close

ప్ర‌త్యేక క‌థ‌నం

‘టిస్‌’ వివాదంపై ఉత్కంఠ

కొనసాగుతున్న విద్యార్థుల నిరవధిక దీక్ష
హాస్టల్‌ వసతిపై ఎటూ తేలని వైనం

ఈనాడు, హైదరాబాద్‌: న్యూస్‌టుడే, తుర్కయాంజాల్‌: ప్రతిష్ఠాత్మక టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌)లో రేగిన దుమారం ఏమలుపు తిరుగుతుందోనన్నది చర్చనీయాంశమైంది. అకడమిక్‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో వివాదం ముదిరింది. తాజాగా విద్యార్థులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం.. యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడం.. సోమవారం వాదనలు ఉండటంతో ఏం జరగబోతోందనన్న ఉత్కంఠ నెలకొంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల హాస్టల్‌ ఫీజుల విషయంలో మొదలైన వివాదం విద్యార్థుల నిరవధిక ఆందోళనకు దారి తీసింది. దీంతో యాజమాన్యం పలు ప్రయత్నాలు చేసి.. చివరికి పరిస్థితి చక్కబడేవరకు అకడమిక్‌ కార్యకలాపాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు విద్యార్థుల నిరవధిక దీక్ష కొనసాగుతోంది. ప్రస్తుతం 480 మంది బీఏ, ఎంఏ, పీహెచ్‌డీ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి  నాన్‌ రెసిడెన్షియల్‌గా ప్రకటించి హాస్టల్‌ వసతితో సంబంధం లేదని టిస్‌ ప్రకటించింది. జూన్‌ 24న రాగన్నగూడ గ్రామ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాల భవనంలోకి తరగతులు మార్చింది. గతంలో రాజేంద్రనగర్‌లో మంచి సదుపాయాలున్న హాస్టల్‌ వసతి కోసం నెలకు రూ.8200 కట్టేవారమని, కొత్తభవనంలో వసతులు అంతంతమాత్రంగా ఉన్నా రూ.9వేలు అడుగుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో నెల వారీగా చెల్లింపులు ఉండగా ఈసారి దాన్ని సెమిస్టర్‌ వారీగా చెల్లించాలంటున్నారని, దీంతో ఒకేసారి రూ.54 వేలు చెల్లించాల్సి వస్తుందని వారు చెబుతున్నారు. ఫీజు చెల్లించలేదని నలుగురు విద్యార్థినులను జులై 8న రాత్రి బయటకు పంపించారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకారవేతనాలు-హాస్టల్‌ ఛార్జీల మధ్య వ్యత్యాసం భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై 11వ తేదీ నుంచి విద్యార్థులు నిరవధిక దీక్షకు దిగి ఆందోళన చేపడుతున్నారు.

స్పందిస్తున్నా...
విద్యార్థుల డిమాండ్లకు అనుగుణంగా స్పందిస్తున్నప్పటికీ కొందరు ఆందోళనల ద్వారా తరగతులను అడ్డుకుంటున్నారని, అందుకే క్యాంపస్‌ను బంద్‌ పెట్టినట్లు యాజమాన్యం చెబుతోంది. ఈ నెల 8న 35 మంది విద్యార్థులు టిస్‌ గేటు ఎదుట నిరసన తెలపగా.. వెంటనే ఇన్‌ఛార్జి డిప్యూటీ డైరెక్టర్‌ ప్రొ.వింధ్య నేతృత్వంలో ఫ్యాకల్టీ, విద్యార్థి నేతలతో సమావేశమైనట్లు వివరించారు. మేనేజ్‌మెంట్‌ కమిటీ ద్వారా కూడా చర్చలు జరిపినట్లు తెలిపారు. కేంద్రం నుంచి ఉపకారవేతనాలు అందుకుంటున్న విద్యార్థులకు టిస్‌ తరఫున సహాయం చేస్తున్నట్లు చెప్పారు. 2018-19లో రూ.35 లక్షలను కేటాయించినట్లు టిస్‌ డైరెక్టర్‌ షాలినీభారత్‌ తెలిపారు. 2019 నుంచి టిస్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ను నాన్‌ రెసిడెన్షియల్‌గా ప్రకటించినందున ప్రైవేటు హాస్టల్‌ నిర్వాహకులతో ఎలాంటి ఎంవోయూ చేసుకోలేకపోయామని చెప్పారు. అందుకే విద్యార్థులే సొంతంగా తమకు నచ్చిన హాస్టల్‌ లేదా వసతిని ఎంచుకోవచ్చని తెలిపారు. చెల్లింపు విధానం ఒకేసారి చేయడం వెనుక గతంలో హాస్టల్‌ నిర్వాహకులకు బిల్లులు పెండింగు ఉండటమే కారణమని వివరించారు.

నేడు కోర్టులో వాదనలు
సమస్యను పరిష్కరించకుండా అకడమిక్‌ కార్యకలాపాలను నిలిపివేయడంపై ఇప్పటికే విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి టిస్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సోమవారం వాదనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విద్యార్థి నేతలు చెబుతున్నారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.