close

ప్ర‌త్యేక క‌థ‌నం

తాటిచెట్లూ ఎండిపోయాయ్‌..

 

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కరవు ఛాయలు కనిపిస్తున్నాయి. నేలలో తేమ లేక.. తాటి చెట్లు కూడా నిలువునా ఎండిపోతున్నాయి. సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో చెట్లు ఎండిపోవడంతో రైతులు వాటిని నరికేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగి భూగర్భ జలాలు తగ్గిపోయినప్పుడు తాటి చెట్టులోని మొగి ఎండిపోతుందని ఉద్యాన విశ్వవిద్యాలయ మాజీ శాస్త్రవేత్త రావి చంద్రశేఖర్‌రావు తెలిపారు. తాటిచెట్లు ఎండిపోవడంతో గీత వృత్తిని నమ్ముకున్న గౌడన్నలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


ఇరుసు విరిగిన ఉపాధి చక్రం 
వర్షాలు లేక వట్టిపోయిన నీటి వనరులు 
వ్యవసాయ పనులు లేక అల్లాడుతున్న గ్రామీణులు 
అరకొర పనులకు పోటీ పడుతున్న కూలీలు 
భారీగా తగ్గిన ఎరువుల అమ్మకాలు 
కన్నీరు పెడుతున్న కౌలు రైతు 
రుణాలకు రైతులు ముందుకు రావట్లేదంటున్న బ్యాంకర్లు 
ఉత్తర, దక్షిణ తెలంగాణల నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధులు

పల్లె కన్నీరు పెడుతోంది. వానలు లేక సాగు బండి సడుగులు ఇరిగింది. కినుక వహించిన చినుకు నేలను పొక్కిలిగా మార్చుతోంది. విత్తుల జాడ కనిపించకపోగా.. అప్పుతో సాగు మొదలెట్టిన కౌలు రైతు బావురుమంటున్నాడు. నేలలో తేమ తక్కువై తాటి వనాలు ఎండిపోతుండగా కల్లు దిగుబడి తగ్గి గౌడన్నలు దిగాలు పడుతున్నారు. దుక్కులు చదును చేసి దున్నే ట్రాక్టర్లకు గిరాకీ లేదు. రుణాలంటూ దూర సందు లేకుండా ఉండే బ్యాంకులు వెలవెలబోతున్నాయి. ప్రకృతి గీసిన కరవు చిత్రంలో వ్యవసాయ అనుబంధ రంగాలు తేలిపోతున్నాయి. 


సన్నబియ్యం సాంబ మసూరి వరి విత్తనాలను రాయితీపై అమ్మేందుకు 60 వేల క్వింటాళ్లు  సిద్ధం చేయగా 30 వేల క్వింటాళ్లే అమ్మినట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ(టీఎస్‌ సీడ్స్‌) వెల్లడించింది.

నాలుగెకరాలున్నా.. ప్రయోజనం లేదు

తని పేరు వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామం. నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది రూ.లక్ష ఖర్చు చేసి వరి పంట వేసినప్పటికి వర్షాలు పడకపోవడంతో పెట్టుబడి నష్టపోయారు. ఈ ఏడాది కూడా వర్షాల్లేకపోవడంతో పంట వేయడానికి జంకుతున్నారు. మరో 15 రోజులు చూసి కూలి పనికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు.

కదలని ఎరువులు 

వికారాబాద్‌ జిల్లా పరిగి సహకార మార్కెటింగ్‌ సొసైటీ విక్రయ కేంద్రంలో వందలాది బస్తాల యూరియాతో పాటు ఇతర ఎరువులు అలాగే ఉన్నాయి. ఏటా జులైలో యూరియా కోసం రోజూ వందలమంది రైతులు వచ్చేవారు. ఇప్పుడు అడిగేవారేలేరు.

- వెంకటేశం, అమ్మకందారు

కౌలు డబ్బైనా వచ్చేనా..

కరంన్నర చెలక రూ.13 వేలకు కౌలుకు తీసుకుని పత్తి పెట్టాం. ట్రాక్టర్‌తో దున్నడానికి రూ.6 వేలు ఖర్చయ్యాయి. కొన్ని మొలకలు రాగా.. మధ్యలో కొన్ని మాడిపోయాయి. అక్కడ మళ్లీ నాటాం. కలుపు పెరుగుతున్నా.. మొక్కలు ఎదగడం లేదు. కౌలు మొత్తమైనా దక్కుతుందన్న నమ్మకం పోతోంది. 

