close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఆది నుంచీ జాప్యాలే

పలుమార్లు వాయిదాపడ్డ చంద్రయాన్‌-2

ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్‌-2’కు ఆది నుంచీ జాప్యాలు తప్పలేదు. ఈ ప్రాజెక్టుకు 2008 సెప్టెంబర్‌ 18న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రయోగం కోసం రష్యాతో కలసి పనిచేయాలని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలుత భావించింది. దానిప్రకారం ఆర్బిటర్‌, రోవర్‌ను ఇస్రో రూపొందించాలి. ల్యాండర్‌ను రష్యా సరఫరా చేస్తుంది. 2013లో చంద్రయాన్‌-2ను ప్రయోగించాలని తొలుత భావించారు. అయితే వరుస ఇబ్బందులతో ఈ ప్రాజెక్టు ఏళ్ల తరబడి వాయిదాలు పడుతూ వచ్చింది.

వెనక్కి తగ్గిన రష్యా 
రష్యా వైదొలగడంతో ‘చంద్రయాన్‌-2’లో వాయిదాల ప్రస్థానానికి బీజాలు పడ్డాయి. అంగారకుడి చందమామ ‘ఫోబోస్‌’ వద్దకు ఆ దేశం ప్రయోగించిన ‘ఫోబోస్‌-గ్రంట్‌’ వ్యోమనౌక విఫలమైంది. ఆ వ్యోమనౌకలోని సాంకేతిక అంశాలనే చంద్రయాన్‌-2లోనూ ఉపయోగించాల్సి ఉండటంతో రష్యా వెనక్కి తగ్గింది. సదరు సాంకేతికాంశాలపై పూర్తిస్థాయి సమీక్ష జరిపాకే తదుపరి ప్రయోగాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. దీంతో ల్యాండర్‌ను కూడా సొంతంగానే తయారుచేసుకోవాలని ఇస్రో నిర్ణయించింది. ఒకవిధంగా రష్యా నిర్ణయం మన దేశానికి కలిసొచ్చింది. కీలకమైన ల్యాండర్‌ పరిజ్ఞానాన్ని భారత్‌ సొంతంగా అభివృద్ధి చేసుకోవడానికి వీలు కల్పించింది. గ్రహాంతర యాత్రల్లో ఈ ల్యాండింగ్‌ టెక్నాలజీయే ప్రాణాధారం. గతంలో క్రయోజెనిక్‌ ఇంజిన్‌ పరిజ్ఞాన బాధ్యత నుంచీ రష్యా ఇదే తరహాలో తప్పుకోవడంతో ఆ పరిజ్ఞానాన్ని కూడా ఇస్రో సొంతంగా అభివృద్ధి చేసుకుంది.

బరువు పెరగడంతో మళ్లీ.. 
రష్యా వైదొలిగాక ల్యాండర్‌ సంబంధిత సమస్యలతో ‘చంద్రయాన్‌-2’ వాయిదా పడుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టును 3.2 టన్నుల బరువుతో చేపట్టాలని ఇస్రో తొలుత భావించింది. అయితే, ఆ డిజైన్‌తో యాత్ర చేపడితే జాబిల్లిపై ల్యాండర్‌ దిగే సమయంలో, రాకెట్లను మండించినప్పుడు సమస్యలు ఉత్పన్నం కావొచ్చని గుర్తించింది. దీనికితోడు ఆ ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన జాతీయ నిపుణుల కమిటీ కూడా వ్యోమనౌకకు అనేక మార్పులను సూచించింది. కీలక వ్యవస్థలు విఫలమైతే ఇబ్బందులు తలెత్తకుండా వాటికి ప్రత్యామ్నాయాలు ఉండాలంది. వైరింగ్‌ వ్యవస్థ సహా అనేక చోట్ల మార్పులు చేయాలని కోరింది. పరీక్షల్లో వెల్లడైన అంశాలు, నిపుణుల సూచనలను ఆచరణలోకి పెట్టడంతో చంద్రయాన్‌-2 బరువు 3.8 టన్నులకు పెరిగింది. ఫలితంగా మొదట అనుకున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-2 రాకెట్‌కు అంత బరువును మోసుకెళ్లే సామర్థ్యం లేదు. దీంతో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3ని ఉపయోగించాలని ఇస్రో నిర్ణయించింది. దీనివల్ల ప్రయోగంలో మరింత జాప్యం జరిగింది. 2018 మార్చిలో ప్రయోగం చేపట్టాలనుకున్నప్పటికీ అప్పుడూ ఇబ్బంది తలెత్తడంతో దాదాపు నాలుగుసార్లు ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. చివరిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగిద్దామనుకొని, తర్వాత జులై 15(సోమవారం)కు మార్చారు.

