close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఎందుకీ కరవులు.. ఏమిటా వరదలు?

ఈ రెండూ తరచూ అనుభవాలే 
వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదలతోనే పెను ప్రమాదం 
మనకు మరపు మరీ ఎక్కువ 
నీటి కొరత తగ్గించడానికి.. ప్రణాళికలేవి? 
దీర్ఘకాలిక సంసిద్ధత తక్షణ అవసరం 
‘ఈనాడు’తో ఐఎస్‌సీ శాస్త్రవేత్త గోవిందస్వామి బాల

ఓవైపు భారీ వరదలు.. మరోవైపు భయంకరమైన కరవు పరిస్థితులు. వేసవి వెళ్లిపోయినా ఆగని ఉక్కపోత, ఎక్కడా గట్టిగా నాలుగు చుక్కలు పడుతున్న దాఖలాలే ఉండటం లేదు. దుక్కి దున్నాలన్నా కష్టమే, విత్తు వేయాలన్నా నష్టమే. పట్టణం చూద్దామా.. తాగటానికి చుక్క నీరు గగనమై అల్లాడే పరిస్థితులు. ఎటుచూసినా ఎందుకింత వాతావరణ కలవరం? ఇటువంటి తీవ్ర పరిణామాలు ఎందుకు తలెత్తుతున్నాయి? ప్రభుత్వాల నుంచి సామాన్యుల వరకూ అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న ఈ పరిస్థితులపై శాస్త్ర పరిశోధనా రంగం ఏమంటోంది? దీనిపై బెంగళూరులోని అఖిల భారత శాస్త్ర విజ్ఞానాల సంస్థ (ఐఐఎస్‌సీ)కు చెందిన ‘సముద్ర, వాతావరణ శాస్త్ర అధ్యయన కేంద్రం’ ప్రొఫెసర్‌ గోవిందస్వామి బాలతో ఈనాడు ప్రత్యేక ముఖాముఖీ...


 

ఇది మనకు కొత్తేం కాదు! 

మన దేశంలో ఓ వైపు వరదలు, మరోవైపు కరవులేమిటని ఆశ్చర్యపోతూ వీటిని ప్రకృతి వైపరీత్యాలని అనుకుంటున్నాంగానీ వాస్తవానికి నానాటికీ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతలు, లోటు వర్షపాతాలు, వీటికి తోడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న జనాభా - పెనుసమస్యలు కాబోతున్నాయని హెచ్చరిస్తున్నారు ప్రొఫెసర్‌ బాల.

? దేశంలో ఏకకాలంలో వర్షాలు, వరదలు.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో క్షామం, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి. వీటిని తీవ్ర వాతావరణ మార్పులకు సంకేతాలుగా చూడొచ్చా? 
మీరు ఈ ఏటి పరిస్థితి గురించి అడుగుతున్నారుగానీ.. నిజానికి దేశంలో ఒక చోట వరదలు, మరోచోట కరవు పరిస్థితులన్నది కొత్తేం కాదు. దీన్నేమీ అరుదైన, అసాధారణ పరిస్థితిగా భావించనక్కర లేదు. అయితే ఇక్కడ ఆందోళనకర అంశం ఏమంటే- వరదలొచ్చే సంవత్సరాల కంటే క్షామం సంవత్సరాలు నానాటికీ పెరుగుతున్నాయి. గత 20 ఏళ్ల గణాంకాలు చూస్తే వరదలొచ్చే సంవత్సరాల సంఖ్య తగ్గిపోతోంది. అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలందరినీ కలవరపెడుతున్న  మరో అంశం- పసిఫిక్‌ రుతుపవనాలు అస్తవ్యస్తమవుతూ ‘లోటు వర్షపాతం’ అన్నది క్రమేపీ పెద్ద సమస్యగా  తయారవుతోంది. అందుకే ఈ గణాంకాల మీద ఇప్పుడు లోతుగా అధ్యయనాలు ఆరంభించారు.

 

