Latest Telugu News, Headlines - EENADU
close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఈ అడుగుల దారెటు?

కశ్మీర్‌పై కేంద్రం ఆలోచనలు, వాటి పర్యవసానాలేమిటి?

కశ్మీర్‌ విషయంలో కేంద్రం వేస్తున్న అడుగులు భిన్న రకాల ఊహాగానాలు, చర్చలకు తావిస్తున్నాయి. కశ్మీర్‌లో శాంతి కోసం కేంద్రం పలు ప్రణాళికలు, ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అవి.. 1. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించడం. 2. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏ రద్దు. 3.పీవోకేపై దాడి చేయడం. 4 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ. 5. ఊరూరా జాతీయ జెండాల ఎగురవేత. 6. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. 7. భద్రత బలోపేతం

1  రాష్ట్రాన్ని మూడుగా విభజించడం

రాష్ట్రంలోని జమ్ము, లద్దాఖ్‌, కశ్మీర్‌ ప్రాంతాలను మూడు వేర్వేరు పరిపాలనా యూనిట్లుగా విభజించి, వాటికి నిధులు కేటాయించడం, అభివృద్ధి కార్యకలాపాల్ని ముమ్మరం చేయడం. మూడు భాగాలుగా విభజించడం వల్ల తీవ్రవాదాన్ని కశ్మీర్‌ ప్రాంతానికే కట్టడి చేయొచ్చు. కేంద్ర పాలన ద్వారా కశ్మీర్‌ను నియంత్రించొచ్చు.. జమ్ము, లద్దాఖ్‌లలో ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చు. 

ఏం జరగొచ్చు: కశ్మీర్‌పై కేంద్రం పూర్తి పెత్తనాన్ని, రాష్ట్రాన్ని మూడుగా విభజించడాన్ని స్థానికులు, రాష్ట్ర రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించొచ్చు.

2  ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35 ఏ రద్దు

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని, ప్రత్యేక హక్కుల్ని కల్పిస్తున్న రాజ్యాంగంలోని నిబంధనలివి. పార్లమెంటులో చేసే చట్టాలు కశ్మీర్లో అమలు కాకుండా ఆర్టికల్‌ 370 అడ్డుపడుతోంది. కశ్మీరీల శాశ్వత నివాస హక్కుల్ని ఆర్టికల్‌ 35ఏ నిర్దేశిస్తోంది. వీటిని రద్దుచేస్తే.. జమ్మూకశ్మీర్‌ కూడా దేశంలోని మిగతా రాష్ట్రాల్లాగానే మారుతుంది. దేశంలోని మిగతా రాష్ట్రాల వారు ఇక్కడ ఆస్తుల్ని సమకూర్చుకోవచ్చు. ఈ రాష్ట్రంలో పార్లమెంటు చట్టాల్ని అమలు చేయొచ్చు.

ఏం జరగొచ్చు: తమకు ప్రత్యేక హక్కుల్ని కల్పిస్తున్న ఈ రెండు అధికరణల్ని రద్దుచేస్తే కశ్మీరీలు, అక్కడి రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. హింసాత్మక పద్ధతుల్లో అడ్డుకోవడానికీ ప్రయత్నించొచ్చు. 

3 పీవోకేపై దాడి 

కశ్మీర్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)పై దాడిచేయడం. గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం. నియంత్రణ రేఖపై పట్టు సాధించడం. తద్వారా ఇటు తీవ్రవాదులకు అటు పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక సంకేతం పంపడం. పీవోకే గుండా సాగే సీమాంతర ఉగ్రవాదానికి చరమగీతం పలకడం.

ఏం జరగొచ్చు: పీవోకేపై దాడిని పాకిస్థాన్‌ తీవ్రంగా పరిగణిస్తుంది. అది మరో యుద్ధానికి దారితీయొచ్చు. రెండు దేశాల్లోనూ ఆందోళనకర పరిస్థితులు తలెత్తొచ్చు. 

4 అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ 

జమ్మూకశ్మీర్లో పీడీపీ-భాజపా సంకీర్ణ ప్రభుత్వ ప్రయోగం బెడిసికొట్టింది. గత జూన్‌ నెల నుంచి ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలవుతోంది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. ఎన్నికల నిర్వహణకు మిలిటెంట్లు అడ్డుపడకుండా చేయడానికే భారీగా బలగాల్ని మోహరిస్తున్నారన్న వాదన ఉంది. 

ఏం జరగొచ్చు: కల్లోలిత కశ్మీర్‌ లోయలో ఎన్నికల నిర్వహణకు స్థానిక యువత ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. పైపెచ్చు భాజపా ప్రాబల్యం జమ్ము, లద్దాఖ్‌ ప్రాంతాలకే పరిమితం కాబట్టి.. అత్యధిక స్థానాలు(46)న్న కశ్మీర్‌ లోయలో అది పైచేయి సాధించలేదు. అప్పుడు తిరిగి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటే అనివార్యమవుతుంది.

5  జాతీయ జెండాల ఎగురవేత

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూకశ్మీర్లోని ప్రతి పల్లెలోనూ జాతీయ జెండాలను ఎగురవేయాలని కేంద్రం యోచిస్తోంది. రాష్ట్రమంతటా భారత జాతీయ భావాన్ని పెంపొందించడం దీని లక్ష్యం.

ఏం జరగొచ్చు: పాకిస్థాన్‌ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్న, ఇప్పటికే పాకిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తున్న కొందరు కశ్మీరీ యువత- తమ పల్లెల్లో భారత జాతీయ జెండాను ఎగురవేయడాన్ని గట్టిగా వ్యతిరేకించొచ్చు. 

6  అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన

జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన అనేక ఏళ్లుగా నలుగుతోంది. రాష్ట్ర అసెంబ్లీలోని 87 స్థానాలకు గాను కశ్మీర్‌ ప్రాంతం నుంచి అత్యధికంగా 46 మంది సభ్యులున్నారు. జమ్ము నుంచి 37, లద్దాఖ్‌ నుంచి 4 అసెంబ్లీ స్థానాలున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మూడు ప్రాంతాల్లోని సీట్లను సమం చేసినా, లేదా జమ్ము, లద్దాఖ్‌లలో సీట్ల సంఖ్యను పెంచినా.. భాజపా పైచేయి సాధిస్తుంది. 

ఏం జరగొచ్చు: పునర్విభజన జరిగితే కశ్మీర్‌ కేంద్రంగా కొనసాగే రాజకీయాలు అంతమవుతాయి. లోయలో ముస్లింలు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న పార్టీలు ప్రాధాన్యం కోల్పోతాయి. ముఖ్యంగా ఫరూక్‌అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాల ప్రాబల్యం తగ్గిపోతుంది. అధికార కేంద్రం జమ్ము, లద్దాఖ్‌ల వైపు మళ్లుతుంది. దీనిని స్థానిక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అయితే 2026 దాకా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం లేదు.

7  భద్రత బలోపేతం

పాలనా యంత్రాంగాన్ని పటిష్ఠ పరచి, రాష్ట్రంలో భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం యోచిస్తోంది. 

ఏం జరగొచ్చు: భారత సైన్యాన్ని రాష్ట్రంలోని అన్ని మూలల్లోనూ మోహరిస్తుండడాన్ని స్థానికులు హర్షించడం లేదు. పల్లెల్లోకి ప్రవేశం పేరిట సైన్యం మరింతగా తమ జీవితాల్లోకి చొచ్చుకొస్తుందన్న ఆందోళన వారిలో ఉంది. 

- ఈనాడు ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.