close

ప్ర‌త్యేక క‌థ‌నం

మండే మంచు ముక్క

స్వాతంత్య్రం వచ్చినా శాంతి కరవైన కశ్మీర్‌

మంచు కొండల నడుమ చల్లచల్లగా ఉండే కశ్మీర్‌ రాజకీయంగా ఎప్పుడూ సెగలు పుట్టించేదే. కొండలు, లోయలతో మారుమూల ప్రాంతంగా కనిపించినప్పటికీ చరిత్రలో ఎన్నో మలుపులకు సాక్షీభూతంగా నిలిచింది. అసలు జమ్మూ-కశ్మీర్‌ రాజ్యం ఏర్పాటే చాలా ఆసక్తికరంగా జరిగింది. అన్ని రాజ్యాల మాదిరిగా ఇది యుద్ధంలో జయించింది కాదు.. డబ్బులిచ్చి కొనుక్కున్నది. ప్రాచీన కాలంలో ఎన్నో వంశాలు ఈ రాజ్యాన్ని ఏలాయి. 1339లో తొలి ముస్లిం పాలకుడు షా మీర్‌ పాలకుడయ్యాడు. 1586 వరకు ఆయన వంశస్థులే కొనసాగారు. అనంతరం మొఘలుల పాలనలోకి వెళ్లింది. 1751 వరకు మొఘలులు, తరువాత 1819 వరకు ఆఫ్గానిస్థాన్‌ దుర్రానీలు పాలకులయ్యారు. పిదప పంజాబ్‌ సిక్కుల ఏలుబడిలోకి వెళ్లింది. 1846లో జరిగిన తొలి ఆంగ్లో-సిక్కు యుద్ధంలో మహారాజా రంజిత్‌ సింగ్‌ ఓడిపోవడంతో ఈ ప్రాంతం చరిత్ర మారింది. ఆ సందర్భంగా ఆంగ్లేయులు, సిక్కుల మధ్య కుదిరిన ‘అమృత్‌సర్‌ ఒప్పందం’ ప్రకారం...అంతవరకు రంజిత్‌ సింగ్‌ రాజ్యంలో భాగంగా ఉన్న కశ్మీర్‌ను జమ్ము మహారాజైన డోగ్రా వంశానికి చెందిన గులాబ్‌ సింగ్‌కు రూ.75 లక్షలకు బ్రిటిష్‌ ప్రభుత్వం విక్రయించింది. ఆ విధంగా జమ్మూ-కశ్మీర్‌ రాజ్యం ఏర్పాటయింది. రాజ్యాన్ని అమ్మేసినప్పటికీ సంరక్షణ బాధ్యతలను మాత్రం బ్రిటిషు ప్రభుత్వమే చూసుకునేది. పన్నుల విధింపు, తదితర అధికారాలు మాత్రం మహారాజుకు ఉండేవి. అనంతరం ఆయన కుమారుడు రణబీర్‌ సింగ్‌ రాజయ్యాడు. ఆయనే శిక్షా స్మృతిని (పీనల్‌ కోడ్‌)ను రూపొందించారు. ఇప్పటికీ  జమ్మూ-కశ్మీర్‌లో రణబీర్‌ శిక్షా స్మృతే అమలవుతోంది. ఇది భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)కి అనుగుణంగానే ఉంటుంది. 
వివాదానికి బీజం ఎక్కడ? 
రణబీర్‌ సింగ్‌ మనుమడు హరిసింగ్‌ 1925లో కశ్మీర్‌ పాలన చేపట్టారు. భారత స్వాతంత్య్రోద్యమ ప్రభావం ఈ రాజ్యంపైనా పడింది. రాజ్యంలో తమ సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తమకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం లభించలేదన్న అభిప్రాయం ముస్లింలలో నెలకొంది. దీనిపై సాగిన ఆందోళనకు షేక్‌ అబ్దుల్లా నాయకత్వం వహించారు. దీనికితోడు పన్నుల భారానికి వ్యతిరేకంగా పూంచ్‌లో ఉద్యమం కూడా ప్రారంభమయింది. పూంచ్‌ తిరుగుబాటుదార్లు పొరుగునున్న అఫ్గాన్‌లోని పష్తూన్‌ గిరిజనుల సహాయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే స్వాతంత్య్రం సిద్ధించింది. ఇటు భారత్‌లోనో, అటు పాకిస్థాన్‌లోనో విలీనం కావాల్సిన పరిస్థితులు సంస్థానాదీశులకు ఎదురయ్యాయి. స్వతంత్రంగా ఉండాలని హరిసింగ్‌ అనుకున్నా అందుకు అవకాశం లేకుండా పోయింది. పాక్‌లో చేరాలన్న ఆందోళనలు జరగగా అవి పోలీసు కాల్పుల వరకు దారితీశాయి. పరిస్థితి చక్కబడిన తరువాత నిర్ణయం తీసుకుంటానంటూ హరిసింగ్‌ 1947లో పాకిస్థాన్‌తో యథాతథస్థితి ఒప్పందాన్ని (స్టాండ్‌స్టిల్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకున్నారు. వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్‌ ఇతర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. విలీనంపై హరిసింగ్‌ తాత్సారం చేస్తున్నారని భావించిన పాకిస్థాన్‌ 1947 అక్టోబరులో గిరిజనులను ప్రోత్సహించి దాడి చేయించింది. దాంతో రక్షణపరంగా సహాయం చేయాలని ఆయన భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. విలీనం చేయడానికి ఒప్పుకొంటేనే సహకరిస్తామని చెప్పడంతో అందుకు అంగీకరించారు. భారత సైన్యం వెళ్లడంతో గిరిజనులు వెనక్కితగ్గారు. గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ ప్రాంతాలు (ఇప్పటి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌) పాక్‌ ఆధీనంలోనే ఉండిపోయాయి. భారత్‌లో విలీనం కావాలన్న నిర్ణయంపై పాకిస్థాన్‌ అభ్యంతరం తెలిపి, ఆగ్రహం వ్యక్తం చేసింది. తమతో కుదుర్చుకున్న యథాతథ స్థితి ఒప్పందాన్ని ముందుకు తెచ్చింది. హరిసింగ్‌ సంతకం చేయడానికి ముందే భారత సైన్యాలు ప్రవేశించాయని, అందువల్ల ఇది దురాక్రమణే అని వాదించింది. కశ్మీర్‌ను విలీనం చేసిన తరువాతే తమ సైన్యాలు వెళ్లాయని భారత్‌ స్పష్టం చేస్తూ వస్తోంది. 1949 జనవరి ఒకటో తేదీన రెండు దేశాల మధ్య నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను నిర్ణయించారు. ఇదే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తాత్కాలిక సరిహద్దుగా కొనసాగుతోంది. 
మౌంట్‌బాటన్‌ ఏమన్నారు? 
