close

ప్ర‌త్యేక క‌థ‌నం

సాహసమే ఊపిరి

అతడిలోని ప్రతి అణువూ సాహసంతో మూర్తీభవించి ఉంటుంది. ప్రతి శ్వాసా.. అనితరసాధ్యమైన పనుల కోసం తపిస్తుంటుంది. అతడి గుండె చప్పుడూ..  భయమనే మాటను చెల్లాచెదురు చేస్తుంది. ఆయనే  సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌. ఆగస్టు 12న డిస్కవరీ   ఛానల్‌లో ప్రసారమయ్యే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ ప్రత్యేక ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి ఆయన హల్‌చల్‌చేసిన టీజర్లు ఇప్పుడు భారత్‌లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. 
బేర్‌ గ్రిల్స్‌ 1974లో ఇంగ్లండ్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు ఎడ్వర్డ్‌ మైఖేల్‌ గ్రిల్స్‌. ‘బేర్‌’ అనేది ఆయన ముద్దు పేరు. వారం రోజుల పసికందుగా ఉన్నప్పుడే గ్రిల్స్‌ అక్క ఈ ముద్దుపేరును అతడికి ఖరారు చేసింది. చిన్ననాటి నుంచే ఆయనకు సాహసాలంటే ఎనలేని మక్కువ. తండ్రి మైకీ గ్రిల్స్‌ బ్రిటన్‌ నౌకాదళ కమాండోగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా స్థిరపడ్డారు. పర్వతారోహణ, ఈత వంటి విద్యలను చిన్నతనంలో తండ్రి నుంచి బేర్‌ నేర్చుకున్నాడు. పడవల తయారీలోనూ తర్ఫీదు పొందాడు. ఇవన్నీ చిన్నారి బేర్‌లో సాహసాలకు బీజాలు వేశాయి. 18 ఏళ్లు వచ్చేసరికి ఆయన పర్వతారోహణ, స్కైడైవింగ్‌, కరాటేలో నిష్ణాతుడయ్యారు.  1994లో బేర్‌ బ్రిటన్‌ సైన్యంలోని ప్రత్యేక రిజర్వు దళంలో చేరారు. ఆ సమయంలో ఆయన.. సమీపం నుంచే శత్రువుతో పోరాటం, ఒట్టి చేతులతో ప్రత్యర్థిని మట్టి కరిపించడం, సంక్లిష్టమైన, ప్రమాదకరమైన ప్రాంతంలో చిక్కుకుపోయినప్పుడు మనుగడ సాగించడం, శీతల పరిస్థితుల్లో పోరు, పారాచూటింగ్‌, పేలుడు పదార్థాల నిర్వహణ వంటి సాహస విద్యల్లో నైపుణ్యం సాధించారు. అనంతరం ఆయనను ఉత్తర ఆఫ్రికాలో సైనిక శిక్షకుడిగా బ్రిటన్‌ సైన్యం పంపింది. కెన్యాలో పారాచూటింగ్‌ చేస్తూ బేర్‌ ప్రమాదంలో చిక్కుకున్నారు. పారాచూట్‌ విచ్చుకోకపోవడంతో పడిపోయారు. వెన్నెముకలో మూడు చోట్ల గాయాలయ్యాయి. దీంతో మూడేళ్లకే ఆయన సైనిక కెరీర్‌ ముగిసింది. అయినా మొక్కవోని దీక్షతో తన సాహస ప్రస్థానాన్ని కొనసాగించారు. 
1998లో ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన బ్రిటన్‌ జాతీయుడిగా గుర్తింపు పొందారు. 
ఉత్తర అట్లాంటిక్‌లోని బ్రిటన్‌ దీవులను జెట్‌ స్కీయింగ్‌ ద్వారా చుట్టివచ్చారు. 
2008లో బేర్‌ నేతృత్వంలోని బృందం అంటార్కిటికాలోని మారుమూల పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ఆయన భుజం ఎముక విరిగింది. 
ఆయన సాహసాలకు గుర్తింపుగా బ్రిటన్‌ నౌకాదళం గౌరవ లెఫ్టినెంట్‌ కమాండర్‌ హోదాను ఇచ్చింది. 
బేర్‌ భార్య పేరు షారా. ఈ జంటకు ముగ్గురు కుమారులు. వారికీ సాహసక్రీడలంటే ప్రాణం. 
టీవీ కార్యక్రమాలు 