మంగళయాన్‌కు కలిసొచ్చింది 
చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ ఇంచుమించుగా చంద్రయాన్‌-1 తరహాలోనే ఉంటుంది. అందువల్ల చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ను ఇస్రో చాలా ఏళ్ల కిందటే సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు నుంచి రష్యా వైదొలిగాక జాప్యం తలెత్తడంతో ఆ ఆర్బిటర్‌ను 2013లో ఇస్రో తన తొలి అంగారక యాత్ర ‘మంగళయాన్‌’ కోసం ఉపయోగించింది. ప్రాజెక్టు మంజూరైన 13 నెలల్లోనే ‘మంగళయాన్‌’ను చేపట్టడం వెనుక రహస్యం ఇదే.


అప్రమత్తతే కాపాడింది 
ఇస్రోపై శాస్త్రవేత్తల ప్రశంసలు 

దిల్లీ: చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని నిలిపివేసిన ఇస్రోను పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు అభినందించారు. సంస్థ అప్రమత్తతతో భారీ నష్టం తప్పిందని కొనియాడారు. లోపాలను సరిదిద్ది త్వరలోనే చంద్రయాన్‌-2ను ఇస్రో విజయవంతంగా ప్రయోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ప్రయోగ వ్యవస్థల్లో ఇస్రో విజయాల రికార్డు అద్భుతం. రాకెట్‌లోని సంక్లిష్ట వ్యవస్థలను చివరి నిమిషం వరకు సునిశితంగా పరిశీలించడం ఓ కళ. అందులో సంస్థ ఆరితేరినట్లు కనిపిస్తోంది. తొందరపడి ప్రయోగంలో ముందుకెళ్లి ఉంటే భారీ నష్టం సంభవించి ఉండేది’’ అని కోల్‌కతాలోని ‘ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌)’లో ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సైన్సెస్‌ ఇండియా’కు నేతృత్వం వహిస్తున్న రాజేశ్‌ కుంబ్లే నాయక్‌ పేర్కొన్నారు.  పెద్ద విపత్తు తలెత్తకముందే లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని నిలిపివేయడం మంచిదయిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ మాజీ శాస్త్రవేత్త రవి గుప్తా తెలిపారు. ఇది మన శాస్త్రవేత్తల నిశిత పరిశీలన సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు.

ఆపడమే మంచిదైంది 
- బి.జి.సిద్ధార్థ 
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: సాంకేతిక లోపాలను ఇస్రో ముందుగానే గుర్తించి చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని ఆపడం మంచిదైందని ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, హైదరాబాద్‌ బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బి.జి.సిద్ధార్థ అన్నారు. ‘ఈనాడు-ఈటీవీ’తో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సమస్యలు తలెత్తడం మొదటిసారి కాదన్నారు. గతంలో రష్యా, అమెరికా వంటి దేశాల్లోనూ ఈ సమస్య ఎదురైందని గుర్తుచేశారు. ఒకవేళ అలాగే ప్రయోగం పూర్తిచేసుంటే వేలకోట్ల రూపాయలు వృథా   అయ్యేవని పేర్కొన్నారు.

అవరోధాలు కొత్తేం కాదు 
న్యూస్‌టుడే, శ్రీహరికోట: ‘చంద్రయాన్‌-2’ తరహాలోనే గతంలోనూ ఇస్రో చేపట్టిన కొన్ని ప్రయోగాల్లో కౌంట్‌డౌన్‌ జరుగుతుండగా సాంకేతిక అవరోధాలు తలెత్తాయి. అనంతరం శాస్త్రవేత్తలు ఆ లోపాలను సరిచేసి విజయవంతంగా ఆ ప్రయోగాలను పూర్తిచేశారు. వాటిలో రెండు కీలక ప్రయోగాలివీ..

జీఎస్‌ఎల్‌వీ-డీ5: 2013 ఆగస్టు 21న ‘జీఎస్‌ఎల్‌వీ-డీ5’ ప్రయోగం కౌంట్‌డౌన్‌ మరో గంటలో ముగుస్తుందనగా సమస్య తలెత్తింది. వాహకనౌకలో ఇంధనం నింపే ట్యాంకర్‌ నుంచి లీకేజీని గుర్తించారు. వెంటనే ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి 2014 జనవరిలో విజయవంతంగా దాన్ని పూర్తిచేశారు.

