close

ప్ర‌త్యేక క‌థ‌నం

భవిష్యత్తుకు నీళ్లొదలాల్సిందే

ఇలా వినియోగిస్తే.. రాబోయేతరాలకు నీళ్లుండవు 
సమూహాలుగా భూగర్భ జలాల వినియోగం ఉండాలి 
రూ.15 ఖర్చుతో వెయ్యి లీటర్ల నీరు శుద్ధి చేయొచ్చు 
ఇతర దేశాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బోరు తవ్వకాలు 
ప్రజలు, ప్రభుత్వం ఉమ్మడిగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి 
డబ్బా నీళ్లు అత్యంత ప్రమాదకరం 
ఈనాడు ‘ముఖాముఖి’లో అధ్యయనవేత్త, ఏడీబీఐ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ కేఈ సీతారాం

ఈనాడు, హైదరాబాద్‌: ఎడాపెడా భూగర్భ జలాల తోడకం.. నీటి వనరుల కలుషితం.. కావాల్సినంత అందుబాటులో లేకపోవడం.. లాంటి సమస్యలను దేశం ఎదుర్కొంటోందని నీటి వనరుల సంరక్షణపై అధ్యయనవేత్త, ‘ది యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో’ ఆచార్యుడు, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ కేఈ సీతారాం తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తరాలకు నీళ్లుండవని హెచ్చరించారు. ఆర్‌ఓ ప్లాంట్లలో శుద్ధి చేసి విక్రయిస్తున్న నీరు అత్యంత ప్రమాదకరమన్నారు. విజయవంతమైన నీటి నిర్వహణ విధానాలను అందరూ పాటించాలని సూచించారు. ప్రభుత్వం.. ప్రజలు కలిసి పనిచేస్తేనే ఫలితాలు సాధ్యమన్నారు. తమిళనాడుకు చెందిన సీతారాం జపాన్‌ రాజధాని టోక్యోలో స్థిరపడ్డారు. అనంతపురంలో సత్యసాయి తాగునీటి పథకంపై అధ్యయనం చేశారు. అనేక రంగాల్లో పరిశోధనలు చేసిన ఆయన హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా.. నీటి సంరక్షణ విధానాలు, లోపాలు, అనుసరించాల్సిన మార్గాలు, వనరుల నిర్వహణపై ‘ఈనాడు’ ముఖాముఖిలో అభిప్రాయాలను పంచుకున్నారు. 
మానవాళి ముందున్న సవాళ్లలో తాగునీరూ ఒకటి? దీనికి పరిష్కారం ఏంటి? 
బతకాలంటే నీళ్లు కావాలి. మన దేశంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. భూగర్భ జలం ఆవిరైపోతోంది. ప్రపంచంలో చాలా దేశాల్లోనూ నీటి సమస్య ఉంది. సింగపూర్‌ కూడా తొలుత నీటి కోసం మనీలాపై ఆధారపడింది. వాననీటిని ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థల ద్వారా జలాశయాలకు తరలించి అవసరాలు తీర్చుకుంటోంది. మన నగరాల్లోనూ వాన నీటిని నిల్వ చేసుకోవడం, వినియోగాన్ని పెంచడంపై దృష్టిసారించాలి. ఇదొక్కటే పరిష్కార మార్గం. 
తాగునీటికి ఆర్‌ఓ కేంద్రాలవైపే ప్రజలు చూస్తున్నారు కదా? 
ఇప్పుడు జలం వ్యాపారమైపోయింది. ఎక్కడ చూసినా ఆర్‌ఓ కేంద్రాలే కనిపిస్తున్నాయి. డబ్బా నీళ్లు అత్యంత ప్రమాదకరం. ఆ నీళ్లలో ఖనిజలవణాలు పూర్తిగా తొలగిస్తారు. రూ.15తో కిలో లీటర్‌ (వెయ్యి లీటర్లు) సాధారణ నీటిని శుద్ధిచేయొచ్చు. సముద్ర నీటి శుద్ధికి రూ.200 వరకు ఖర్చు అవుతుంది. ఫిలిప్పీన్స్‌లో కిలో లీటర్‌ను రూ.15కే అందిస్తున్నారు. మన వద్ద ప్రస్తుతం 20 లీటర్ల డబ్బా నీళ్లకు రూ.25 దాకా చెల్లించి డబ్బును వృథా చేసుకుంటున్నారు. 
