close

ప్ర‌త్యేక క‌థ‌నం

కశ్మీర్‌ నివురుగప్పిన నిప్పు

అధికారులు, ఆస్పత్రులకు అప్రమత్తత సూచనలు 
ఏదో జరగబోతోందని విపక్షాల సందేహం.. కేంద్రం నివృత్తి చేయాలని డిమాండ్‌

జమ్మూకశ్మీర్‌పై ప్రచారంలో ఉన్న వదంతులను నమ్మి ఆందోళనకు గురికావద్దు. ప్రశాంతంగా ఉండాలి. భద్రతా కారణాల వల్లే కశ్మీర్‌ లోయలో అదనపు బలగాల మోహరింపును చేపడుతున్నాం. రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనల్లో ఏమైనా మార్పులు జరుగుతాయా అన్న అంశంపై నాకు సమాచారం లేదు.

-వివిధ పక్షాల నేతలతో జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌

అందాల లోయలో ఏదన్నా అనూహ్యం జరగబోతోందా? 
ఏం జరగొచ్చు? 
ఏమీ లేకపోతే ఇంత హడావుడి ఎందుకు కనిపిస్తోంది? 
కశ్మీర్‌తో పాటు దేశమంతటా ఇవే సందేహాలు. 
ఆందోళన వద్దని రాష్ట్ర గవర్నర్‌ చెబుతున్నా శరపరంపరగా జరిగిపోతున్న పరిణామాలు విపక్షాలు, ప్రజల్లో కలవరానికి కారణమవుతున్నాయి. అందమైన చినార్‌ చెట్ల మధ్య నుంచి కనిపించే సూర్యోదయంతో పాటే సందేహాలు, భయాందోళనలూ కూడా ఉదయిస్తున్నాయి. 


కొద్దిరోజుల్లో ఏదో జరగబోతోందన్న ఉత్కంఠతో ఇక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అదనపు బలగాల మోహరింపులతో కొద్దిరోజుల కిందట మొదలైన అనిశ్చితికి అమర్‌నాథ్‌ యాత్రికులు, పర్యాటకులు సాధ్యమైనంత త్వరగా రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోవాలంటూ శుక్రవారం జారీ అయిన ప్రకటన ఆజ్యం పోసింది. దానికి కొనసాగింపుగా చకచకా పరిణామాలు జరిగిపోయాయి. వసతి గృహాలను ఖాళీ చేయాలంటూ విద్యార్థులకు ఉత్తర్వులు జారీ కావడం, కిస్తవాడ్‌లో వార్షిక మచైల్‌ మాత యాత్రను నిలిపివేయడం, ప్రజలు బంకర్లలో తలదాచుకోవాలంటూ సూచనలు జారీకావడం వేడిని మరింత పెంచాయి. ఈ పరిస్థితుల్లో మాజీ సీఎంలు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలోని రాజకీయ పార్టీల బృందాలు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను కలిసి ప్రజల్లో నెలకొన్న భయాందోళనల గురించి వివరించాయి. అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేయాలన్న నిర్ణయంపై కాంగ్రెస్‌ మండిపడింది. మరోవైపు కార్గిల్‌ సెక్టార్‌లో ఉద్యోగులెవరూ విధి నిర్వహణ ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని, ఫోన్‌లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వైద్యులను తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంచుకోవాలని ఆస్పత్రులకు సూచనలు అందాయి. తాజా పరిస్థితుల్లో కశ్మీర్‌లో పర్యటనలు వద్దంటూ బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులకు అప్రమత్త సూచనలు చేశాయి. మరోవైపు నియంత్రణ రేఖ వద్ద కూడా ఉద్రిక్తతలు పెరిగాయి.

 

దేనికి మూడిందో! 
ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ, పీవోకేలలో దేనిపై కేంద్రం గురి?

కశ్మీర్‌ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దుకోసమే ఇదంతా అని, ప్రత్యేక హక్కులు ఇస్తున్న ఆర్టికల్‌ 35ఏ ని రద్దుచేస్తారని... కాదుకాదు పాక్‌ ఆక్రమణలో ఉన్న పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికేనని ఇలా.. ఎవరికి తోచిన అనుమానాల్ని వారు వ్యక్తంచేస్తున్నారు. ఇంతటి చర్చకు, వివాదానికి కారణమైన ఈ మూడు అంశాలూ ఇప్పుడు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి.

ఆర్టికల్‌ 370; ‘కశ్మీర్‌కు ప్రత్యేకం’!