చంద్రయాన్‌-1: 2008 అక్టోబరులో చంద్రయాన్‌-1 ప్రయోగం కౌంట్‌డౌన్‌ మరో రెండు గంటల్లో ముగుస్తుందనగా గ్రౌండ్‌ నుంచి వాహకనౌక వద్దకు వచ్చే లిక్విడ్‌ పైపుల్లో లీకేజీని గుర్తించారు. శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమించి లీకేజీని నిలిపివేశారు. అదే రోజు ప్రయోగాన్ని పూర్తిచేశారు.


 కత్తి మీద సాము.. క్రయోజెనిక్‌ దశ! 

రాకెట్‌లో అత్యంత ప్రధానమైన భాగం ఇంజిన్‌. ఒక్కమాటలో చెప్పాలంటే మనిషికి గుండెకాయ ఎలాగో రాకెట్‌కు ఇంజిన్‌ అలాగన్నమాట! ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి వాహకనౌక ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3’కి గుండెకాయ.. అందులోని అత్యంత శక్తిమంతమైన క్రయోజెనిక్‌ ఇంజినే. రెండు దశాబ్దాలపాటు ఎన్నో వ్యయప్రయాసలు, అవమానాలు, వైఫల్యాలు, అంతర్జాతీయ ఒత్తిడులను ఎదుర్కొని మనదేశం ఈ పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకుంది. క్రయోజెనిక్‌ దశలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ‘చంద్రయాన్‌-2’ ఆగిపోయినట్లు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఆ ఇంజిన్‌ గురించి ఆసక్తికర విషయాలను ఓసారి పరిశీలిద్దాం.

ఇంధనంగా ద్రవ హైడ్రోజన్‌ 
రాకెట్లు ఘన, ద్రవ, వాయు రూపాల్లోని రసాయన ఇంధనాలతో నడుస్తాయి. వాయురూప ఇంధనాలను వినియోగించాలంటే వాటిని ఘన, ద్రవ ఇంధనాలతో పోలిస్తే అధిక పీడనంతో కంప్రెస్‌ చేయాలి. లేదా అత్యంత శీతల ఉష్ణోగ్రతకు చల్లబరచి, ద్రవ రూపంలోకి మార్చాలి. ఎక్కువ సాంద్రత సాధించడానికి ఇది అవసరం. అలా చల్లబరిచి సృష్టించిన ఇంధనాలను క్రయోజెనిక్‌ ద్రవ ఇంధనాలుగా పేర్కొంటారు. క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో ప్రధానంగా ద్రవ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడతారు. ఇది మైనస్‌ 253 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ద్రవ రూపంలోకి మారుతుంది. దీన్ని మండించడానికి ఆక్సిజన్‌ను ఆక్సిడైజర్‌గా ఉపయోగిస్తారు. అది మైనస్‌ 183 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ద్రవమవుతుంది. హైడ్రోజన్‌ను, ఆక్సిజన్‌ను విడివిడిగా ట్యాంకుల్లో భద్రపరచి, ప్రజ్వలన చాంబర్‌లో మండిస్తారు. ఈ క్రమంలో వెలువడే వేడి వాయువులు నాజిల్‌ ద్వారా బయటకు వెళ్లి, రాకెట్‌కు అవసరమైన శక్తిని ఇస్తాయి.

అంత సులువుకాదు.. 
క్రయోజెనిక్‌ ఇంజిన్‌లో ప్రధాన సమస్య.. ‘శీతలీకరణ’. అతి శీతల పరిస్థితులను తట్టుకునేలా అందులో ప్రత్యేక లోహ మిశ్రమాలతో తయారుచేసిన గొట్టాలు, ట్యాంకులు, పంప్‌లు తయారుచేయాలి. బయటి వాతావరణం తగలకుండా వాటికి ఉష్ణ రక్షణ కవచాలు ఏర్పాటుచేయాలి. క్రయో(-120 కెల్విన్‌ కంటే తక్కువ) ఉష్ణోగ్రత కొనసాగేలా చూడాలి. ఎక్కడ తేడా వచ్చినా ఇంధన సరఫరా స్తంభించిపోయి ఇంజిన్‌ విఫలమవుతుంది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.