Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

హెచ్‌సీయూకు నవ్యదశ

శ్రేష్ఠతర హోదాకు కేంద్రానికి కమిటీ సిఫార్సు.. త్వరలో ఆమోదం 
వచ్చ0ే అయిదేళ్లలో రూ.1000 కోట్ల నిధి 
తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటే 
ఉస్మానియా యూనివర్సిటీకి నిరాశ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం నమ్మకం నిజం కానుంది. శ్రేష్ఠతర విద్యాసంస్థ(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌)గా తెలుగు రాష్ట్రాల నుంచి హెచ్‌సీయూ మాత్రమే ఎంపికైంది. ఎంపికైన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు వచ్చే అయిదేళ్లలో రూ.1000 కోట్లు ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను వడపోసి.. గతేడాది జులైలో ప్రభుత్వ విద్యాసంస్థలు 20, మరో 20 ప్రైవేట్‌ సంస్థలను ఎంపిక చేశారు. వాటిల్లో తెలంగాణ నుంచి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆంధ్రా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. పది ప్రభుత్వ, పది ప్రైవేట్‌ సంస్థలను ఎంపిక చేయాల్సి ఉండగా 2018 జులైలో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ విద్యాసంస్థలను ఎంపిక చేశారు. వాటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ ఎంపిక కాలేదు. హెచ్‌సీయూ ఉపకులపతి ఆచార్య పొదిలె అప్పారావు మాత్రం మొదటినుంచి తమ విశ్వవిద్యాలయం రెండో విడతలో ఎంపికవుతుందని నమ్మకంగా ఉన్నారు. తాజాగా హెచ్‌సీయూకు శ్రేష్ఠతర హోదాకు కమిటీ సిఫార్సు చేయడం విశేషం. తాజా మాజీ ఉపకులపతి రామచంద్రం పదవీ విరమణకు కొద్దిరోజుల ముందు తమ విశ్వవిద్యాలయం హోదాకు ఎంపికవుతుందని ధీమా వ్యక్తం చేయగా అది సాకారమవుతోంది. ఈ జాబితాలో తమకు చోటు దక్కుతుందని ఆశపెట్టుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నిరాశే ఎదురైంది. 
క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్‌పై పోరాటం 
కొన్నేళ్లుగా ప్రతిష్ఠాత్మక క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లో హెచ్‌సీయూకు చోటు దక్కుతుండగా ఇటీవల 2020 ర్యాంకింగ్‌లో స్థానం లభించలేదు. క్యూఎస్‌ ప్రపంచ ర్యాంకు ప్రతినిధులు ఎక్కడో తప్పు చేశారని హెచ్‌సీయూ ఉపకులపతి అప్పారావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌, కార్యదర్శి సుబ్రమణ్యం క్యూఎస్‌ ప్రతినిధులను పిలిపించి ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అప్పారావు తన వాదన వినిపించారు. దాంతో క్యూఎస్‌ ప్రతినిధులు పొరపాటు జరిగిందని అంగీకరించి 601-650 మధ్య స్థానం కల్పించారు. దేశంలో ఏడో ర్యాంకు ఇచ్చారు. తాజాగా శ్రేష్ఠతర హోదాకు ప్రపంచ ర్యాంకునే ప్రధానంగా కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఉపకులపతి అప్పారావు ‘ఈనాడు’తో మాట్లాడుతూ సమీప భవిష్యత్తులో వర్సిటీ ప్రతిష్ఠ మరింత పెంచుతానని చెప్పారు. తమకు పరిశోధనే బలమని, దాన్ని మరింత మెరుగుపరుస్తామన్నారు. 
ప్రయోజనాలు ఎన్నో 
శ్రేష్ఠతర హోదాకు ఎంపికైతే కేంద్రం ఇచ్చే రూ.1000 కోట్లతో ప్రపంచస్థాయి వర్సిటీలకు తగ్గ సౌకర్యాలు కల్పించవచ్చు. ప్రయోగశాలలను ఆధునికీకరించవచ్చు. కొత్త కోర్సులను ప్రవేశపెట్టవచ్చు. ప్రపంచంలోని 500 ర్యాంకులలోపు విద్యాసంస్థలతో ఒప్పందం చేయవచ్చు. అందుకు కేంద్రం లేదా యూజీసీ అనుమతులు అవసరంలేదు. విదేశీ ఆచార్యులను నియమించుకోవచ్చు. వీటివల్ల అంతర్జాతీయ ర్యాంకు పెరిగితే విదేశీ విద్యార్థులు సైతం పెరుగుతారు.

హెచ్‌సీయూకు ‘శ్రేష్ఠతర’ కిరీటం 
దేశవ్యాప్తంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు సంస్థల సిఫార్సుకు యూజీసీ తీర్మానం 

ఈనాడు, దిల్లీ: దేశంలోని 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యాసంస్థలకు ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ హోదా ఇవ్వడానికి సిఫార్సు చేయాలని యూజీసీ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది. ఎన్‌.గోపాలస్వామి నేతృత్వంలో ఏర్పాటైన సాధికార నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా శుక్రవారం జరిగిన 542వ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు యూజీసీ నిర్ణయించింది. మొత్తం 15 ప్రభుత్వ, 15 ప్రైవేటు విద్యాసంస్థల జాబితాను పారదర్శకంగా పరిశీలించి అందులో ఒక్కో విభాగంలో పదింటికి ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ హోదా ఇవ్వడానికి సిఫార్సు చేయాలని యూజీసీ తీర్మానం చేసింది. ప్రపంచ, జాతీయస్థాయి ర్యాంకింగ్‌లు పొందిన వాటికి మాత్రమే ఈ హోదా సిఫార్సు చేసింది.  
ప్రభుత్వ విద్యాసంస్థల్లో: 1.ఐఐటీ బాంబే, 2.ఐఐటీ ఢిల్లీ, 3.ఐఐఎస్‌ఈ బెంగళూరు, 4.ఐఐటీ మద్రాస్‌, 5.ఐఐటీ ఖరగ్‌పూర్‌, 6.ఢిల్లీ యూనివర్సిటీ, 7.యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, 8.జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, కోల్‌కత్తా, 9.అన్నాయూనివర్సిటీ, చెన్నై, 10.బెనారస్‌ హిందూయూనివర్సిటీ, వారణాసి. 
ప్రైవేటు విద్యాసంస్థల్లో:  1.బిట్స్‌ పిలానీ, రాజస్థాన్‌, 2.మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, 3.జియో ఇన్‌స్టిట్యూట్‌ (రిలయన్స్‌ ఫౌండేషన్‌), 4. అమృతా విశ్వ విద్యాపీఠం, 5.విట్‌ వెల్లూరు, తమిళనాడు, 6.జామియా హమ్‌దర్ద్‌, దిల్లీ, 7.కలింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌, 8. ఓపీ జిందాల్‌ యూనివర్సిటీ, హరియాణా, 9.శివ్‌నాడార్‌ యూనివర్సిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌, 10.భారతి (సత్యభారతి ఫౌండేషన్‌), దిల్లీ (ఇంకాఏర్పాటు కాలేదు) ఉన్నాయి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.