మాటిచ్చిన మేరకు 1947 అక్టోబరు 26న హరిసింగ్‌ భారత్‌తో విలీన ఒప్పందంపై సంతకం చేశారు. దీనిపై మరుసటి రోజునే అప్పటి గవర్నర్‌ జనరల్‌ మౌంట్‌బాటన్‌ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర్వులు జారీ చేస్తూ ‘‘జమ్మూ-కశ్మీర్‌లో శాంతి భద్రతలు నెలకొన్న తరువాత...దురాక్రమణదారు తిరిగి వెళ్లిపోయిన అనంతరం...ప్రజలను సంప్రదించిన పిదప రాష్ట్ర విలీన సమస్య పరిష్కారమవుతుందని నా ప్రభుత్వం ఆశిస్తోంది’’ అని పేర్కొన్నారు. ఆక్రమిత కశ్మీర్‌ తిరిగి స్వాధీనమయిన తరువాతే ప్రజాభిప్రాయ సేకరణతో పాటు ఇతర అంశాలను పరిశీలించాలన్నది మౌంట్‌బాటన్‌ అభిప్రాయంగా కనిపించింది. అయితే ఈ విలీనం తాత్కాలికం మాత్రమేనని షేక్‌ అబ్దుల్లా అప్పుడే ప్రకటించారు. కశ్మీర్‌ను విడిచిపెట్టి రావాలని హరిసింగ్‌ను ఆదేశించిన ప్రభుత్వం అనంతరం షేక్‌ అబ్దుల్లా ఆధ్వర్యంలో అత్యవసర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమస్య తీవ్రతను గుర్తించిన రాజ్యాంగ సభ కూడా కశ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి ఇచ్చింది. అందులో భాగంగానే 370వ అధికరణం వంటి రక్షణలను కల్పించింది. 
స్వాతంత్య్రం తరువాత మూడు ముక్కలు 
1947 ఆగస్టు 15 నాటికి జమ్మూ-కశ్మీర్‌ వాస్తవానికి ఓ ప్రత్యేక దేశంగానే ఉండేది. అప్పట్లో దాన్ని ముల్క్‌ ఎ కశ్మీర్‌గా పిలిచేవారు. ఆ ఏడాదే మూడో వంతు భాగం పాకిస్థాన్‌ పరమయ్యింది. ఇక్కడ సరిహద్దు వివాదం తేలకపోవడంతో తాత్కాలిక సరిహద్దును నియంత్రణ రేఖ (లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌- ఎల్‌వోసీ)గా పిలుస్తున్నారు. 1962లో అక్సాయిచిన్‌ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకొంది. ఇది జింగ్‌యాంగ్‌ యువైగ్యుర్‌ స్వయంప్రతిపత్తి పాలన ప్రాంతంలోని ఓ భాగమని అంటోంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సరిహద్దును వాస్తవాధీన రేఖగా వ్యవహరిస్తున్నారు. అవి పోను మిగిలిన భాగమే భారత్‌ వాస్తవ అధికారంలో ఉంది. 
కశ్మీర్‌.. ఆ పేరు ఎలా వచ్చింది 
క అంటే నీరు... శిమీర అంటే తొలగించడం. 12వ శతాబ్దంలో రాసిన రాజతరంగణి గ్రంథంలో పేర్కొన్న ప్రకారం....ఈ ప్రాంతమంతా ఒకప్పుడు పెద్ద సరస్సు. కశ్యప మహర్షి వరాహ ములా (ప్రస్తుత బారాముల్లా) వద్ద కొండను పగులగొట్టి నీరంతా బయటకు వెళ్లిపోయేలా చేశాడు. సరస్సు ఎండిపోవడంతో ఆయన బ్రాహ్మణులను పిలిపించి ఇక్కడ నివసించాలని కోరాడు. ఆయన పేరున ఇక్కడ కశ్యప పుర కూడా ఏర్పాటయింది. గ్రీకులు దీన్ని కస్పెయిరియాగా పిలిచివారు.  9వ శతాబ్దం రాజు జంబులోచన పేరున జమ్మూ ఏర్పాటయింది.

