close

ప్ర‌త్యేక క‌థ‌నం

పల్లెలు పచ్చబడాలె

అన్ని గ్రామాల్లో 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి 
అధికారులు, సర్పంచుల సంఘం ప్రతినిధులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
నిర్దేశించిన పని చేయని అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు 
స్థానిక సంస్థల్లో పోస్టులను భర్తీ చేస్తాం 
పన్నుల వసూలు పూర్తి బాధ్యత గ్రామ కార్యదర్శిదే 
వీధి దీపాల కోసం మూడో లైన్‌ 
ఈనాడు డిజిటల్‌ - హైదరాబాద్‌

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా యుద్ధప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల్లో ‘60 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 60 రోజుల కార్యాచరణలో విద్యుత్‌ వారోత్సవం, హరితహారం ఉంటాయన్నారు. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి అధికారులు, సర్పంచుల సంఘం ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో ఎవరికి ఎలాంటి అధికారాలు, విధులు ఉంటాయో, ఏ విధంగా నిధులు సమకూరుతాయో స్పష్టంగా వివరిస్తూ నూతన పంచాయతీ రాజ్‌ చట్టం రూపొందించామన్నారు. సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమనయాదవ్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడు ప్రణీత్‌ చందర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి బాచిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎవరినీ ఉపేక్షించం 
పంచాయతీరాజ్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లలో పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ‘అన్ని జిల్లాలకు జిల్లా పంచాయతీ అధికారులను (డీపీవో), రెవెన్యూ డివిజన్‌కు ఒక డీఎల్పీవోని, మండలానికొక ఎంపీవోని- మండల పంచాయతీ అధికారిని నియమించాలి. ఈవోపీఆర్‌డీ పేరును ఇక ఎంపీవోగా మార్చాలి. ఎంపీడీవో, సీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పోస్టులను భర్తీ చేయడానికి వీలుగా పంచాయతీ అధికారులకు పదోన్నతులు ఇవ్వాలి. శాఖాపరంగా కొత్త నియామకాలు చేపట్టాలి. ఈ ప్రక్రియ అంతా చాలా వేగంగా పూర్తి కావాలి’ అని ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో ఆరు నెలల్లో విధిగా శ్మశాన వాటికలు (వైకుంఠధామాలు) నిర్మించాలని స్పష్టం చేశారు. ‘‘స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి మారలేదు. వివిధ రూపాల్లో వేలకోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఫలితం కనిపించడం లేదు. పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయి. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు బాగు చేసుకునే పద్ధతి రావడంలేదు. నూతన చట్టం అమలులో చాలా మొండిగా వ్యవహరిస్తాం. ఎవరినీ ఉపేక్షించం. గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ఏం చేయాలో అది చేస్తాం.

పంచాయతీలపై పెను భారం దిగిపోయింది 
మిషన్‌ భగీరథ ద్వారా ప్రభుత్వమే తాగునీటిని సరఫరా చేస్తున్నందున గ్రామ పంచాయతీలపై పెను భారం దిగిపోయింది. విద్యుత్‌, సాగునీటి కల్పన, చెరువుల పునరుద్ధరణ, రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం మొదలైన కీలక పనులన్నీ ప్రభుత్వమే నేరుగా చేస్తుంది. పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెట్టాలి. 60 రోజులు ముగిశాక ముఖ్య అధికారుల నేతృత్వంలో 100 ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏ గ్రామంలో అయితే 60 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన పనులు పూర్తి చేయలేదో అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటాం.
 

విద్యుత్‌ వారోత్సవంలో... 
ఏడు రోజుల పాటు పూర్తిగా విద్యుత్‌ సంబంధ సమస్యలను పరిష్కరించాలి. 
వీధి దీపాల కోసం ఎంత విద్యుత్‌ వాడుతున్నారో కచ్చితమైన నిర్ధారణకు రావాలి. మీటర్లు పెట్టాలి. వీధి దీపాల కోసం మూడో లైన్‌ వేయాలి. ఎల్‌ఈడీ బల్బులు అమర్చాలి. 
ఒంగిపోయిన స్తంభాలు, వేలాడే విద్యుత్‌ తీగలను సరి చేయాలి. కర్ర, ఇనుప స్తంభాలను తొలగించి సిమెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలి.

60 రోజుల ప్రణాళిక ఇదే.. 

గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి. మురుగు కాల్వలు శుభ్రం చేయాలి.  
కూలిపోయిన ఇళ్లు, పాడైపోయిన పశువుల కొట్టాల శిథిలాలను పూర్తిగా తొలగించాలి. నిరుపయోగ, పాడుపడిన బావులు, నీటి గుంతలను పూడ్చేయాలి. ఇందుకోసం ఉపాధిహామీ నిధులను వినియోగించుకోవాలి.  
సర్కారు తుమ్మ, జిల్లేడు మొదలైన పిచ్చి మొక్కలను వందశాతం తొలగించాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు గ్రామంలో దోమల మందు పిచికారీ చేయాలి.  
రెండు వేల జనాభాకు ఒక వైకుంఠధామం (శ్మశాన వాటిక) కోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలి. గ్రామ డంపింగ్‌ యార్డు, కమ్యూనిటీ హాళ్లు, గోదాం నిర్మాణాలకు స్థలం సేకరించాలి. 

గ్రామానికి తగిన వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. 

హరితహారంలో... 

ఉపాధిహామీ నిధులతో పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ నర్సరీ ఏర్పాటు చేయాలి. మండల అటవీశాఖాధికారి సాంకేతిక సహకారం తీసుకోవాలి.  
గ్రామంలో విరివిగా మొక్కలు నాటాలి. మొక్కలన్నీ చెట్లుగా ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలి.  
ఇంటి యజమానులు, అన్నదాతలతో మాట్లాడి వారికికావాల్సిన మొక్కలను సరఫరా చేయాలి. అధిక సంఖ్యలో చింత మొక్కలు నాటాలి.

పంచాయతీల బాధ్యతలు

గ్రామంలో వందశాతం పన్నులు వసూలు చేయాలి. గ్రామ కార్యదర్శిదే పూర్తి బాధ్యత.  
వారపుసంత (అంగడి)లో సౌకర్యాలు కల్పించాలి.  
వివాహ రిజిస్ట్రేషన్‌ నిర్వహించాలి. గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్నా వెంటనే నమోదు చేయాలి.  
జనన, మరణ రికార్డులు రాయాలి. శిశువు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకు కులం వివరాలతో సహా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి.  
విద్యుత్‌ సంస్థలకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామపంచాయతీ నిధులతో ఉపాధి నిధులు అనుసంధానం అయ్యే విధానం రూపొందించాలి.  
ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలు, సంస్థలను సంప్రదించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యానికి కృషి చేయాలి.  
స్థానికులను శ్రమదానానికి ప్రోత్సహించి, సామాజిక పనులు చేయాలి.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.