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 పేరిట చేర్చిన తాత్కాలిక నిబంధన ఇది. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లు అనే మూడు అంశాలకే ఈ విలీనం పరిమితమైంది. విలీనం తుది విధి విధానాలు అప్పటికింకా ఖరారు కాలేదు. వీటిపై 1949 జులైలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత షేక్‌ అబ్దుల్లా భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. పర్యవసానంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రాజ్యాంగంలో చేర్చారు. దీని ప్రకారం రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్‌ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇతర చట్టాల్ని అమలుచేయాలంటే రాష్ట్ర సమ్మతిని పార్లమెంటు తీసుకోవాల్సి ఉంటుంది. పౌరసత్వం, ఆస్తిపై హక్కు, ప్రాథమిక హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల వారు భూముల్ని కొనలేరు.  ఆర్టికల్‌ 360 కింద ఈ రాష్ట్రంలో కేంద్రం ఆర్థిక ఎమర్జెన్సీని విధించలేదు.

ఆర్టికల్‌ 35ఏ; హక్కుల నిబంధన 
రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్‌ జమ్మూకశ్మీర్‌ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. 
జమ్మూకశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని నిర్వచిస్తుంది. 
వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది.

కశ్మీరీ నివాసి అంటే.. 
కశ్మీర్‌ శాశ్వత నివాసి ఎవరు అన్న దానిని రాష్ట్ర రాజ్యాంగం నిర్వచించింది. 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్‌ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్‌షిప్‌లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఆర్టికల్‌ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చొచ్చు. కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే మాత్రం- ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్‌ను ఇవ్వరు. ఈ నిబంధన చట్టవ్యతిరేకమని 2002లో జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రకటించింది. కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదని 1956 నవంబరు 17వ తేదీన ఆమోదించిన రాష్ట్ర రాజ్యాంగం చెబుతోంది.

ఎలా వచ్చిందంటే.. 
నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత షేక్‌ అబ్దుల్లా, ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన దిల్లీ ఒప్పందం ప్రకారం కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే 14న రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 35ఏ కింద చేర్చారు. అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇదీ పీవోకే... 
విస్తీర్ణం: 13300 చదరపు కి.మీ.లు. 
జనాభా: దాదాపు 50 లక్షలు. 
రాజధాని: ముజఫరాబాద్‌. 
సరిహద్దులు: పాకిస్థాన్‌లోని పంజాబ్‌, అఫ్గానిస్థాన్‌లోని వఖాన్‌, చైనాలోని జింజియాంగ్‌, భారత్‌లోని కశ్మీర్‌తో..

పీవోకే: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌

ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆక్రమణలో ఉన్న ఈ భూభాగం(పీవోకే) ఒకప్పుడు జమ్మూకశ్మీర్‌ సంస్థానంలో భాగం. 1947 అక్టోబరులో పాకిస్థాన్‌ సైన్యం అండతో పష్తూన్‌ గిరిజనులు జమ్మూకశ్మీర్‌పై దాడి చేసి పీవోకేను ఆక్రమించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి జమ్మూకశ్మీర్‌ పాలకుడు హరిసింగ్‌ భారత సైన్యం సాయం తీసుకున్నారు. ఆ తర్వాత కశ్మీర్‌ సంస్థానాన్ని హరిసింగ్‌ భారత యూనియన్‌లో విలీనం చేశారు. అప్పట్నుంచి జమ్మూకశ్మీర్‌ మొత్తంపైనా తమకు పూర్తి హక్కు ఉందని భారతదేశం వాదిస్తోంది. దీనిని పాకిస్థాన్‌ వ్యతిరేకిస్తోంది. పీవోకే తమదేనంటూనే.. కశ్మీర్‌లోనూ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా తమ ఆక్రమణలో ఉన్న భూభాగాన్ని పాకిస్థాన్‌ ‘ఆజాద్‌ కశ్మీర్‌’ అని పిలుస్తుంది. పీవోకేలో రెండు భాగాలు. 1. ఆజాద్‌ కశ్మీర్‌ 2. గిల్గిత్‌- బాల్టిస్థాన్‌. బాల్టిస్థాన్‌లోని షక్సగమ్‌ నుంచి గిల్గిత్‌లోని రుక్సం వరకున్న భూభాగాన్ని పొరుగునున్న చైనాకు పాకిస్థాన్‌ ధారదత్తం చేసింది. దీన్ని ‘ట్రాన్స్‌ కారకోరం మార్గం’ అంటారు. కశ్మీర్‌లోని అక్సాయిచిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. తాత్కాలిక రాజ్యాంగ చట్టం ప్రకారం ఆజాదీ కశ్మీర్‌(ఏజేకే) పరిపాలన కొనసాగుతోంది. దీనికి ప్రత్యేక అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉన్నప్పటికీ.. ఈ పాలనాయంత్రాంగానికి ఎలాంటి అధికారాలూ లేవు. ప్రతి చిన్న దానికీ పాకిస్థాన్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి.
- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.