close

ప్ర‌త్యేక క‌థ‌నం

ఇక కశ్మీర్‌లో ఏం జరగబోతోంది?

జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ 370 అధికరణాన్ని చెల్లని నాణెంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరిలో తలెత్తే సహజమైన ప్రశ్న ఇది. ఒక్క 370 అధికరణమే కాదు.... దాని ఆధారంగా కొనసాగుతున్న 35-ఎ అధికరణం కూడా ఉనికిని కోల్పోవటంతో ఈ ప్రశ్నకు ఎనలేని ప్రాధాన్యం చేకూరింది. 
కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ రెండింటిపై కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏమీ నిర్ఘాంతపరచదు. అయితే,  రాష్ట్ర హోదాను జమ్మూ-కశ్మీర్‌  కోల్పోతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ-కశ్మీర్‌ని మార్చుతున్నప్పటికీ శాసనసభ అధికారాలు పరిమితంగానే ఉంటాయి. భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని నిర్ణయించినట్లు అమిత్‌ షా చెప్పారు. బహుశా దిల్లీ అసెంబ్లీకి, అక్కడి ప్రభుత్వానికి ఉండే అధికారాల స్థాయిలోనే కశ్మీర్‌కూ ఉండొచ్చు. లద్దాఖ్‌ని విడదీసి దాన్నొక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. వాస్తవానికి 1846 నుంచి 1947 వరకూ ప్రత్యేక రాజ్యంగానూ, భారత్‌ యూనియన్‌లో విలీనం నాటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలతో కశ్మీర్‌కు ప్రత్యేక రాజకీయ అస్తిత్వం ఏర్పడింది. కశ్మీరీ భాషకు తోడు 370 అధికరణం వల్ల, ఈ సమస్య అంతర్జాతీయ వేదికలపై నానటం వల్ల కూడా రాష్ట్రంపై అస్తిత్వ భావన ప్రజల గుండెల్లో బలీయమైంది. 
తాజా రద్దు వల్ల కశ్మీర్‌ ప్రజలకు అధికారాల పరంగా జరిగే నష్టం ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. కాస్త అటూఇటుగా భారత రాజ్యాంగంలోని కీలక అంశాలన్నిటినీ క్రమేపీ జమ్మూ-కశ్మీర్‌కు వర్తింపచేశారు. 1954 నాటి రాజ్యాంగ ఉత్తర్వు మొదలు ఇప్పటివరకూ చూస్తే కశ్మీర్‌లో అమలుకానీ కీలక చట్టాలంటూ పెద్దగా లేవనే చెప్పుకోవాలి. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసే 356 రాజ్యాంగ అధికరణాన్ని కూడా జమ్మూ-కశ్మీర్‌లో ఎన్నోసార్లు అమలుచేశారు. ఎన్నికల నిర్వహణ అంతా భారత ఎన్నికల కమిషన్‌ చేతులోనే ఉంది. ఇక, సుప్రీంకోర్టు అధికారాలనూ సంపూర్ణంగా వర్తింప చేశారు. కశ్మీరీ స్థానికతకు నిర్వచనం, ఉద్యోగాల్లో రాష్ట్రపౌరుల కోటా, భూముల కొనుగోలు విషయంలో ఇతర రాష్ట్రాల ప్రజలపై నిషేధాలు, రాష్ట్రేతరులను వివాహమాడే మహిళల హక్కుల కుదింపు లాంటివి అధికరణం 35-ఎ ఆధారంగా లభించాయి. ఈ రక్షణలు మహారాజా హరిసింగ్‌ పాలనలోనూ ఏదో రూపంలో అమల్లో ఉండేవి. విలీనానంతర ప్రభుత్వాలు వాటిని సుస్థిరపరిచాయి. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం, భూముల కొనుగోలుపై నిషేధాలు కొన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న విషయం గమనార్హం. ఈ నేపథ్యంలో చూస్తే...కేంద్ర పాలిత రాష్ట్రంగా మార్చినంత మాత్రాన కశ్మీరులో ఇవన్నీ పూర్తిగా పోతాయని కూడా చెప్పలేం. 
ఉద్వేగమే ప్రధానం... 
ఇతర ప్రయోజనాల కంటే ఈ 370 అధికరణం  చుట్టూ అల్లుకున్న రాజకీయ ఉద్వేగమే ప్రధానమైంది. ఈ ఉద్వేగ బంధాన్ని తగ్గించటం మీద కశ్మీర్‌లో భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  అధికరణను రద్దుచేసినా రాష్ట్ర ప్రతిపత్తిని యథాతథంగా అట్టిపెట్టి ఉంటే పరిస్థితి కొంత మేరకు వేరుగా ఉండేది.   అయితే, రాష్ట్ర ప్రతిపత్తిని కొనసాగిస్తే మున్ముందు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్ధం ప్రమాదం ఉండవచ్చని కేంద్రం భావించి ఉండవచ్చు. ఒకవేళ అక్కడ ప్రజాబలంతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పతిపత్తి కోసం ఆందోళనలు చేయటమో, చేయించడమో అంటూ జరిగి ఆర్టికల్‌ 356 ప్రయోగించాల్సిన పరిస్థితే వస్తే...రాజకీయ ఇబ్బంది తప్పదని భావించి కేంద్ర పాలితŸంగా కొనసాగించడం వైపు మొగ్గు చూపి ఉండవచ్చు. 