ఇష్టారీతిన జరుగుతున్న భూగర్భ జలాల తోడకాన్ని ఎలా నియంత్రించాలి? 
బోరు వేసుకుని తోడుకుంటాం మా ఇష్టం అనే పద్ధతి పోవాలి. దీన్ని తప్పకుండా క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే బోర్లు తవ్వేలా పద్ధతులు రావాలి. సామూహికంగా బోర్లు వినియోగించేలా చూడాలి. ఎడాపెడా నీటిని తోడితే భవిష్యత్తుకు వనరులేవీ ఉండవు. ఇతర దేశాల్లో బోర్లు వేయడం, నిర్వహణ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. 
నీటి వనరుల సంరక్షణ, వినియోగం సక్రమంగా ఉండాలంటే ఏం చేయాలి? 
ఇతర దేశాల్లో మాదిరిగా ప్రజలు, పాలకులు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి. చిన్నచిన్న సమూహాలుగా కలిసి నీటి పొదుపు, సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తే అయ్యే వ్యయాన్ని ప్రజల నుంచి తీసుకోవాలి. 
చాలా చోట్ల నీటికి డబ్బులు చెల్లించేందుకు ప్రజలు ముందుకు రారన్న ప్రచారం ఉంది కదా? 
మొబైల్‌ ఫోన్‌ సేవలు సక్రమంగా ఉండబట్టే డబ్బులు వేసుకుని మరీ వినియోగిస్తున్నాం కదా. అదే తీరులో నీటి సరఫరాపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి. శుద్ధి చేసిన నీటితో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందనే విశ్వాసం ప్రజల్లో కలగాలి. అవసరమైతే ప్రైవేటు భాగస్వామ్యంతో సేవలు అందించే ఏర్పాట్లు చేయాలి. దీంతో నీటి వృథా కూడా తగ్గుతుంది. డబ్బులు చెల్లిస్తారు కాబట్టి అవసరం వరకే వినియోగిస్తారు. 
నీటి సంరక్షణకు ఏయే మార్గాలు అనుసరణీయం? 
జపాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, కాంబోడియా, సింగపూర్‌ తదితర దేశాల్లో మేలైన పద్ధతులు అమల్లో ఉన్నాయి. వాన నీటిని జలాశయాలకు తరలించి తిరిగి శుద్ధిచేసి సరఫరా చేయొచ్చు. దీనికోసం ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి. హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాల్లో నీటి అవసరాలు తీరాలంటే ప్రత్యేక వ్యవస్థ అవసరం. వాన నీరు ఎక్కడికక్కడ భూగర్భంలో ఇంకేలా చేయాలి. వ్యక్తిగతంగా ప్రజలు గృహాలపైనా, పార్కింగ్‌ ప్రాంతాల్లో నిల్వ చేసుకుని వినియోగించుకోవచ్చు. 
జల కాలుష్యాన్ని ఎలా అరికట్టాలి? 
నీటి వనరులు కలుషితమైపోతున్నాయి. డ్రైనేజీ నీళ్లతో చెరువులను నింపుతున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే నీరు, రసాయనాలను భూగర్భంలోకి పంపిస్తున్నారు. వీటిని రీసైక్లింగ్‌ చేసేలా చూడాలి. వరంగల్‌ జిల్లాలో ఒక చెరువు కాలుష్యమవుతుండటాన్ని గుర్తించి చర్యలు చేపడుతున్నారు. ఇలా అన్నిచోట్లా గుర్తించి చర్యలు తీసుకోవాలి. నీటి అవసరాలు, శుద్ధి చేస్తున్న తీరును పాఠశాలల్లో విద్యార్థులకు చూపించి అవగాహన పెంచాలి. 
మిషన్‌ భగీరథ పథకం ఎలా ఉందంటారు? 
ఈ పథకంపై నేను అధ్యయనం చేయలేదు. అయినా, ప్రభుత్వమే ప్రజలకు శుద్ధి చేసి తాగునీటిని అందిస్తే అంతకన్నా మంచి పని ఏముంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.