close

ప్ర‌త్యేక క‌థ‌నం

స్వచ్ఛత బాట.. అప్పుల మూట 

మరుగుదొడ్డి లేకుంటే పింఛను, బియ్యం ఆపేస్తాం 
కొన్నిచోట్ల అధికారుల హెచ్చరికలతో బడుగుజీవుల హైరానా 
వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణం 
10 నెలల్లో 13 లక్షల నిర్మాణాలు పూర్తి 
బిల్లులు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న  అధికారులు 
బకాయిలు రూ.300 కోట్లపైనే 

స్వచ్ఛత బాట.. అప్పుల మూట 

ఈనాడు- హైదరాబాద్‌ : మరుగుదొడ్డి కట్టుకోవాల్సిందే.. లేదంటే రేషను బియ్యం రావు, పింఛను ఆపేస్తాం.. ఇవీ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల క్షేత్రస్థాయి అధికారుల హెచ్చరికలు. దీంతో బడుగుజీవులు అప్పు చేసి మరీ మరుగుదొడ్లు కట్టుకుంటున్నారు. తీరా కట్టాక నెలలు గడిచినా ప్రభుత్వం నుంచి సొమ్ము రావడం లేదని పలు గ్రామాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్నవారికి సకాలంలో సొమ్ము అందేలా చూడాల్సిన అధికారులు.. లక్ష్యాలు పూర్తిచేశామని నివేదికలు పంపుకోవడమే తప్ప బడుగుజీవుల ఘోషను పట్టించుకోవటం లేదు. ఉపాధి హామీ పథకాన్ని పక్కనపెట్టి.. నిర్మాణ బాధ్యతలను పూర్తిగా స్వచ్ఛభారత్‌ మిషన్‌కే అప్పగించిన సమయంలో దాదాపు లక్ష మందికి సాంకేతిక సమస్యలు ఉత్పన్నమై వారికి బిల్లులు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కొన్నిచోట్ల నిధులు వెళ్లినా గుత్తేదార్లు, క్షేత్రస్థాయి సిబ్బంది పంచుకు తినేస్తున్నారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ‘ఈనాడు’ ప్రతినిధి వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకొన్నారు.
తెలంగాణలో 2018 డిసెంబరు నెలాఖరు నాటికి అన్ని గ్రామీణ కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేసి, రాష్ట్రాన్ని సంపూర్ణ ఆరుబయలు మలవిసర్జన రహితమని ప్రకటించాలనేది ప్రభుత్వ సంకల్పం. రాష్ట్రంలో 2012లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే ప్రకారం మొత్తం 44.84 లక్షల గ్రామీణ కుటుంబాలున్నాయి. వాటిలో అప్పటికి 11.58 లక్షల కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్‌ మిషన్‌ల ద్వారా నిధులు మంజూరు చేస్తుండటంతో 2013-14 నుంచి 2016- 17 వరకు మరో 9.60 లక్షల మరుగుదొడ్లు ఏర్పాటయ్యాయి. వీటిలో 5 లక్షలు 2016-17లోనే నిర్మించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 13 లక్షల మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామాల్లో ఇప్పుడు 36 లక్షల మరుగుదొడ్లు ఉండగా ఈ ఏడాది డిసెంబరు నాటికి మిగిలిన 8 లక్షలు కూడా నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పం.