బేర్‌ సత్తాను గమనించిన అనేక టీవీ ఛానళ్లు ఆయనతో సాహస టీవీ షోలను రూపొందించాయి. ఐలాండ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌ కార్యక్రమం ఐదు సీజన్లలో ‘బాఫ్టా’ అవార్డులను గెల్చుకుంది. మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ ఏడు సీజన్లలో ఎమ్మీ అవార్డుకు నామినేట్‌అయ్యింది. 

రచనల్లోనూ రికార్డే: ‘మడ్‌ స్వెట్‌ అండ్‌ టియర్స్‌’ పేరుతో బేర్‌ తన జీవిత చరిత్రను రాశారు. 15 వారాల పాటు అది ‘సండే టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌’ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 85 పుస్తకాలు రాశారు. ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల ప్రతులు విక్రయమయ్యాయి.

మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌

మోదీ పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని గతంలో ‘బోర్న్‌ సర్వైవర్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’గా పిలిచేవారు. 2006 నుంచి ప్రసారమవుతోంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ బేర్‌.. తన సిబ్బందితో పాటు ఒక ప్రాంతంలో చిక్కుకుపోయి కనిపిస్తారు. అక్కడి ప్రతికూలతలను అధిగమించి, అక్కడ దొరికే పాములు, కీటకాలు, పచ్చి మాంసం తింటూ మనుగడ సాగిస్తాడు. పారాచూటింగ్‌, కార్చిచ్చు గుండా పరుగులు తీయడం, జలపాతాల్లోకి దూకడం, హిమ పర్వతాలపైకి ఎక్కడం, మొసళ్లతో కుస్తీలు వంటి వాటితో ఆయన ఆకట్టుకుంటారు.

ఇది ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న టీవీ కార్యక్రమాల్లో ఒకటి. దీన్ని 120 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు అంచనా.

బేర్‌తో ప్రముఖులు

ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు బేర్‌కు అభిమానులుగా ఉన్నారు. పలువురు ఆయనతో కలసి సాహసోపేత టీవీ షోల్లో పాల్గొన్నారు. వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రఖ్యాత తారలు, ప్రముఖులు కేట్‌ విన్స్‌లెట్‌, చానింగ్‌ టాటమ్‌, జక్‌ ఎఫ్రాన్‌, బెన్‌ స్టిలర్‌, కేట్‌ హడ్సన్‌, మిషెల్‌ రోడ్రిగెజ్‌, జేమ్స్‌ మార్డ్‌సన్‌, మైఖేల్‌ జోర్డన్‌, జూలియా రాబర్ట్స్‌, రోజర్‌ ఫెదరర్‌, విల్‌ ఫెరెల్‌ తదితరులు ఉన్నారు.

‘బేర్‌’మనాల్సిందే!

బేర్‌తో టీవీ కార్యక్రమమంటే సెలబ్రిటీలకు ఆషామాషీగా ఉండదు. 
ఒక ఎపిసోడ్‌లో అమెరికా నటి మిషెల్‌ రోడ్రిగెజ్‌ చేత స్వీయ మూత్రంలో నానబెట్టిన ఒక ఎలుకను తినిపించారు. 
నటుడు, రచయిత స్టీఫెన్‌ ఫ్రై చేత హెలికాప్టర్‌ కింద ఉండే స్టాండ్‌ మీద వేలాడుతూ గగనవిహారం చేయించారు. 150 మీటర్ల ఎత్తయిన జలపాతం నుంచి కిందకి దిగేలా చేశారు. ఒక దుప్పి కళేబర భాగాలను  తినిపించారు. 
టైటానిక్‌ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన నటి కేట్‌ విన్స్‌లెట్‌ చేత వానపాములను వండి, తినిపించారు.

2005లో ఆయన హాట్‌ ఎయిర్‌ బెలూన్‌కు వేలాడుతూ 25వేల అడుగుల ఎత్తులో విందును ఆరగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఓపెన్‌ ఎయిర్‌ విందుగా గుర్తింపు పొందింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.