుడి మారియస్‌ హిల్స్‌ కింద పొడవైన సొరంగాన్ని గుర్తించాయి. చందమామపై నివాసానికి అది అనువైన ప్రదేశమని భావిస్తున్నారు. 2050 నాటికి సిద్ధమవుతుందనుకుంటున్న ఒక జాబిల్లి ఆవాసాన్ని గ్లోబల్‌ లూనార్‌ కాన్ఫరెన్స్‌లో శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దాన్ని నేలమాళిగలో ఏర్పాటు చేస్తారు. స్పేస్‌ ఎక్స్‌ సహా అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీలు కూడా జాబిల్లిపై ఆవాసం దిశగా అడుగులు వేస్తున్నాయి.

పంటలూ పండిస్తారు

జాబిల్లిపై నివాసం ఉండేవారికి ఆహారం కోసం అక్కడ పంటలు పండించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. చైనా ఒక జీవ వ్యవస్థను సిద్ధం చేసింది. అందులో మొక్కలు సేంద్రియ వ్యర్థాలను రీసైకిల్‌ చేస్తాయి. కార్బన్‌ డైఆక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మార్చేస్తాయి. ఇటీవల చంద్రుడి మీదకు చైనా ప్రయోగించిన చాంగె-4 వ్యోమనౌకలో పంపిన ఒక విత్తనం మొలకెత్తడంతో పరిశోధకుల్లో ఆసక్తి రేగింది. 1982లో రష్యా ఆవాల జాతికి చెందిన ఒక మొక్కను తమ సెల్యూట్‌-7 అంతరిక్ష కేంద్రంలో సాగు చేసింది.
* 2010లో ఆరిజోనా విశ్వవిద్యాలయం లూనార్‌ గ్రీన్‌హౌస్‌ అనే ఒక వ్యవస్థను రూపొందించింది. వ్యోమగాముల శ్వాసలోని కార్బన్‌ డైఆక్సైడ్‌, వారు విసర్జించే మూత్రం ద్వారా ఆ వ్యవస్థలో మొక్కల సాగు జరుగుతుంది.
* అంతరిక్ష వాతావరణ పరిస్థితుల్లో కొన్ని పంటలను సాగు చేసేందుకు అమెరికా వెజ్జీ అనే కార్యక్రమాన్ని చేపట్టింది.

అక్కడి నీరే ఆధారం

చంద్రుడిపై ఆవాసాల కోసం భూమి నుంచి నీటిని తరలించడం వ్యయభరితం. జాబిల్లిపైన ఉన్న నీటినే వాడుకోవాలి. నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌గా విడగొట్టి ఆక్సిజన్‌ను శ్వాస క్రియకు వాడుకోవచ్చు.  ఈ రెండింటినీ ఇంధనంగా వాడొచ్చు.

న్యాయపరమైన అవరోధాలు

చంద్రుడిపైన నివాసానికి ఇంత కసరత్తు జరుగుతున్నా చివరకు చట్టబద్ధమైన అవరోధాలు ఎదురుకావొచ్చు. 1967లో ‘ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ’ సిద్ధమైంది. అంతరిక్ష పరిజ్ఞాన సామర్థ్యమున్న దేశాలన్నీ దీనిపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం ఏ ఖగోళ వస్తువులోని ఏ భాగాన్ని కూడా అనుమతి లేకుండా వినియోగించడానికి వీల్లేదు. అందుకే జాబిల్లిపై మైనింగ్‌కు, ఆవాసాలకు న్యాయపరమైన వివాదాలు లేకుండా విస్పష్ట నిబంధనలు, చట్టాలు అవసరం.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.