? రుతుపవనాల జాప్యం, లోటు వర్షపాతాలకు కారణమేమిటంటారు? 
ఒక్కటని కచ్చితంగా చెప్పటం కష్టం. ఇవన్నీ సంక్లిష్టమైన వాతావరణ పరిణామాల్లో భాగం. వీటిని సమగ్రంగా గుర్తించటమన్నది శాస్త్రవేత్తల ముందున్న పెద్ద సవాల్‌. వీటికి సంబంధించిన ఆసక్తికర పరిణామాలు ఇప్పుడిప్పుడే గుర్తింపులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సూర్యుడి ఉపరితలం మీద తీవ్రమైన ఉష్ణ తుపానులు రేగుతూ, సౌర బింబం మీద కొన్ని మచ్చల్లా కనబడుతుంటాయి. ఈ ‘సన్‌ స్పాట్‌ నంబర్స్‌’కూ, రుతుపవనాలు వచ్చే సమయానికీ మధ్య సంబంధం ఉందని అర్థమవుతోంది. అలాగే దీనికి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత (ఎస్‌ఎస్‌టీ)లతోనూ లంకె ఉంది. ఎల్‌-నినో సంవత్సరాల్లో రుతుపవన వర్షాలు తక్కువగా ఉంటాయన్నది ఇప్పటికే గుర్తించిన విషయం. ఎల్‌-నినో అంటే మరేదో కాదు.. తూర్పు పసిఫిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో ఒక క్రమంలో వచ్చే మార్పులే! వీటితో పాటు ఐరోపా, ఆసియా (యూరేసియా)లలో మంచు ఏ స్థాయిలో పేరుకుందన్నది (స్నో కవర్‌) కూడా ముఖ్యమే. సరిగ్గా రుతుపవనాలకు ముందు ఆల్ప్స్‌ నుంచి హిమాలయాల వరకూ ఆ మంచు ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా మన దేశంలో రుతుపవనాలు ఆలస్యమవుతాయని, అది లోటు వర్షపాతానికి దారి తీస్తుందని గుర్తించారు. కాబట్టి మనం చూస్తున్న తీవ్ర మార్పులను ఏదో ఒకదానితో ముడి పెట్టెయ్యలేం. ఎల్‌-నినో, యూరేసియా స్నో కవర్‌.. అన్నవి రెండూ మాత్రం బలంగా నిర్ధారణ అయిన అంశాలు.

వ్యవసాయం విషయంలో ఏదో ఒక ఏడాది రుతుపవనాలు విఫలమైతే ఆందోళన అక్కర్లేదుగానీ.. వరసగా విఫలమవు  తుంటే..!

? ఈ పరిస్థితుల్లో మన వ్యవసాయం భవిష్యత్తు ఎలా ఉండబోతోందంటారు? 
దీనిపైనా చాలా అధ్యయనాలు జరిగాయి. వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు చూస్తే.. స్థూలంగా రుతుపవనాలు జాప్యమైతే వీటి దిగుబడుల్లో 5-10% తగ్గుదల కనబడుతోంది. దీని ఆధారంగా భవిష్యత్‌ లెక్కలు వేస్తున్నారుగానీ అవేం తిరుగులేని అంచనాలు కావు. ఎందుకంటే వేడిమిని తట్టుకునే వంగడాలు, పంట రకాలను వాడటం మొదలెడితే ఈ అంచనాలు మారిపోతాయి. అందుకే భవిష్యత్తు గురించి మనకు భయంకరంగా ఆందోళన అక్కర లేదు. కానీ ఒక్క ప్రమాదం ఉంది.. వరసగా క్షామ సంవత్సరాలు వచ్చి ఏటేటా 20% వర్షపాతం లోటు నమోదవుతుంటే మాత్రం పరిస్థితి ఆందోళనకరమే. అదే జరిగితే తీవ్ర ఇక్కట్లు తప్పవు. పట్టణాలకు వలసలు పెరిగిపోతాయి. గతంలో మహారాష్ట్రలో వర్షాల్లేక గ్రామాల నుంచి జనం భారీగా ముంబయికి తరలటంతో ఏమైందో మనకు తెలుసు. కాబట్టి వ్యవసాయం విషయంలో ఏదో ఒక ఏడాది రుతుపవనాలు విఫలమైతే ఆందోళన అక్కర్లేదుగానీ.. వరసగా విఫలమవుతుంటే? అదృష్టవశాత్తూ ఇప్పటి వరకూ ఆ పరిస్థితి రాలేదుగానీ ఎల్లకాలం ఇలాగే ఉంటుందని చెప్పలేం.

మనం చెయ్యాల్సింది చెయ్యకుండా.. పర్యావరణ మార్పులు, భూతాపం వంటి వాటి గురించి మాట్లాడటంలో పెద్దగా అర్థం ఉండదు!

