close

ప్ర‌త్యేక క‌థ‌నం

కార్లకూ హ్యాకింగ్‌ ముప్పు!

లాస్‌ఏంజెలెస్‌: కంప్యూటర్లలోకి వైరస్‌ చొప్పించడం, ఒక సంస్థ కంప్యూటర్‌ వ్యవస్థను, బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేయడం ఇప్పటిదాకా మనకు తెలిసిన సమస్యలు. కార్ల హ్యాకింగ్‌ అనే కొత్త ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. అంతర్జాలంతో అనుసంధానత కల్పిస్తూ.. వాహన తయారీదారులు రూపొందిస్తున్న కొత్త తరహా కార్లకు హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి కార్లు సైబర్‌ దాడికి గురైతే వేలమంది ప్రాణాలకు ప్రమాదం ఉందని అమెరికా లాస్‌ఏంజెలెస్‌కు చెందిన వినియోగదారుల హక్కుల సంస్థ..‘కన్స్యూమర్‌ వాచ్‌డాగ్‌’ తన తాజా నివేదిక ‘కిల్‌ స్విచ్‌’లో హెచ్చరించింది. వాహనాల వ్యవస్థల్ని తగినంత భద్రతాపరమైన ముందు జాగ్రత్తలు లేకుండా అంతర్జాలానికి అనసంధానించడం, హ్యాకింగ్‌కు గురయ్యే సందర్భాల్లో అనుసంధానతను తొలగించే మార్గం ఉండకపోవడం సమస్యాత్మకమేనని నివేదిక పేర్కొంది. కార్ల పరిశ్రమకు చెందిన 20 మందికిపైగా ప్రజావేగుల సాయంతో ఐదు నెలలపాటు నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. రద్దీ వేళల్లో హ్యాకింగ్‌ జరిగితే భారీ సంఖ్యలో ప్రజలు మరణించే అవకాశం ఉందని కార్ల పరిశ్రమ సాంకేతిక నిపుణుల బృందం చెబుతోంది. 
కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కారులోని పలు వ్యవస్థల్ని స్మార్ట్‌ఫోన్‌తోనే నియంత్రించవచ్చని, ఇంజిన్‌ను స్టార్ట్‌ చేయడం, ఏసీని తనిఖీ చేయడం, కారు ఎక్కడుందో గుర్తించడం వంటి పనులన్నీ సాధ్యమవుతాయని ప్రజావేగు ఒకరు పేర్కొన్నారు. అయితే, ఇలాంటి పనులన్నింటినీ యజమాని స్మార్ట్‌ఫోన్‌తో చేయగలిగినప్పుడు.. ఇతరులెవరైనా అంతర్జాలం ద్వారా వీటిని చేసే అవకాశం ఉంటుందన్నారు.

ఎలా నివారించాలి? 
అంతర్జాలంతో అనుసంధానమయ్యే వాహనాలన్నింటికీ ఇంటర్నెట్‌ కిల్‌ స్విచ్‌ను అమర్చాలని నివేదిక సూచిస్తోంది. కొత్త డిజైన్లలో సురక్షిత వ్యవస్థలను అంతర్జాల అనుసంధానిత ఇన్ఫోటైన్‌మెంట్‌, తదితర నెట్‌వర్క్‌ల నుంచి వేరు చేయాలని స్పష్టం చేస్తోంది. 


ప్రస్తుత కాలంలో కంప్యూటర్‌ వ్యవస్థల్ని ఉపయోగించే ప్రతి పరిశ్రమకూ సైబర్‌ భద్రత ప్రాధాన్య అంశమే. వాహన తయారీదారులు చాలా రక్షిత చర్యల్ని తీసుకుంటున్నారు. సైబర్‌ సెక్యూరిటీ అంశాలను జోడిస్తున్నారు. వినియోగదారులు కూడా  సైబర్‌ జాగ్రత్తల్ని పాటించాలి. 
-గ్లోరియా బెర్గ్‌క్విస్ట్‌, అధికార ప్రతినిధి, అలయన్స్‌ ఆఫ్‌ ఆటోమోబైల్‌ మ్యాన్యుఫ్యాక్చరర్స్‌.

హ్యాకింగ్‌  ఎలా.. 

కారులోని విభిన్న భాగాల మధ్య ఉమ్మడి ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ మాధ్యమంగా క్యాన్‌ (కంట్రోలర్‌ ఏరియా నెట్‌వర్క్‌) బస్‌ అనే వ్యవస్థ ఉంటుంది. భౌతికంగా క్యాన్‌ బస్‌ వ్యవస్థలోకి ప్రవేశిస్తే తప్ప ముప్పేమీ ఉండదు. అయితే, కార్లను సెల్యులర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించినప్పుడు, బయటి నుంచి క్యాన్‌బస్‌ వ్యవస్థలోకి చొరబడే అవకాశం కల్పించినట్లవుతోంది. దీనివల్ల హ్యాకర్‌ కారును భౌతికంగా ముట్టుకోకుండానే దాడి చేయొచ్చు. అంతేకాదు, ఒక హ్యాకర్‌ ఏకకాలంలో పలుకార్లపైనా దాడి చేపట్టవచ్చు. 

మొబైల్‌ ఫోన్‌తో దాడి 

కారు నడుపుతూనే ఫోన్‌లో మాట్లాడేందుకు వీలుగా మొబైల్‌ను కారుకు అనుసంధానించి బ్లూటూత్‌ సౌకర్యాన్ని ఉపయోగించే సందర్భాల్లో ఫోన్‌లోని వైరస్‌ లేదా మాల్‌వేర్‌ను కారు వ్యవస్థలోకి చొప్పించే అవకాశం ఉంది.

నేరుగా  దాడి 

2015లో క్రిస్‌ వలసెక్‌, చార్లీ మిల్లర్‌ అనే వ్యక్తులు తమ సొంత వాహనాన్నే ప్రయోగాత్మకంగా హ్యాక్‌ చేశారు. ఓ ల్యాప్‌టాప్‌ సాయంతో సెల్యులర్‌ నెట్‌వర్క్‌ ద్వారా వాహనంలోని ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టంలోకి చొరబడ్డారు. అదే సమయంలో ఇతర వాహనాలనూ స్కానింగ్‌ చేసినప్పుడు 2,695 వాహనాలు హ్యాకింగ్‌ బారిన పడే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.

ఒక వాహనం నుంచి మరో వాహనం 

ఒక వాహనం నుంచి ఇతర వాహనాలకు మాల్‌వేర్‌ను వ్యాప్తి చేయొచ్చు. ఇందుకోసం వైఫై, సెల్యులర్‌, డిజిటల్‌ కమ్యూనికేషన్‌లను ఉపయోగించుకోవచ్చు.

వైఫై హాట్‌స్పాట్‌ నుంచి దాడి 

ఒక రద్దీ కూడలిలో ఉండే బహిరంగ వైఫై హాట్‌స్పాట్‌ ద్వారా దాని పరిధిలోని వైఫై సౌకర్యముండే వాహనాలను మాల్‌వేర్‌తో హ్యాకింగ్‌ చేయొచ్చు.

యాప్‌తో దాడి 

కారులో ఏవైనా డిజిటల్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసినట్లయితే మాల్‌వేర్‌ వ్యాప్తికి దారిచ్చినట్లే. యాప్‌లోని లోపాల ద్వారా హ్యాకర్లు ఎక్కడో ఉండి కారు స్టీరింగ్‌, బ్రేకింగ్‌, యాక్సిలరేటర్‌లపై నియంత్రణ సాధించవచ్చు. 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.