ఉరుకులు పరుగులు 
స్వచ్ఛభారత్‌ కార్యక్రమం 2014లో అమల్లోకి వచ్చింది. మొదట్లో పెద్దగా పట్టించుకోని అధికారులు.. గడువు సమీపిస్తుండటంతో ఇప్పుడు హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అధికారులు ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని.. లేకపోతే రేషన్‌ బియ్యం, పింఛను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి మరుగుదొడ్డికి రూ.12 వేల చొప్పున వస్తుందని సర్పంచులు చెబుతుండటంతో వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ మరుగుదొడ్లు కట్టుకుంటున్నారు. చాలాచోట్ల సర్పంచులు, వార్డు సభ్యులు లేదా వారి సంబంధీకులే గుత్తేదార్లుగా మారి.. బడుగు జీవులు అప్పు తెచ్చిన డబ్బులు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. పలుచోట్ల వీటిలో నాణ్యత లోపిస్తుంటే, మరికొన్ని చోట్ల అసంపూర్తిగా వదిలేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.12 వేలకు మరుగుదొడ్డి పూర్తికాదంటూ అదనంగా రూ.3వేల చొప్పున వసూలు చేసినవాళ్లూ ఉన్నారు. కొంత మంది మేస్త్రిని నియమించుకొని సొంతంగానూ కట్టించుకున్నారు. మరికొన్ని చోట్ల కలెక్టర్లే నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారు.

వలస వెళ్లిన చోట అప్పులు తెచ్చి.. 
ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వ్యక్తుల్లో చాలామందికి రేషన్‌ కార్డులు స్వగ్రామంలోనే ఉంటున్నాయి. మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే రేషన్‌ కార్డు రద్దు చేస్తారేమోమన్న భయంతో.. వలసవెళ్లిన వారు కూడా అప్పులు తెచ్చి మరీ సొంతూరిలో మరుగుదొడ్లు నిర్మించుకుంటున్నారు. 
* సంగారెడ్డి జిల్లా పెద్ద శంకరంపేట మండలం నారాయణపల్లిలో ప్రతి ఇంటి ముందు మరుగుదొడ్డి కనిపిస్తోంది. అక్కడ ఏ ఇంటికి వెళ్లినా డబ్బులు రాలేదన్న ఆవేదనే. తంబియార్‌ సంగమ్మ అనే వృద్ధురాలి కొడుకు, కోడలు భవన నిర్మాణ పనులకు హైదరాబాద్‌ వలసపోయారు. సంగమ్మ ఒక్కరే నారాయణపల్లిలో ఉంటోంది. మరుగుదొడ్డి లేకుంటే పింఛను ఆపేస్తారేమెనన్న భయంతో ఆమె కుమారుడు ఆర్నెల్ల క్రితం నూటికి నెలకు రూ.3 వడ్డీకి అప్పు తెచ్చి కట్టించాడు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి సొమ్ము అందలేదు.

ఉపాధి హామీ సొమ్ము ఇచ్చేదెప్పుడు?
ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినవాటికి సంబంధించి బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 లక్షల మరుగుదొడ్లలో.. వ్యక్తిగతంగా నిర్మించుకొన్నవి మినహాయించి మిగతా వాటికి రూ.588 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని, ఇంతవరకు రూ.550 కోట్లు చెల్లించామని అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకంతో సహా పాత బకాయిలు మరో రూ.300 కోట్లు ఉన్నట్లు చెబుతున్నారు. స్వచ్ఛభారత్‌ ద్వారా నిధులు లబ్ధిదారులకు కాకుండా గ్రామ పారిశుద్ధ్య కమిటీలకు వెళుతుండడంతో పలుచోట్ల నిధుల మేతకు ఆస్కారం ఏర్పడుతోంది.