- బాణోత్‌ రమేశ్‌, సుజాత, మోతె, సూర్యాపేట జిల్లా 

ఎన్ని చెట్లు ఎక్కాలి

నేను గీతవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నా.. వర్షాలు లేకపోవడంతో నేలలో తేమ తగ్గిపోయింది. ఆరు సీసాల కల్లు ఇచ్చే చెట్టు రెండు సీసాలకే పరిమితమవుతోంది. అరవై ఏళ్ల వయస్సులో నేను ఎన్ని చెట్లు ఎక్కగలను. కల్లు అమ్మకపోతే బతికేదెట్లా. మా గ్రామంలో నలభై మందిది ఇలాంటి దుస్థితే.

-కృష్ణయ్య గౌడ్‌ లింగోజిగూడెం చౌటుప్పల్‌ మండలం

40 ట్రాక్టర్లకు పనిలేకుండా పోయింది

కరా పొలం దున్నితే తక్కువలో తక్కువ రూ.750 వస్తాయి. రెండేళ్ల కాలంలో చేసిన అప్పు తీర్చొచ్చని రూ.6 లక్షలతో రెండో చెయ్యి మారిన ట్రాక్టర్‌ను కొన్నాను. వర్షాలు లేకపోవడంతో ఒక్క కిరాయి రావడం లేదు. మా మండలంలో 40  ట్రాక్టర్లు ఉన్నాయి. ఎవరికీ పనుల్లేవు. డ్రైవర్లకు జీతాలిచ్చే పరిస్థితి లేదు.

-సతీష్‌, లింగోజిగూడెం, చౌటుప్పల్‌

కళ తప్పిన గ్రామీణ బ్యాంకు

రైతులతో కిటకిటలాడాల్సిన కూసుమంచిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ శాఖ వెలవెలబోతోంది. ఏటా ఏడు వేల మంది సభ్యులకు రుణాలిచ్చే ఈ శాఖలో ఈ ఏడాది ఇప్పటివరకు పది శాతం మాత్రమే రుణాలిచ్చారంటే సాగు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వానలు లేక రైతులెవ్వరూ అప్పు తీసుకునేందుకు రావడంలేదని బ్యాంకు మేనేజర్‌ రవికుమార్‌ పేర్కొన్నారు. 
ప్రధాన ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు లేక వాటి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో పాటు అనుబంధంగా అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల పథకాల ఆధారంగా 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందాలి. ప్రాజెక్టులో నీళ్లు డెడ్‌ స్టోరేజికి చేరాయి. నిజాంసాగర్‌ కింద 2.35 లక్షల ఎకరాలు... ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో శ్రీరాంసాగర్‌, ఇతర ప్రాజెక్టుల కింద ఖరీఫ్‌లో 1.20 లక్షల ఎకరాలకు ఆయకట్టు.. ఇలా ఎక్కడా సాగు ప్రారంభం కాలేదు.

వృద్ధులు సైతం కూలి పనులకు

 చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ మహిళలంతా మహబూబ్‌నగర్‌ జిల్లా చంద్రాస్‌పల్లి గ్రామానికి చెందినవారు. వీరికి ఒక్కొక్కరికి మూడు నుంచి ఆరెకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఇక్కడి ఊర చెరువు ఎండిపోయింది. దీంతో కుటుంబ పోషణకు కేవలం 100 రూపాయల కూలి కోసం పనులకు వెళుతున్నారు.

చిట్టి చేతులూ పొలం పనికి

పాఠశాలకెళ్లాల్సిన పిల్లలు పొలంలో విత్తనాలు చల్లుతున్న కూలీలతో కలిసి ఎరువు చల్లుతున్నారు. మండుటెండలో మొక్కజొన్న సాగుకు సాయం చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం లింగంపల్లి తండా శివారులోనిదీ దృశ్యం. కూలీలకు సొమ్ము చెల్లించలేక పిల్లల్ని పనులకు తీసుకొచ్చినట్లు వారి తల్లిదండ్రులు చెప్పారు.

తగ్గనున్న దిగుబడి

ర్షాలు లేకపోవడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఆలస్యంగా విత్తనాలు, నారు పోయడం, వర్షాలు లేక మొలిచిన మొక్కలు వాడుతున్నందున దిగుబడి 10 శాతం వరకూ తగ్గే అవకాశాలున్నాయి. ఈ నెలాఖరుకు వర్షాలు లేకపోతే పలు పైర్ల ఎదుగుదల తగ్గుతుంది. సోయాచిక్కుడు, మినుము, పెసర పంటల సాగు కాలం పూర్తయింది. ఇకనుంచీ  రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్లడం మంచిది.
-డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధన సంచాలకుడు, జయశంకర్‌ వర్సిటీ

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.