close

ప్ర‌త్యేక క‌థ‌నం

కస్సు బుస్‌..స్‌..

పొలాల నుంచి జనావాసాల్లోకి పాములు 
చెదురుతున్న పుట్టలే కారణం 
వ్యవసాయ పనులతో మొదలైన కాట్లు 
డెల్టాలో నమోదవుతున్న ఘటనలు

పాము కాట్ల సంఖ్య పెరుగుతోంది. పొలం పనులు మొదలు కావడంతో ఆవాసాన్ని కోల్పోతున్న పాములు జనంలోకి వస్తున్నాయి.  కృష్ణా జిల్లాలో బుధవారం ఒక్క రోజే ఎనిమిది మంది పాము కాటుకు గురయ్యారు. వీరిలో ఇద్దరు చనిపోయారు. ఈ ఏడాది నెలన్నరలోనే జిల్లాలో సుమారు వంద మందిని పాములు కాటేశాయి. సాగు భూమి విస్తరణ, ఎలుకల సంఖ్య పెరగడం, పాముల ఆవాసాలు కనుమరుగుకావడం, పరిశుభ్రత కొరవడటం తదితర కారణాలు పాములు మైదాన ప్రాంతాల్లోనూ బుస కొట్టేలా చేస్తున్నాయి.

పాములు పెరగడానికి కారణాలివీ.. 
గుట్టలనూ చదును చేసి పంట పొలాలుగా మారుస్తున్నారు. కోస్తా ప్రాంతంలో విచ్చలవిడిగా చేపడుతున్న ఆక్వా సాగు వల్ల కూడా పాముల సహజ ఆవాస ప్రాంతాలు క్రమేణా తగ్గుతున్నాయి. 
 

 

వ్యవసాయీకరణ నేపథ్యంలో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగింది. ధాన్యం గింజలను ఎలుకలు కలుగుల్లో దాచుకుంటాయి. వీటిని వెతుక్కుంటూ పాములు పొలాల్లోకి వస్తున్నాయి. 
 

 

లోగడ వర్షాలకు ముందే పొలాన్ని దున్ని విత్తేందుకు రైతులు సిద్ధం చేసేవారు. ప్రస్తుతం కాలువలకు నీరొచ్చినప్పుడే పొలాలకు నీరు పెట్టి దమ్ము చేస్తున్నారు. ఆ తరువాత విత్తనాలు వేస్తున్నారు. పొలాన్ని దున్నితే కలుగుల్లోని ఎలుకలు బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీని వల్ల పాముల బెడద కూడా తగ్గుతుంది. ఒకేసారి దమ్ము చేసి నీరు పెట్టడం వల్ల కలుగుల్లోకి నీరు వెళ్లి ఎలుకలు, వాటి వెంట పాములు బయటకు వచ్చేస్తున్నాయి. రైతులందరూ పొలాలకు ఒకేసారి నీరు పెట్టుకోవడం కూడా ఈ సమస్య పెరగడానికి కారణమవుతోంది.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గణాంకాలు 
నాలుగేళ్లలో 83,812 పాముకాటు కేసులు నమోదయ్యాయి. 
ఏపీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ప్రకారం.. 822 మంది మృత్యువాత పడ్డారు. 
వీటిలో కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లోనే ఎక్కువ. 

 

89 శాతం కాట్లు కాళ్లు, చేతులపైనే ఉంటున్నాయి. సాయంత్రం నాల్గింటి నుంచి ఏడింటి మధ్యే ఎక్కువ మంది కాటుకు గురయ్యారు. 
 

 

 

ఎక్కువగా 31 నుంచి 40 ఏళ్లలోపు వారే బాధితులు. 
2018 ఖరీఫ్‌లో పాము కాట్లు ఎక్కువగా కృష్ణా జిల్లాలో ఉన్నాయి. గతేడాది రోజుకు పది మంది వరకు పాముకాటుకు గురయ్యారు. వెయ్యి మందినిపైగా కాటేశాయి. వీరిలో 400 మందికి విషసర్పాలు కాటేసినట్లు గుర్తించారు. 15మంది వరకు చనిపోయారు. 
ఒక్క అవనిగడ్డ ఆసుపత్రికి వచ్చిన కేసులే 670 వరకున్నాయి. ఈ ఏడాది అప్పుడే కృష్ణా జిల్లాలో పాము కాట్లు మొదలయ్యాయి.

 

జూన్‌, జులైలోనే అధికం 
మన దేశంలో దాదాపు 300 పాము జాతులున్నాయి. చాలా వరకు విషరహితమైనవే. కేవలం నాగుపాము, రక్తపింజరి, చిన్నపింజరి, కట్లపాము మాత్రమే విషపూరితమైనవి. మిగిలినవి కరిచినా ప్రాణాపాయం ఉండదు. సాధారణంగా పాములు తమకు ఆపద ఎదురైనప్పుడే ప్రాణరక్షణ కోసమే కాటేస్తాయి. జూన్‌, జులైలలో వీటి బెడద మరీ ఎక్కువ. ప్రభుత్వాసుపత్రుల్లో యాంటీ స్నేక్‌ వినోమ్‌ మందును తగినంతగా నిల్వ ఉంచడం ఈ సీజన్లో తప్పనిసరి.

 

విచక్షణరహితంగా చంపితే అనర్థాలు 
అన్ని సర్పాలు విషపూరితమైనవి కావు. వీటిని హానికరమైనవిగా భావించి పల్లెల్లో విచక్షణరహితంగా చంపేస్తున్నారు. దీని వల్ల మేలు కంటే కీడే ఎక్కువ. పాములు ఏడాదిలో దాదాపు 300 ఎలుకలను తింటాయి. కాటుకు కేవలం యాంటీ స్నేక్‌ వినోమ్‌తోనే ఫలితం కనిపిస్తుంది.

- మూర్తి కంటిమహంతి, పర్యావరణవేత్త, ఈస్టర్న్‌ ఘాట్స్‌ వైల్డ్‌లైఫ్‌ సొసైటీ, విశాఖపట్నం

 

అటవీశాఖ వినూత్న ఆలోచన 
పాముల బెడదను ఎదుర్కొనేందుకు గతేడాది కృష్ణా జిల్లా అటవీశాఖ పలు చర్యలు ప్రారంభించింది. డెల్టా ప్రాంతంలో పలుచోట్ల వైద్య ఆరోగ్య, వ్యవసాయ శాఖలతో కలసి అవగాహన సదస్సులు నిర్వహించింది. పాము కాటేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్యంపై అవగాహన కల్పించింది. ఈ ఏడాది కొత్తగా ‘స్నేక్‌ గార్డ్స్‌’ ఇవ్వాలని తలపోస్తోంది. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు కృష్ణా డీఎఫ్‌వో రామచంద్రరావు ‘ఈనాడు’కు చెప్పారు. దీని ఖరీదు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఇలాంటి పరికరాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. వీటిని మన అవసరాలకు తగ్గట్టు మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. పొలం పనులు చేసుకునే సమయంలో దీన్ని పాతితే 15 నుంచి 20 మీటర్ల పరిధిలో ప్రకంపనలు వస్తాయి. ఇది సౌరశక్తితో ఛార్జీ అవుతుంది. పాములు ప్రకంపనలు పసిగట్టి ఆ ప్రాంతానికి రావు.

- ఈనాడు, విజయవాడ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.