close

ప్ర‌త్యేక క‌థ‌నం

భలే మంచి చౌక బేరమూ!

అమెరికా, రష్యా, చైనా, ఐరోపా సమాఖ్య.. ఇవన్నీ మనదేశం కంటే ముందు నుంచే అంతరిక్షంలో సత్తా చాటుతున్నాయి. కాస్త లేటుగా వచ్చినా లేటెస్టుగా మనదేశం వాటన్నింటికీ దీటుగా ఎదుగుతోంది. వేగంగా ప్రయోగాలకు రూపకల్పన చేస్తూ, అతి తక్కువ ఖర్చుతో వాటిని విజయవంతంగా పూర్తి చేస్తూ ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతోంది.

చౌకలో ప్రయోగాలు చేపట్టడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు మంచి పేరుంది. ఇప్పటికే అనేక ఉపగ్రహాలు, రాకెట్లను చాలా తక్కువ ధరకు సంస్థ ప్రయోగించింది. గ్రహాంతర యాత్రల విషయంలోనూ ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమా కంటే తక్కువ వ్యయంతో
2014 సెప్టెంబర్‌లో మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌(మామ్‌)ను అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో చరిత్ర సృష్టించింది. ఆ ప్రాజెక్టు ఖర్చు కేవలం 7.3 కోట్ల డాలర్లు. హాలీవుడ్‌ సినిమా ‘గ్రావిటీ’ నిర్మాణ వ్యయం(10 కోట్ల డాలర్లు) కన్నా తక్కువ ఖర్చుతోనే ‘మామ్‌’ ప్రయోగాన్ని మనదేశం చేపట్టడం విశేషం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా కూడా ‘మావెన్‌’ అనే వ్యోమనౌకను అంగారకుడి వద్దకు పంపింది. అయితే, ఆ ప్రాజెక్టు ఖర్చు 67.1 కోట్ల డాలర్లు. అంగారక గ్రహ నేపథ్యంలో తీసిన హాలీవుడ్‌ సినిమా ‘ద మార్షియన్‌’ సినిమా నిర్మాణ వ్యయంతో పోలిస్తే సగం ధరకే ఆ గ్రహం వద్దకు ఇస్రో తన వ్యోమనౌకను పంపింది.

చంద్రయాన్‌-2 విషయంలోనూ..
ప్రస్తుతం మనదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్‌-2 ప్రాజెక్టు వ్యయం 14 కోట్ల డాలర్లు. ఇటీవల సూపర్‌ హిట్‌ అయిన హాలీవుడ్‌ చిత్రం ‘ఎవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌’ నిర్మాణ వ్యయం(35.6 కోట్ల డాలర్లు) కంటే చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఖర్చే తక్కువ. ఇక 1960, 70లలో జాబిల్లిపైకి అమెరికా చేపట్టిన పదిహేను అపోలో యాత్రలకు(మానవ సహిత యాత్రలతో కలిపి) దాదాపు 25 బిలియన్‌ డాలర్లు ఖర్చయింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే అది 200 బిలియన్‌ డాలర్లతో సమానం. చంద్రుడిపై మొట్టమొదటిసారిగా కాలుమోపిన రష్యా 1960-70లలో చంద్రుడిపైకి యాత్రల కోసం 20 బిలియన్‌ డాలర్లకుపైగా(నేటి లెక్కల ప్రకారం) ఖర్చుపెట్టింది.

ఎలా సాధ్యం?

సిస్టమ్‌ మొత్తాన్నీ సరళీకరించడం, సంక్లిష్టమైన పెద్ద వ్యవస్థను సూక్ష్మీకరించడం, నాణ్యతపై పటిష్ఠ నియంత్రణ, ఉత్పాదన విషయంలో గరిష్ఠ స్థాయిలో ఫలితాన్ని రాబట్టడం వంటి చర్యల వల్ల తాము చౌకగా అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టగలుగుతున్నామని ఇస్రో చెబుతోంది. వ్యోమనౌకలు, రాకెట్ల అభివృద్ధిలోని అన్ని దశల్లోనూ పటిష్ఠ నిఘా ఏర్పాటుచేస్తున్నామని.. అందువల్ల ఉత్పత్తి ప్రక్రియలో వృథా తక్కువగా ఉంటుందని వివరించింది. విదేశాలతో పోలిస్తే తక్కువ వ్యయంతో మానవ వనరులు లభ్యమవుతుండటం కూడా చౌక ప్రయోగాలకు దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.

ఆ సమయం వెనుక అసలు లెక్కేంటంటే..
ఎప్పుడు పడితే అప్పుడు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టలేం.  నిర్దిష్ట సమయం(లాంచ్‌ విండో)లోనే వ్యోమనౌకను ప్రయోగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయోగించలేకపోతే మళ్లీ అనువైన సమయం వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

ఎందుకలా?
భూమి స్థిరంగా ఉండదు. తన కక్ష్యలో నిరంతరం కదులుతూనే ఉంటుంది. ప్రయోగానంతరం భూ కక్ష్యలోకి చేరాక ‘చంద్రయాన్‌-2’ కూడా ప్రయాణంలోనే ఉంటుంది. ఈ వ్యోమనౌక గమ్యస్థానమైన చందమామదీ ఇదే తీరు. అందువల్ల భూమి నుంచి బయలుదేరాక వ్యోమనౌక తక్కువ ప్రయాణం, శ్రమతో చంద్రుడిని ఎక్కడ కలుసుకోగలదన్నది లెక్కించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వ్యోమనౌక జాబిల్లిని దాటి వెళ్లిపోతుంది. సరైన సమయంలో ప్రయోగం చేపడితే భూ భ్రమణ శక్తి కూడా వ్యోమనౌకపై అనుకూలంగా పనిచేస్తుంది.

ప్రయోగం ఆ సమయంలోనే ఎందుకంటే..

ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్‌-2’ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. సరిగ్గా సోమవారం తెల్లవారుజామున 2 గంటల 51 నిమిషాలకు వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లబోతోంది. ఈ నేపథ్యంలో చాలామంది మెదళ్లను కొన్ని ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. అవేంటంటే.. కీలకమైన ప్రయోగాన్ని అంత రాత్రి పూట ఎందుకు చేపడుతున్నారు? అప్పుడు కాకుండా కాస్త ముందో, వెనకో వ్యోమనౌకను నింగిలోకి పంపితే ఏమవుతుంది?

ఉన్నది 10 నిమిషాలే..

జులై 15న చంద్రయాన్‌-2 ప్రయోగం చేపట్టడానికి అనుకూలమైన ‘విండో’.. ఇస్రోకు తెల్లవారుజాము 2.51 గంటల నుంచి 3.01 గంటల మధ్య కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఆ రోజున చేపట్టలేకపోతే జులైలో మిగతా రోజుల్లో ఒక్క నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే ఉన్నాయి.
* 14 రోజుల పగటి సమయాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకునేలా ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడిపై దించాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది.
* ఫలానా సమయంలో ప్రయోగిస్తే ఈ వ్యోమనౌక ఏదైనా ఇతర ఉపగ్రహాలు, శకలాలను ఢీ కొట్టే ప్రమాదం ఉందా అన్నది కూడా పరిశీలించాలి.
* చంద్రుడి కక్ష్యలోకి చేరాక ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ను వేరు చేసే ప్రక్రియనూ సరైన సమయంలో చేపట్టాల్సి ఉంటుంది. సూర్యుడు-చంద్రుడు-భూమి గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా దీన్ని నిర్ణయించాల్సి ఉంటుంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.