రద్దును సాహసోపేతచర్యగానే కశ్మీరేతరులు భావించవచ్చు. కశ్మీర్‌ ప్రజలు తమకు స్వయంప్రతిపత్తి, ప్రత్యేకహోదా ఉందనుకుంటూ ఎలాంటి భావోద్వేగంతో ఉన్నారో, అలాగే వేరే కారణాలతో కశ్మీరేతరులు మరోరకంగా ఉద్వేగ బంధాన్ని ఏర్పరుచుకున్నారు. తీవ్రవాదుల దుశ్చర్యలతో భద్రతాదళాలు, పౌరులు ప్రాణాలు కోల్పోవటం, పన్ను రూపంలో తాము చెల్లించిన వేలకోట్ల రూపాయలను కశ్మీర్‌లోనే ఖర్చుపెట్టాల్సి రావటం వంటివి దేశ ప్రజల్లో కశ్మీర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే భావనలకు కారణమైనాయి. 370 అధికరణంపై  ప్రధాన స్రవంతి రాజకీయపార్టీల మధ్య ఏకాభిప్రాయం వస్తే బాగుండేది. కశ్మీర్‌ విలీనం, అధికరణ 370ని రాజ్యాంగంలో చేర్చటం, రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు లాంటి కీలక పరిణామాలన్నీ గతంలో చాలా వరకూ ఏకాభిప్రాయం మేరకే జరిగాయి. అయితే, పాక్‌ ప్రేరిత గిరిజన దాడులతో గత్యంతరం లేని పరిస్థితుల్లో జమ్మూ-కశ్మీర్‌ని భారత్‌లో విలీనానికి నాటి మహారాజు అంగీకరించారు. ప్రధానంగా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు పలికింది. భారత్‌ సైన్యానికి అన్ని విధాలా సాయమందించింది. ఆనాటికి లౌకిక దృక్పథంతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో సరితూగగల రాజకీయశక్తి రాష్ట్రంలో మరోటిలేదు.  పైగా, భారత్‌ వైపు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మొగ్గు చూపి ఉండకపోతే చరిత్ర మరోలా ఉండేది.  370 అధికరణం రద్దుకోసం జనసంఘ్‌ రోజుల నుంచి బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. జమ్మూ-కశ్మీర్‌ని మూడు భాగాలుగా విడగొట్టాలన్న వాదన కూడా ఎన్నోసార్లు వినిపించింది. అయితే, కశ్మీర్‌కు రాష్ట్ర స్థాయిని తీసేయాలన్న వాదన మాత్రం జనసంఘ్‌ నేతల నుంచి కూడా వినిపించలేదు. కనీసం ప్రధాన రాజకీయ పార్టీల మధ్య చర్చకైనా రాలేదు. అందుకే ఇది అసాధారణం. అపూర్వం. 
అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమేనా? 
భారత్‌తో విలీనానికి దోహదం చేసిన షేక్‌అబ్దుల్లాని పదవీచ్యుతుడ్ని చేసి ఖైదుకు పంపిన విషయంలోనూ ఆనాడు ఏకాభిప్రాయమే ఉంది. ఎన్నోసార్లు దేశ భద్రతా కారణాలతో జమ్మూ-కశ్మీర్‌లో ఇతరచోట్ల జరిగినంత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగలేదు. అయినప్పటికీ సరిహద్దుల్లో సున్నిత పరిస్థితుల దృష్ట్యా ఆ విషయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద సమస్యగా మార్చలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అలా వ్యవహరించేలా కనపడటం లేదు. లద్ధాఖ్‌ని విడదీసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే ఎన్నికల అవకాశం ఉంటుంది. జమ్మూలో అసెంబ్లీ సీట్లను పెంచాలన్న డిమాండ్‌ కార్యరూపం దాల్చడం అంతసులువైనదేమీ కాదు. బహుశా రెండు ప్రాంతాల మధ్య సమతూకం పాటించటానికి శాయశక్తులా ప్రయత్నాలు జరుగుతాయి. 370 అధికరణం రద్దు, కేంద్రపాలిత ప్రాంత హోదాపై అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి. అమెరికా ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. ఇక, భారత్‌ చేపట్టే ఏ చర్యనైనా సరే  పాక్‌ తప్పుబట్టడం షరామామూలే. మరోవైపు పాకిస్థాన్‌కు అండదండలందిస్తున్న చైనా కూడా కశ్మీర్‌ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఆక్రమిత కశ్మీర్‌ భూభాగాన్ని చైనాకు పాక్‌ కొంత ధారాదత్తం చేసిన విషయం గమనార్హం.  చైనా ఆర్థిక కారిడార్‌లో ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం కూడా ఓ భాగమే. 
చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న తర్వాత చేపట్టే చర్యలు కూడా అంతే స్థాయిలో ఉంటే 70 ఏళ్ల కశ్మీర్‌ సమస్య చరిత్రలో ఒక దశగా మిగిలిపోతుంది. అది జరిగిన నాడు దేశ విభజన జ్ఞాపకాలు కూడా బాధాస్మృతుల స్థాయినుంచి గతంలోకి జారిపోతాయి. కశ్మీర్‌లో ముస్లిం ప్రజలను ఎంతగా ప్రధాన స్రవంతిలోకి తీసుకు రాగలిగితే అంతగా ఇతర ప్రాంతాల ముస్లింలు కూడా సమాధానపడతారు.

- ఎన్‌.రాహుల్‌కుమార్‌

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.