* వరంగల్‌ జిల్లా సంగం గలిచర్లలో బేరోజు నారాయణ ఏడాదిన్నర క్రితం మరుగుదొడ్డి నిర్మించుకున్నా నేటికీ సొమ్ము అందలేదు. ఇదే గ్రామానికి చెందిన సంపత్‌ తనకు రావాల్సిన రూ.12 వేల కోసం రెండు నెలల పాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. అప్పు తీర్చడానికి మళ్లీ సూరత్‌కు వలసపోయాడు. 
* గలిచర్లలో మల్లికాంబది మరో రకం వ్యథ. ఈమె ఖాతాలో మూడేళ్ల క్రితం మరుగుదొడ్డి నిర్మాణం కోసం రూ.12 వేలు జమయ్యాయి. వాటికి మరో రూ.2 వేలు కలిపి గ్రామంలో గుత్తేదారుకు ఇస్తే అతను మరుగుదొడ్డి సగం కట్టి మధ్యలో వదిలేశాడు. మరుగుదొడ్డి పూర్తికాకపోతే రేషన్‌ ఇవ్వబోమన్న అధికారుల హెచ్చరికలతో మల్లికాంబ కలవరపడుతోంది. 
* కొంత మంది మరుగుదొడ్డి పరిమాణాన్ని పెంచి స్నానాల గదిని కూడా నిర్మించుకొని దాదాపు రూ.20 వేల వరకు అప్పులపాలయ్యారు. 
* భర్త అకాలమరణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అనుమల్ల నిర్మల అప్పు చేసి మరుగుదొడ్డి కట్టించుకున్నారు. ఆమెకూ ఇంతవరకు సొమ్ము అందలేదు. 
* నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాచ్యాతండాకు చెందిన లావూరి నీల మరుగుదొడ్డి నిర్మించుకుని రెండున్నరేళ్లు దాటినా పైసా రాలేదు.

ఆ లక్ష మందికి ఇక సొమ్ము రానట్టేనా?
రాష్ట్రంలో మరుగుదొడ్లు నిర్మించుకొన్నవారికి రూ.300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల వరకు ఉపాధి హామీ పథకం కింద కూడా మరుగుదొడ్లు నిర్మించేవారు. కొద్ది నెలలుగా కేవలం స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కింద మాత్రమే వాటిని చేపడుతున్నారు. ఇలా స్వచ్ఛభారత్‌కు మారే సమయంలో జిల్లాల్లో అధికారుల ఒత్తిడితో నిర్మాణాలు చేపట్టినవారికి ఇప్పుడు సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వారికి ఉపాధి హామీ పథకం నిధులు ఇవ్వటానికి సాధ్యం కాని పరిస్థితి. స్వచ్ఛభారత్‌ ద్వారా ఇవ్వాలంటే ముందే మంజూరు చేయాలి. ఇలా దాదాపు లక్షకుపైగా మరుగుదొడ్లకు సాంకేతిక సమస్యలతో నిధులు రావడం అనుమానంగా మారినట్లు అధికారిక సమాచారం. వీరిలో ఎంతమందికి సొమ్ము అందుతుందో దైవాధీనమే.

రూ.18వేలు అప్పు చేశా
వార్డు సభ్యుడు చాలా రోజుల క్రితం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి సగం గోడల వరకు కట్టి నిలిపివేశాడు. రంధ్రాలన్నీ పూడుకుపోయాయి.ఎన్నిసార్లు అడిగినా పూర్తి చేయలేదు. చెల్లి పెళ్లి ఉండటంతో నేనే అప్పు చేసి పూర్తి చేసుకొన్నాను. రూ.18 వేలు ఖర్చయ్యింది.
- గుండు రాము, గలిచర్ల, వరంగల్‌ జిల్లా

ఏడాదిన్నరగా వస్తాయనే అంటున్నారు
ఏడాదిన్నర కాలంగా డబ్బులు వస్తాయనే చెబుతున్నారు. అప్పు చేసి మరుగుదొడ్డి కట్టాను. మాలాంటోళ్ల కష్టాల్ని అధికారులు పట్టించుకోవాలి.
- నారాయణ, సోమలక్ష్మి, వరంగల్‌ జిల్లా

వడ్డీ పెరిగిపోతోంది
మరుగుదొడ్డి కట్టినా పైసలు రావటం లేదు. మరోపక్క వడ్డీ పెరిగిపోతోంది. ఇంత సొమ్ము ఎలా కట్టాలో తెలియడం లేదు.
- సంగమ్మ, నారాయణపల్లి, సంగారెడ్డి జిల్లా

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.