? వేసవి వేడిమి, లోటు వర్షాల వల్ల తాగు నీరు కూడా దొరకని పరిస్థితులు తలెత్తుతున్నాయి కదా.. 
నీరు కచ్చితంగా పెద్ద సమస్యే. భూతాపం, పర్యావరణ మార్పుల వంటివి ఈ సమస్యకు ఒక పార్శ్వం. నిజానికి జల వనరుల స్థాయులేం పెరగబోవటం లేదుగానీ వాటి మీద బతకాల్సిన ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో మనకు పెను ముప్పు పర్యావరణ మార్పుల నుంచా? లేక పెరిగిపోతున్న జనాభా నుంచా? అన్నది ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరి అవసరాలైన నీరు, ఆహారం, ఇంధనం.. ఈ  మూడింటినీ మనం తేలికగా తీసుకోటానికి లేదు. చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ వేసవిలో చెన్నై తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంది. చెన్నైకి ప్రధానంగా ఈశాన్య రుతుపవనాలే ఆధారం. గత ఏడాది ఈశాన్య రుతుపవనం దాదాపు లేదు, దాంతో తమిళనాట 66% వర్షపాతం లోటు తలెత్తింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగా ఉండి, చెన్నైకి నీటి కొరత కనబడకపోవచ్చు. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిందేమంటే... ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి, పోతుంటాయి. అవి మళ్లీ రావనుకోటానికి లేదు. కాబట్టి వీటికి సమర్థంగా సంసిద్ధమై ఉండాలి. 2015లో చెన్నైలో వరదలు వచ్చి ఊరంతా మోకాల్లోతు నీటిలో మునిగింది కదా. మరింతలోనే పరిస్థితులు ఎందుకింతలా మారిపోయాయి? దీనర్థం మన ప్రణాళికలు సరిగా లేవనే! ఇవన్నీ వాతావరణ విపరీతాలని మనం చేతులు దులిపేసుకోటానికి లేదు. ఏదో ఈ సీజన్‌ గురించి మాట్లాడటం కాదు, మన దగ్గర కొన్నేళ్ల ప్రణాళికలు సిద్ధంగా ఉండాలి. అలాగే కిందటేడాది కేరళను వరదలు ముంచెత్తాయి కదా. అంతా మానవత్వంతో స్పందించారు, మంచిదేగానీ ఇప్పటికీ అసలా వరదలకు కారణమేంటి? నివారించే వీలుందా? అన్న శాస్త్రీయ అధ్యయనం చేసిన దాఖలాల్లేవు. కేరళకు వచ్చే పదేళ్లలో మళ్లీ వరదలు రాకపోవచ్చు. కానీ వచ్చే 20 ఏళ్లలో రావొచ్చు. దానికీ మనం సిద్ధంగా ఉండొద్దూ? దాన్నే నేను దీర్ఘకాలిక ప్రణాళిక అంటున్నాను.

2015లో చెన్నై ఊరంతా మోకాల్లోతు నీటిలో మునిగింది కదా. మరింతలోనే పరిస్థితులు ఎందుకింతలా మారిపోయాయి! 

? వేసవి కాలం ముగిసినా ఉష్ణోగ్రతలు అలా కొనసాగుతూ ఉంటున్నాయి.. దీని ఫలితం ఎలా ఉండబోతోంది? 
పర్యావరణపరంగా మనల్ని ఎక్కువగా కలవరపెట్టే అంశం ఈ వేడిమే. (హీట్‌ వేవ్స్‌) కొద్దిగా వర్షాలుపడి, వాతావరణం చల్లబడిదంటే చాలు.. మొన్న మేలో ఎంత వేడిగా ఉందో మనం చిటుక్కున మర్చిపోతాం. కానీ ఇది పెద్ద సమస్య. ఉష్ణోగ్రత ఒక పరిమితి దాటితే మన మనుగడ కూడా కష్టమే. మనమే కాదు, ఉష్ణమండల ప్రాంతమైన దక్షిణాసియా మొత్తం భూతాపంతో తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం కనబడుతోంది. భూతాపం 2-3 డిగ్రీలు పెరిగినా ప్రమాదమేనని అధ్యయనాలు చెబుతున్నాయి. వృద్ధులకు అది మరీ గడ్డుకాలం. దీన్ని తట్టుకునేదెలాగన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

? ఈ పరిస్థితుల్లో వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా మనం ఏం చెయ్యాలంటారు? 
చాలానే చెయ్యొచ్చు కానీ తక్షణం చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయి. చెరువుల పూడిక తీసిపెట్టుకుని.. మంచి వర్షం పడిన ఏడాది నీటిని ఒడిసిపట్టి, దాచు కోవటమన్నది మన సంప్రదాయ విజ్ఞానం. దాన్ని మర్చిపోతున్నాం. వర్షపు నీటిని భద్రపరచుకోవాల్సిన అవసరం ఒకప్పటి కంటే ఇప్పుడే ఎక్కువగా ఉంది. మనం చెయ్యాల్సింది చెయ్యకుండా.. పర్యావరణ మార్పులు, భూతాపం వంటి వాటి గురించి మాట్లాడటంలో పెద్దగా అర్థం ఉండదు!

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.