పాక్‌తో నాలుగు యుద్ధాలు 

కశ్మీర్‌ విషయమై ఇంతవరకు భారత్‌-పాక్‌ల మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయి. 1947లో జరిగిన యుద్ధం మొదటిది కాగా, 1965లో జరిగింది రెండోది. వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి పాక్‌ సైనికులను రహ్యసంగా కశ్మీర్‌కు పంపించింది. ఈ చొరబాటుదార్లను ఎదుర్కోవడానికి భారత్‌ భారీ యుద్ధమే చేసింది. 17 రోజుల పాటు జరిగిన ఈ పోరు రెండో ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతి పెద్దది కావడంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రష్యాలోని తాష్కెంట్‌లో కుదిరిన ఒప్పందం కారణంగా యుద్ధ విరమణ జరిగింది. 1971లో జరిగిన మూడో యుద్ధం ప్రత్యక్షంగా కశ్మీర్‌కు సంబంధించింది కాకపోయినా ఆ రాష్ట్ర ప్రమేయం ఉంది. బంగ్లాదేశ్‌ ఏర్పాటు కోసం జరిగిన ఈ యుద్ధంలో భారత సేనలు ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పంజాబ్‌, సింధు ప్రావిన్స్‌ల్లోని 15,010 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. 90వేల మంది సైనికులు, పౌరుల్ని యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నాయి. అయితే అప్పటికే పాక్‌ జైలులో ఉన్న బంగ్లాదేశ్‌ నిర్మాత ముజబుర్‌ రహ్మన్‌ను ఉరివేయడానికి ఏర్పాట్లు చేయడం, అంతర్జాతీయ సూచనల మేరకు ఈ భూభాగాన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. సిమ్లా ఒప్పందం మేరకు ఈ అప్పగింత జరిగింది. ఈ యుద్ధంలో పాక్‌ సగం నౌకా దళాన్ని, నాలుగో వంతు వైమానిక దళాన్ని, మూడొంతుల సైన్యాన్ని నష్టపోయింది. 1999లో కార్గిల్‌ విషయమై దాదాపుగా యుద్ధమే జరిగింది.

చైనాతో మరొకటి... 
జమ్మూ-కశ్మీర్‌ సరిహద్దులపై 1962లో చైనాతోనూ యుద్ధం జరిగింది. ఈ సరిహద్దులకు కశ్మీర్‌ పాలకుడు గులాబ్‌ సింగ్‌కు సంబంధం ఉంది. 1842లో ఆయన టిబెట్‌ ఆక్రమణకు వెళ్లినప్పుడు యుద్ధం జరగకుండా వారితో ఒప్పందం కుదిరింది. లద్దాఖ్‌ను సరిహద్దుగా నిర్ణయించుకున్నారు. అయితే చైనా.. టిబెట్‌ను ఆక్రమించుకున్న తరువాత ఆ ప్రాంతమంతా తమదేనంటూ యుద్ధానికి దిగింది. 37,555 చ.కి.మీ. మేర అక్సాయిచిన్‌ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకొంది.
వేర్పాటువాదం పేరుతో పరోక్ష యుద్ధాలు 
ప్రత్యక్ష పోరులో పరాజయం పాలైన పాక్‌ వేర్పాటువాదం పేరుతో పరోక్ష యుద్ధాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ విషయాన్ని అప్పటి సైనిక పాలకుడు ముషారఫ్‌ స్వయంగా అంగీకరించారు కూడా. 1970 వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపేతం కాకపోవడం ప్రజా ఉద్యమాలకు తావిచ్చింది. దీనికి వేర్పాటువాదం అన్న రూపం ఇచ్చి పాక్‌ ఎగదోసింది. 1987లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫరూక్‌ అబ్దుల్లా గెలుపు కోసం అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ రిగ్గింగ్‌ చేయించారన్న ఆరోపణలు రావడంతో చాలా మంది సాయుధబాట పట్టారు. 1989 నుంచి జమ్మూ-కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌లాంటి సంస్థలు ఉద్యమాలు ప్రారంభించడంతో రాష్ట్రం అల్లకల్లోలమయింది. అక్టోబరు 26ను అధికారికంగా విలీన దినోత్సవంగా జరుపుతుండగా, వేర్పాటువాదులు నల్లదినంగా నిరసన తెలపడం పరిపాటిగా మారింది. అనంతరం లష్కర్‌ ఎ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు రంగ ప్రవేశం చేయడంతో కల్లోలిత రాష్ట్రంగా మారింది.
-ఈనాడు, ప్రత్యేక విభాగం

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.